తస్మాత్.. జాగ్రత్త !!
– హంద్రీ–నీవా నీటితో కళకళలాడుతున్న జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు, 45 చెరువులు
– విహారయాత్రలు, ఈత కొడుతూ ఇటీవల మృతి చెందిన వారు 27మంది
– వేసవి కావడం, చెరువుల్లో నీళ్లు ఉండటంతో ఈతకు వెళుతున్న యువత
– పూడికతో ప్రమాదకర స్థాయిలో చెరువులు, రిజర్వాయర్లు
– ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం
సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘గుక్కెడు నీటి కోసం అల్లాడిపోయే ‘అనంత’లో పడవ ప్రమాదం జరిగిందంటే అంతా ‘మన జిల్లాలో పడవ ప్రమాదమేంటి?’ అని సర్వత్రా మొదట సంశయపడ్డారు. ఆపై ‘హంద్రీ–నీవా ద్వారా చెరువుల్లోకి నీరు వచ్చింది నిజమే!’ అనుకున్నారు. కరువు జిల్లాలో కూడా ప్రస్తుతం రిజర్వాయర్లు, చెరువులు హంద్రీ–నీవా నీటితో కళకళలాడుతున్నాయి. ఐదేళ్లుగా హంద్రీ–నీవా నీరు జీడిపల్లి రిజర్వాయర్‌తో పాటు చెరువులకు పంపిణీ చేస్తున్నారు. ఐదునెలల కిందట గొల్లపల్లి రిజర్వాయర్ కూడా హంద్రీ–నీవా నీటితో జలకళను సంతరించుకుంది. కరువు జిల్లాలో చెరువులు నిండుకుండలా ఉండటం సంతోషకరం! భూగర్భజలాలు పెరిగి తాగు, సాగునీటి సమస్యలు తీరుతాయి. అయితే ఈ నీటితోనే ఇటీవల 27మంది ప్రాణాలు కోల్పోయారు. యువకులు సరదాగా రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఈతకు వెళ్లడం, ప్రమాదవశాత్తు మృతి చెందడం ఇటీవల అధికంగా జరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది జలసమాధి అయ్యారంటే ప్రమాదాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ పరిణామం ప్రస్తుతం ఆందోళన రేకిత్తిస్తోంది.
సరదా తీసిన ప్రాణాలు 27
హంద్రీ–నీవా ద్వారా 2012లో జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొచ్చాయి. అప్పటి నుండి జిల్లాలోని చెరువులను కృష్ణాజలాలతో అధికారులు నింపుతున్నారు. గతేడాది కృష్ణాలో నీటి లభ్యత అధికంగా ఉండటంతో 28 టీఎంసీలు జిల్లాకు చేరాయి. ఈ నీటిని ఆయకట్టుకు ఇవ్వకుండా మొత్తం చెరువులు నింపారు. పీఏబీఆర్, ఎంపీఆర్ పరిధిలో 45 చెరువులకు ఈ నీటిని తరలించారు. దీంతో జిల్లాలో జీడిపల్లి, గొల్లపల్లితో పాటు 45 చెరువుల్లో జలకళ సంతరించుకుంది. అనంతపురం జిల్లాలో కనీసం ఈత కొడదామన్న ఎక్కడా నీటిజాత కన్పించదు. ఈ క్రమంలో రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు కన్పించడంతో ‘అనంత’ యువత సరదా విహారయాత్రలకు వెళుతోంది. అయితే చెరువులు తక్కువ లోతులో ఉండటం, దిగువభాగంలో మట్టి బాగా తడిచి పూడికలా మారడంతో ఈతకు వెళ్లినవారు నీటి దిగువకు వెళితే అందులో ఇరుక్కుపోయి మృత్యువాత పడుతున్నారు. ఇటీవల 27మంది ఇలా ప్రమాదాలకు గురే ప్రాణాలు కోల్పోయారు.
