ఛిద్రావతి | water level down in cbr | Sakshi
Sakshi News home page

ఛిద్రావతి

Published Sat, Aug 12 2017 10:23 PM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

ఛిద్రావతి

ఛిద్రావతి

అడుగంటిన సీబీఆర్‌
- మూడు మున్సిపాలిటీలో నీటి ఎద్దడి
- వందలాది గ్రామాలకు పొంచిన ముప్పు
- నాలుగు రోజులకోసారి విడుదల
- ఇప్పటికీ మేల్కొనని పాలకులు


చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(సీబీఆర్‌)లో నీటి మట్టం రోజురోజుకూ పడిపోతోంది. ధర్మవరం, కదిరి, పులివెందుల మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి వాటర్‌ స్కీం, వైఎస్సార్‌ కడప జిల్లాలోని యురేనియం ప్రాజెక్ట్‌కు ఇక్కడి నుంచే నీరు అందుతోంది. అయితే నీటి మట్టం అడుగంటడంతో ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి వాటర్‌ స్కీం పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది.

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌
నీటి నిల్వ సామర్థ్యం : 10 టీఎంసీలు
ప్రస్తుతం నిల్వ నీరు : 0.175 టీఎంసీలు
తాగునీటి పథకాలు : 4
యురేనియం ప్రాజెక్ట్‌ : 1
రోజూ ఆయా ప్రాజెక్ట్‌లు వినియోగించే నీరు : 40 క్యూసెక్కులు


ధర్మవరం: తాడిమర్రి మండల పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో అట్టడుగుకు చేరిన నీటి మట్టం ఆందోళన కలిగిస్తోంది. వేలాది గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకమవుతోంది. మండల సరిహద్దు, వైఎస్‌ఆర్‌ జిల్లా లింగాల మండలం పార్నపల్లి సమీపంలో చిత్రావతి నదిపై 1993లో అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచే సత్యసాయి వాటర్‌ స్కీం, ధర్మవరం, కదిరి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు సరఫరా అవుతోంది. నాలుగు పంప్‌హౌస్‌లను నిర్మించి ఆయా ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారు. వీటితో పాటు వైఎస్‌ఆర్‌ జిల్లా తుమ్మల వద్ద ఏర్పాటు చేసిన యురేనియం ఫ్యాక్టరీకి నీటిని అందించేందుకు మరో సంప్‌ నిర్మితమైంది.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రిజర్వాయర్‌లో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. గత ఆరేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో సీబీఆర్‌లో నీటి చేరిక అంతంత మాత్రంగానే ఉంటోంది. నెల రోజుల క్రితం 0.870 టీఎంసీలు ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 0.175 టీఎంసీలకు చేరుకుంది. ఫలితంగా నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి పడిపోయింది. ఫలితంగా ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలకు నీటిని సరఫరా చేసే పంప్‌హౌస్‌లలో రాళ్లు తేలాయి. ఈ కారణంగా ధర్మవరం మున్సిపాలిటీకి సంబంధించిన పంప్‌హౌస్‌ వద్దకు నీటిని మళ్లించేందుకు మున్సిపల్‌ అధికారులు జేసీబీలతో కాలువలు తవ్వించారు. అదేవిధంగా కదిరి మున్సిపాలిటీ పంప్‌హౌస్‌కూ కాలువ తీస్తున్నారు. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలకు సరఫరా అవుతున్న నీరు కూడా రంగు తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతుండగా.. ఇప్పుడు నాలుగు రోజులకోసారి పంపిణీ చేస్తుండటం గమనార్హం.

వాటా నీరు రాకపోవడంతోనే సమస్య
హెచ్‌ఎల్‌సీ నుంచి వాటా నీరు రాకపోవడంతోనే సమస్య తలెత్తుతోంది. వాస్తవానికి టీబీ డ్యాం నుంచి తాగునీటి కోసం 4.4 టీఎంసీలు, సాగునీటికి 0.6 టీఎంసీల నీటిని కేటాయించాల్సి ఉండగా.. 1.5 నుంచి 2 టీఎంసీలు మాత్రమే వదులుతున్నారు. మూడు మున్సిపాలిటీలకు, సత్యసాయి వాటర్‌ స్కీంకు రోజూ నీరు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఈ నెల 22న నిర్వహించే కృష్ణా ట్రిబ్యునల్‌ సమావేశం తర్వాతే నీటి విషయంలో స్పష్టత వస్తుంది.   
- ఖాదర్‌ వలి, ఏఈ సీబీఆర్, పార్నపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement