నీటి కోసం కర్ణాటకతో సంప్రదింపులు
పుణే: సాంగ్లి జిల్లా జాట్ తహసీల్‌కు నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పతంగ్‌రావ్ కదమ్ వెల్లడించారు. మంగళవారం ఇక్కడ జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం నెలన్నరలోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
జిల్లాలోని 42 గ్రామాలు తీవ్ర నీటికొరత సమస్యను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ప్రభుత్వం కర్ణాటకతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. జిల్లాలోని వివిధ రిజర్వాయర్లలో నీటి లభ్యతకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. జిల్లాలో కాలువల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కాగా జాట్ తహసీల్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో కర్ణాటక సరిహద్దులో ఉంది. దీంతో ఆ రాష్ట్రంలోని హైర్-పడ్సల్గి లేదా బబలేశ్వర్ జలాశయాలనుంచి నీటిని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.