నక్షత్రంపై గ్రహం జులుం..!
చండ, ప్రచండంగా నిప్పులు కక్కుతూ, ప్లాస్మా, ఎక్స్ కిరణాలను వెదజల్లుతూ తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలపై నిరంతరం పెను ప్రభావంతో పెత్తనం చెలాయించే నక్షత్రాల గురించే ఇదివరకూ తెలుసు. కానీ.. మనకు 300 కాంతి సంవత్సరాల దూరంలో మన సూర్యుడి అంత సైజులో ఉన్న ‘వాస్ప్-18’ అనే ఈ నక్షత్రానిది రివర్స్ స్టోరీ! దీని చుట్టూ అతి సమీపం నుంచే తిరుగుతున్న ఓ భారీ గ్రహం ప్రభావం వల్ల ఇది రోజురోజుకూ కుంగిపోతూ.. త్వరత్వరగా ముసలిది అయిపోతోందట! ఈ నక్షత్రా న్ని జస్ట్ 23 గంటలకే ఓసారి చుట్టేసి వస్తున్న వాస్ప్-18బీ అనే గ్రహం మన సౌరకుటుంబంలోనే అతిపెద్దది అయిన గురు గ్రహం(భూమికన్నా 1,321 రెట్లు పెద్దది) కన్నా పది రెట్లు పెద్దగా ఉందట.
ఇంతపెద్ద గ్రహం అతిసమీపంలోనే ఉండటం వల్ల వాస్ప్-18 నక్షత్రం కుదేలైపోతోందట. గ్రహం గురుత్వాకర్షణ ప్రభావం వల్ల నక్షత్రంలోని వాయువుల వేగం, ఉష్ణ ప్రసరణం మందగించి అయస్కాంత క్షేత్రం బలహీనపడుతుండటంతో అది త్వరితగతిన వృద్ధాప్యంలోకి చేరుకుంటోందట. నాసా చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ ద్వారా ఇటలీ శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు.