హిల్లరీపై ట్రంప్ ఆధిక్యం
వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్ సర్వేలో 1 శాతం మెజారిటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌పై తొలిసారిగా పైచేయి సాధించారు. వాషింగ్టన్ పోస్ట్/ఏబీసీ న్యూస్ సర్వేలో ట్రంప్.. హిల్లరీ కన్నా ఒక శాతం ముందంజలో ఉన్నారు. సర్వేలో 45 % మంది ఓటర్లు హిల్లరీ పక్షాన నిలవగా, ట్రంప్‌కు 46 % మంది ఓటర్ల మద్దతు లభించింది. మరోవైపు హిల్లరీ, ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘హిల్లరీ వారానికి 65 కోట్ల మంది వలసదారులను అమెరికాలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అంటే 12 వారాల్లోనే అమెరికాలోని జనాభా, ప్రపంచ జనాభాను మించిపోతుంది.
ఇదే జరిగితే మనకంటూ దేశమే ఉండదు’ అని ట్రంప్ అన్నారు. తొలుత అమెరికాలో అనేక కంపెనీలు ఏర్పాటై వేలాది ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చాయనీ, ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ భారత్, చైనా, మెక్సికో తదితర దేశాలకు తరలిపోయాయనిపేర్కొన్నారు. తాను అధ్యక్షుడినైతే ఈ పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రైవేటు ఈమెయిళ్ల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తును పునఃప్రారంభించడంపై హిల్లరీ మండిపడ్డారు. ఈ విషయంలో తానే తప్పూ చేయలేదన్నారు. ట్రంప్‌కు రష్యాతో రహస్య సంబంధాలున్నాయని మీడియా నివేదిక వెలుగులోకి రావడంతో దానిపై సమాధానం చెప్పాలని హిల్లరీ డిమాండ్ చేశారు. ట్రంప్ సంస్థల్లో ఒక రహస్య సర్వర్ ఉందనీ, దాని నుంచి రష్యాలోని ఆల్ఫా బ్యాంకుకు చెందిన రెండు సర్వర్లతో ట్రంప్ కంపెనీ సంప్రదింపులు జరుపుతోందని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ట్రంప్ వర్గం తోసిపుచ్చింది.