డెల్టా కంట తడి
డెల్టా కంట తడి
Published Mon, Feb 20 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
in godavari, water level down, water problem
గోదావరిలో పడిపోయిన ప్రవాహ జలాలు , పొంచి ఉన్న సాగునీటి గండం
పశ్చిమ డెల్టా కంటతడి పెడుతోంది. గోదావరి నదిలో సహజ జలాలు పడిపోవడంతో నీటి తడులు అందక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతులవారీ విధానం అమల్లో ఉన్నా.. రైతుల కష్టాలు తీరడం లేదు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి
తీవ్రమయ్యే ముప్పు పొంచి ఉంది.
కొవ్వూరు : గోదావరి నదిలో ప్రవాహ జలాలు గణనీయంగా పడిపోయాయి. రబీ సీజన్‌లో డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు నాటికి సీలేరుతో కలిపి 90 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కకట్టారు. దీనిలో ఇప్పటి వరకు 61.208 టీఎంసీల నీరు వాడేశారు. ఇంకా సుమారు రెండు నెలలు రబీసాగుకు నీటితడులు అందించాలి. పంటలు కీలక దశలో
ఉన్నందున ప్రస్తుతం మార్చి నెలకు 30 టీఎంసీల నీరు అవసరం. కానీ అందుబాటులో ఉన్నది మాత్రం 29 టీఎంసీలే. దీనిలో ఈనెలాఖరు వరకు సాగునీటి సరఫరాకు 13 టీఎంసీల వరకు వాడే అవకాశం ఉంది. అంటే మిగిలేది 16 టీఎంసీలే. అంటే పంట గట్టెక్కాలంటే ఇంకా 10 నుంచి 15 టీఎంసీల నీరు అదనంగా అవసరం ఉందని అధికార వర్గాల అంచనా. ఫలితంగా నీటి పొదుపు చర్యలు పటిష్టంగా అమలు చేయకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దుస్థితి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తగ్గుతున్న నీటిమట్టం
ఈనెల 15 నుంచి గోదావరి నీటి మట్టం క్రమేణా తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పాండ్‌లెవెల్ 15న 13.32 మీటర్లు ఉంటే 19 నాటికి 13.23 మీటర్లకు తగ్గింది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు కలిపి 8,240 క్యూసెక్కుల నీరు అందుతోంది. దీనిలో సీలేరు నుంచే 5,300 క్యూసెక్కులు వస్తోంది. అంటే గోదావరి ప్రవాహ జలాలు 3వేల క్యూసెక్కులలోపు మాత్రమే వస్తున్నాయన్నమాట. రానున్న రోజుల్లో వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రత పెరిగితే ప్రవాహ జలాల లభ్యత మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎండలు క్రమేణా పెరుగుతున్న దృష్ట్యా సాగుకు నీటితడుల వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పశ్చిమ డెల్టాకు 4,500 క్యూసెక్కులు కచ్చితంగా అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినా కేవలం 4,280 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు.
నీరందక రైతుల అవస్థలు
డెల్టాలోని ప్రధానంగా అత్తిలి మండలం ఈడూరు, కంచుమర్రు, కొమ్మర, స్కిన్నెరపురం, పాలకొడేరు మండలం మోగల్లు, మైప, గరగపర్రు, పాలకోడేరు, కుముదవల్లి, కొండేపూడి, కోరుకొల్లు, శృంగవృక్షం, కాళ్ల మండలం కాళ్లకూరు, ఆకివీడు మండలం చెరుకుమిల్లి, ఉండి మండలం చెరుకువాడ, కలిసిపూడి తదితర గ్రామాల ఆయకట్టులో రైతులు నీటి తడులందక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు నీళ్లందక ఆయిల్ ఇంజిన్ల సాయంతో తోడుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా అందించే ఆయిల్ ఖర్చులూ ఈ ఏడాది అందించడం లేదు. గత ఏడాది చెల్లించాల్సి ఆయిల్ ఖర్చులు ఇప్పటికీ చాలామంది రైతులకు ఇవ్వలేదు. నీటి ఎద్దడి పరిష్కారానికి 187 చోట్ల కాలువలకు అడ్డుకట్టలు వేయాలని అధికారులు నిర్ణయించినా 60 చోట్ల మాత్ర మే అడ్డుకట్టలు వేశారు. మరో అరవై ప్రదేశాలలో నీళ్లు ఎత్తిపోయాలని నిర్ణయించినా కేవలం 25 చోట్ల మాత్రమే మోటార్లు, కరెంటు సిద్ధం చేశారు.
పథకం నిర్వహణపై శ్రద్ధేదీ!
పెనుగొండ మండలం దొంగరావి పాలెం వద్ద ఏటా రబీ సీజన్‌లో ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్ ఆయకట్టు నీటి అవసరాలు తీరుస్తున్నారు. గత ఏడాది ఎత్తిపోతల పథకం నిర్వహణకు బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఈ పథకం మూలనపడింది. దీని ద్వారా ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లో ఆయకట్టుతోపాటు పోడూరులో కొంత ఆయకట్టుకు సంమృద్ధిగా నీరందించే అవకాశం ఉంది. అధికారులు ఆ దిశగా యత్నాలు ప్రారంభించలేదు. కనీసం రెండు టీఎంసీల నీటిని అదనంగా గోదావరి నుంచి వాడుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
ఈ రబీ సీజన్‌లో గోదావరి నుంచి పశ్చిమ డెల్టా
ఆయకట్టుకు సరఫరా చేసిన నీటి వివరాలు
నెల సరఫరా సహజ జలాలు సీలేరు జలాలు
( టీఎంసీల్లో )
డిసెంబర్ 25.192 17.201 7.991
జనవరి 23.144 13.208 9.936
ఫిబ్రవరి 12.872 5.288 7.584
మొత్తం 61.208 35.697 25.111
ఇబ్బందులు
పడుతున్నాం
సాగునీరందక చేలన్నీ బీటలు వారుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడుకుంటున్నాం. ఎకరా తడికి ఒక పర్యాయానికి రూ.800 ఖర్చు అవుతోంది. రాత్రి, పగలు చేలవద్ద కాపాలా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. నీటికోసం అదనపు వ్యయం కావడంతో కౌలు రైతులు నష్టపోవాల్సివస్తోంది.
– కె సూర్రావు, కౌలురైతు, కంచుమర్రు
Advertisement