water level down
-
బోరు భోరుగా..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో భూగర్భ జలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సుమారు 40 శాతం బోరుబావులు నీళ్లు లేక వట్టిపోయాయి. మరోవైపు శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం... భూగర్భజలశాఖ నుంచి సాధ్యాసాధ్యల నివేదిక(ఫీజిబిలిటీ)అందిన తరవాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది. ప్రధాననగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకుపైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది. ప్రధానంగా కుత్భుల్లాపూర్ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రా>జేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్ మాఫియా..ఈ నీటిని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌వాటర్ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గ్రేటర్లో భూగర్భజలవిల ఇలా... సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలుకాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు,కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్‌నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు. మరోవైపు రాజధానిలో నీటి బొట్టు కనుమరుగు కానుంది. వరుణుడు కరుణించినా..వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేక గ్రేటర్ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. విలువైన వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జిపిట్స్ తగినన్ని లేక భూగర్భజలమట్టాలు పెరగడం లేదు. గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్.. బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ’కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశ జనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజల మట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది. -
ఛిద్రావతి
అడుగంటిన సీబీఆర్ - మూడు మున్సిపాలిటీలో నీటి ఎద్దడి - వందలాది గ్రామాలకు పొంచిన ముప్పు - నాలుగు రోజులకోసారి విడుదల - ఇప్పటికీ మేల్కొనని పాలకులు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్)లో నీటి మట్టం రోజురోజుకూ పడిపోతోంది. ధర్మవరం, కదిరి, పులివెందుల మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి వాటర్ స్కీం, వైఎస్సార్ కడప జిల్లాలోని యురేనియం ప్రాజెక్ట్‌కు ఇక్కడి నుంచే నీరు అందుతోంది. అయితే నీటి మట్టం అడుగంటడంతో ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి వాటర్ స్కీం పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం : 10 టీఎంసీలు ప్రస్తుతం నిల్వ నీరు : 0.175 టీఎంసీలు తాగునీటి పథకాలు : 4 యురేనియం ప్రాజెక్ట్ : 1 రోజూ ఆయా ప్రాజెక్ట్‌లు వినియోగించే నీరు : 40 క్యూసెక్కులు ధర్మవరం: తాడిమర్రి మండల పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో అట్టడుగుకు చేరిన నీటి మట్టం ఆందోళన కలిగిస్తోంది. వేలాది గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకమవుతోంది. మండల సరిహద్దు, వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం పార్నపల్లి సమీపంలో చిత్రావతి నదిపై 1993లో అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచే సత్యసాయి వాటర్ స్కీం, ధర్మవరం, కదిరి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు సరఫరా అవుతోంది. నాలుగు పంప్‌హౌస్‌లను నిర్మించి ఆయా ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారు. వీటితో పాటు వైఎస్ఆర్ జిల్లా తుమ్మల వద్ద ఏర్పాటు చేసిన యురేనియం ఫ్యాక్టరీకి నీటిని అందించేందుకు మరో సంప్ నిర్మితమైంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రిజర్వాయర్‌లో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. గత ఆరేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో సీబీఆర్‌లో నీటి చేరిక అంతంత మాత్రంగానే ఉంటోంది. నెల రోజుల క్రితం 0.870 టీఎంసీలు ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 0.175 టీఎంసీలకు చేరుకుంది. ఫలితంగా నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయింది. ఫలితంగా ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలకు నీటిని సరఫరా చేసే పంప్‌హౌస్‌లలో రాళ్లు తేలాయి. ఈ కారణంగా ధర్మవరం మున్సిపాలిటీకి సంబంధించిన పంప్‌హౌస్ వద్దకు నీటిని మళ్లించేందుకు మున్సిపల్ అధికారులు జేసీబీలతో కాలువలు తవ్వించారు. అదేవిధంగా కదిరి మున్సిపాలిటీ పంప్హౌస్కూ కాలువ తీస్తున్నారు. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలకు సరఫరా అవుతున్న నీరు కూడా రంగు తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతుండగా.. ఇప్పుడు నాలుగు రోజులకోసారి పంపిణీ చేస్తుండటం గమనార్హం. వాటా నీరు రాకపోవడంతోనే సమస్య హెచ్ఎల్సీ నుంచి వాటా నీరు రాకపోవడంతోనే సమస్య తలెత్తుతోంది. వాస్తవానికి టీబీ డ్యాం నుంచి తాగునీటి కోసం 4.4 టీఎంసీలు, సాగునీటికి 0.6 టీఎంసీల నీటిని కేటాయించాల్సి ఉండగా.. 1.5 నుంచి 2 టీఎంసీలు మాత్రమే వదులుతున్నారు. మూడు మున్సిపాలిటీలకు, సత్యసాయి వాటర్ స్కీంకు రోజూ నీరు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఈ నెల 22న నిర్వహించే కృష్ణా ట్రిబ్యునల్ సమావేశం తర్వాతే నీటి విషయంలో స్పష్టత వస్తుంది. - ఖాదర్ వలి, ఏఈ సీబీఆర్, పార్నపల్లి -
డెల్టా కంట తడి
in godavari, water level down, water problem గోదావరిలో పడిపోయిన ప్రవాహ జలాలు , పొంచి ఉన్న సాగునీటి గండం పశ్చిమ డెల్టా కంటతడి పెడుతోంది. గోదావరి నదిలో సహజ జలాలు పడిపోవడంతో నీటి తడులు అందక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతులవారీ విధానం అమల్లో ఉన్నా.. రైతుల కష్టాలు తీరడం లేదు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే ముప్పు పొంచి ఉంది. కొవ్వూరు : గోదావరి నదిలో ప్రవాహ జలాలు గణనీయంగా పడిపోయాయి. రబీ సీజన్లో డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు నాటికి సీలేరుతో కలిపి 90 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కకట్టారు. దీనిలో ఇప్పటి వరకు 61.208 టీఎంసీల నీరు వాడేశారు. ఇంకా సుమారు రెండు నెలలు రబీసాగుకు నీటితడులు అందించాలి. పంటలు కీలక దశలో ఉన్నందున ప్రస్తుతం మార్చి నెలకు 30 టీఎంసీల నీరు అవసరం. కానీ అందుబాటులో ఉన్నది మాత్రం 29 టీఎంసీలే. దీనిలో ఈనెలాఖరు వరకు సాగునీటి సరఫరాకు 13 టీఎంసీల వరకు వాడే అవకాశం ఉంది. అంటే మిగిలేది 16 టీఎంసీలే. అంటే పంట గట్టెక్కాలంటే ఇంకా 10 నుంచి 15 టీఎంసీల నీరు అదనంగా అవసరం ఉందని అధికార వర్గాల అంచనా. ఫలితంగా నీటి పొదుపు చర్యలు పటిష్టంగా అమలు చేయకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దుస్థితి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గుతున్న నీటిమట్టం ఈనెల 15 నుంచి గోదావరి నీటి మట్టం క్రమేణా తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పాండ్లెవెల్ 15న 13.32 మీటర్లు ఉంటే 19 నాటికి 13.23 మీటర్లకు తగ్గింది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు కలిపి 8,240 క్యూసెక్కుల నీరు అందుతోంది. దీనిలో సీలేరు నుంచే 5,300 క్యూసెక్కులు వస్తోంది. అంటే గోదావరి ప్రవాహ జలాలు 3వేల క్యూసెక్కులలోపు మాత్రమే వస్తున్నాయన్నమాట. రానున్న రోజుల్లో వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రత పెరిగితే ప్రవాహ జలాల లభ్యత మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎండలు క్రమేణా పెరుగుతున్న దృష్ట్యా సాగుకు నీటితడుల వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పశ్చిమ డెల్టాకు 4,500 క్యూసెక్కులు కచ్చితంగా అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినా కేవలం 4,280 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. నీరందక రైతుల అవస్థలు డెల్టాలోని ప్రధానంగా అత్తిలి మండలం ఈడూరు, కంచుమర్రు, కొమ్మర, స్కిన్నెరపురం, పాలకొడేరు మండలం మోగల్లు, మైప, గరగపర్రు, పాలకోడేరు, కుముదవల్లి, కొండేపూడి, కోరుకొల్లు, శృంగవృక్షం, కాళ్ల మండలం కాళ్లకూరు, ఆకివీడు మండలం చెరుకుమిల్లి, ఉండి మండలం చెరుకువాడ, కలిసిపూడి తదితర గ్రామాల ఆయకట్టులో రైతులు నీటి తడులందక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు నీళ్లందక ఆయిల్ ఇంజిన్ల సాయంతో తోడుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా అందించే ఆయిల్ ఖర్చులూ ఈ ఏడాది అందించడం లేదు. గత ఏడాది చెల్లించాల్సి ఆయిల్ ఖర్చులు ఇప్పటికీ చాలామంది రైతులకు ఇవ్వలేదు. నీటి ఎద్దడి పరిష్కారానికి 187 చోట్ల కాలువలకు అడ్డుకట్టలు వేయాలని అధికారులు నిర్ణయించినా 60 చోట్ల మాత్ర మే అడ్డుకట్టలు వేశారు. మరో అరవై ప్రదేశాలలో నీళ్లు ఎత్తిపోయాలని నిర్ణయించినా కేవలం 25 చోట్ల మాత్రమే మోటార్లు, కరెంటు సిద్ధం చేశారు. పథకం నిర్వహణపై శ్రద్ధేదీ! పెనుగొండ మండలం దొంగరావి పాలెం వద్ద ఏటా రబీ సీజన్లో ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్ ఆయకట్టు నీటి అవసరాలు తీరుస్తున్నారు. గత ఏడాది ఎత్తిపోతల పథకం నిర్వహణకు బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఈ పథకం మూలనపడింది. దీని ద్వారా ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లో ఆయకట్టుతోపాటు పోడూరులో కొంత ఆయకట్టుకు సంమృద్ధిగా నీరందించే అవకాశం ఉంది. అధికారులు ఆ దిశగా యత్నాలు ప్రారంభించలేదు. కనీసం రెండు టీఎంసీల నీటిని అదనంగా గోదావరి నుంచి వాడుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ రబీ సీజన్లో గోదావరి నుంచి పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సరఫరా చేసిన నీటి వివరాలు నెల సరఫరా సహజ జలాలు సీలేరు జలాలు ( టీఎంసీల్లో ) డిసెంబర్ 25.192 17.201 7.991 జనవరి 23.144 13.208 9.936 ఫిబ్రవరి 12.872 5.288 7.584 మొత్తం 61.208 35.697 25.111 ఇబ్బందులు పడుతున్నాం సాగునీరందక చేలన్నీ బీటలు వారుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడుకుంటున్నాం. ఎకరా తడికి ఒక పర్యాయానికి రూ.800 ఖర్చు అవుతోంది. రాత్రి, పగలు చేలవద్ద కాపాలా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. నీటికోసం అదనపు వ్యయం కావడంతో కౌలు రైతులు నష్టపోవాల్సివస్తోంది. – కె సూర్రావు, కౌలురైతు, కంచుమర్రు