‘గ్రేటర్’ గ్రామాలకు తీరనున్న దాహార్తి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 187 గ్రామ పంచా యతీలు, మూడు నగర పంచాయతీలకు త్వరలో నీటి కష్టాలు తొలగనున్నాయి. సుమారు రూ.628 కోట్ల అంచనా వ్యయంతో ఆయా గ్రామాల్లో 1,990 కి.మీ. పైపులైన్లు, 400 ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మించనున్నారు. బుధవారం వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
ఇందులో పలు కంపెనీలు పోటీ పడగా 2.65 శాతం అధికంగా కోట్ చేసిన ఎంఈఐఎల్ (మెగా) ఇంజనీరింగ్ సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. కాగా, ఈ పనులను యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు. ఇందుకు అయిన వ్యయాన్ని సంబంధిత సంస్థకు జల మండలి ఏడేళ్లపాటు చెల్లించనుంది. ఈ పనుల పూర్తయితే ఆయా గ్రామాల్లో సుమారు 25 లక్షల మంది దాహార్తి తీరనుంది.