– బెంగళూరుకు చెందిన సద్దాం, సల్మాన్ అనే ఇద్దరు యువకులు హిందూపురంలో వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 19న గొల్లపల్లి రిజర్వాయర్‌లో సరదాగా ఈతకొట్టేందుకు వచ్చారు. ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు.
– ఈ నెల 23న గోరంట్లకు చెందిన దాదాపీర్ అనే వ్యక్తి ఈతకొట్టేందుకు గొల్లపల్లికి వచ్చి జలసమాధి అయ్యారు.
– గతేడాది ఆగస్టు 23న ప్రదీప్ (18) కృష్ణాపుష్కరాలు చివరి రోజు జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చి గల్లంతయ్యాడు. అనంతపురానికి చెందిన ప్రదీప్ స్నేహితులతో కలిసి వచ్చి తెల్లవారేసరికి శవంగా తేలారు. జీడిపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటి వరకూ ఎనిమిది మంది చనిపోయారు.
శుక్రవారం ఒక్కరోజే 16మంది మృత్యువాత:
శుక్రవారం ఒక్కరోజు 16మంది మృత్యువాతపడ్డారు. గుంతకల్లు మండలం వైటీ చెరువులో ప్రమాదవశాత్తు తెప్ప బోల్తాపడి 14మంది చనిపోయారు. వీరిలో 10మంది చిన్నారులు. నలుగురు మహిళలు. సరదాగా చెరువులోకి వెళ్లిన వీరు పరిమితికి మించి తెప్పేలో ప్రయాణించడంతో ప్రమాదం జరిగింది. ఇదే రోజు విడపనకల్లు మండలం హావళిగిలో చెరువులో పూజ, తులసి అనే చిన్నారులు చనిపోయారు.
వేసవిలో రిజర్వాయర్ల వద్దకు క్యూ కడుతున్న వైనం:
చెరువుల్లో, రిజర్వాయర్లలో మృత్యువాతపడిన వారిలో అధికశాతం యువకులు, చిన్నారులే! ఈతకొట్టేందుకు వచ్చి ప్రమాదవశాత్తు చనిపోతున్నారు. జీడిపల్లిలో కొంతమంది తెప్పెలు నిర్వహిస్తున్నారు. విహారయాత్రకు వచ్చిన వారిని సరదాగా రిజర్వాయర్‌లో తిప్పుతున్నారు. ఇక్కడ కూడా పరిమితికి మించి ఎక్కువగా తీసుకెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పల్లెలు, పట్టణాల నుంచి జీడిపల్లి, గొల్లపల్లికి వెళ్లే వారి సంఖ్య అధికమే! కుటుంబసమేతంగా భోజనాలు చేసుకుని సరదాగా గడిపేందుకు వెళుతున్నారు. సెలవులతో పట్టణాల నుంచి పల్లెల్లోని బంధువుల ఇళ్లకు వచ్చిన వారు కూడా సమీపంలోని చెరువుల్లో సరదాగా ఈత కొడుతున్నారు. వీరు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా మృత్యువాతపడే ప్రమాదముంది.
చెరువుల్లో పూడికప్రాంతాలున్నాయా? ఈతకు వెళ్లేందుకు అనువుగా ఉందా? లేదా అనేది చూసుకోవాలి. చిన్నపిల్లలు చెరువులోకి వెళ్లకుండా పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వైటీ చెరువు లాంటి ఘటనలు జరిగే ప్రమాదముంది. అధికారులు కూడా సెలవులను దృష్టిలో పెట్టుకుని గొల్లపల్లి, జీడిపల్లి రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. బోటింగ్‌కు తీసుకెళ్లేవారికి కూడా పరిమితికి మించి తీసుకెళ్లకూడదని సూచనలు ఇవ్వాలి. అధికలోతుకు వెళ్లకుండా జెండాలు పాతి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. వేసవి దాటేంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.