సూరీ..నిజం చెప్పాలె! | Farmers Fires On Dharmavaran TDP MLA Suryanarayana | Sakshi
Sakshi News home page

సూరీ..నిజం చెప్పాలె!

Published Tue, Mar 19 2019 8:46 AM | Last Updated on Tue, Mar 19 2019 8:46 AM

Farmers Fires On Dharmavaran TDP MLA Suryanarayana - Sakshi

ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ

ఇంత కాలం నెరవేర్చకుండా అటకెక్కించిన హామీల మూటను ధర్మవరం ఎమ్మెల్యే సూరి కిందకు దించాడు. భుజాన వేసుకుని ఎన్నికల ప్రచారానికి జనం మధ్యలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ మూటలో నుంచి ఓ హామీ సూరిని పలకరించింది. ‘ఓ సూరీ.. ఎమ్మెల్యేగా ఐదేళ్లు ధర్మవరం నియోజకవర్గాన్ని పాలించావు. ఈ ఐదేళ్లూ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశావు. ఇప్పడు మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు పట్టువదలకుండా బయలుదేరావు. నీ సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నీకు ప్రయాస భారం తెలియకుండా ఓ కథ చెబుతాను విను. అంటూ ఆయన హామీలను ఓసారి గుర్తు చేసింది.  

సాక్షి, తాడిమర్రి : ముప్పై సంవత్సరాల క్రితం తాడిమర్రి మండలంలోని చెరువులను పీఏబీఆర్‌ నీటితో నింపేందుకు శ్రీకారం చుట్టారు. పీఏబీఆర్‌ నుంచి పలు గ్రామాల మీదుగా కాలువ తవ్వకాలు చేపట్టారు. తాడిమర్రి మండలంలోని శివంపల్లి వద్ద (112వ కిలోమీటర్‌)కు చేరుకోగానే పనులు ఆగిపోయాయి. మరో 2.4 కి.మీ మేర పనులు జరిగితే తాడిమర్రి సమీపంలోని తాటిమాండ్ల వంక మీదుగా చిత్రావతి నది నుంచి మండలంలోని చెరువులకు నీరు చేరుతుంది. చెరువుల్లో నీరు చేరితే ఈ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటిమట్టం పెరిగి సాగునీటి సంకటం తప్పిపోతుంది. రైతుల జీవితాలే మారిపోతాయి.

కానీ ఈ పనులు మూడు దశాబ్దాలుగా ముందుకు సాగలేదు. మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే హోదాలో ఈ పనులు పూర్తి చేసి, చెరువులకు నీరు అందిస్తామంటూ నీవు చేసిన హంగామా అంతాఇంతా కాదు. కాలువ వెళ్లే మార్గంలో 33.70 ఎకరాల భూమి అవసరమని, రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు రైతులకు పరిహారంగా చెల్లించేందుకు రూ. 1.36 కోట్లు కూడా మంజూరయ్యాయని ప్రకటించావు. కాలువ తవ్వకాలకు రూ.8 కోట్లతో డిటైయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) సిద్ధం చేసి అనుమతుల కోసం పంపినట్లు ఊరించావు. కాలువ నిర్మాణం పూర్తి కాగానే మండలంలోని అన్ని చెరువులనూ నీటితో నింపుతామంటూ ఆశలు పెట్టావు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. 2018 జనవరి 4న మర్రిమాకులపల్లిలో జరిగిన జన్మభూమి గ్రామసభలో,  ఈ ఏడాది జనవరి 8న తాడిమర్రిలో జరిగిన జన్మభూమి గ్రామసభలోనూ పీఏబీఆర్‌ కాలువ నిర్మాణం పూర్తి చేస్తానని హామీనిచ్చావు. నేటికీ ఈ పనులు చేపట్టలేదు.

  
సూరీ! ఇప్పుడు చెప్పు.. దేశానికి వెన్నముక రైతే అని అంటారు కదా? మరి అలాంటి రైతు సంక్షేమానికి నీవు చేసిందేమి? అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువ పనులు పూర్తి చేస్తానని మూడేళ్లుగా రైతులను మభ్య పెడుతూ వచ్చావు. నిధులూ మంజూరయ్యాయన్నావు... మరి పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయావు..? వాస్తవాలు నీవు చెప్పకపోతే నియోజకవర్గ ప్రజలే చెబుతారు. నియోజకవర్గంలో నీవు తలెత్తుకుని తిరగలేవు. అలాగని తప్పు సమాధానం చెప్పి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే నీకు ఓటమి తప్పదు.
సమాధానం చెప్పేందుకు సూరి నోరు విప్పాడు. ‘ఓటు బ్యాంక్‌ రాజకీయల కోసం’ అంటూ చెప్పేలోపు హామీ అడ్డుకుని మభ్య పెట్టే ప్రయత్నం చేయమాకు సూరీ.. వాస్తవాలేమిటో ప్రజలే చెబుతారు విను అంటూ ఆ హామీ కాస్త గాలికి ఎగిరిపోయింది. 
 


ఇతని పేరు అల్లే రామచంద్రారెడ్డి. తాడిమర్రి మండలం శివంపల్లి గ్రామం. ఐదు ఎకరాల్లో 900 చీనీ చెట్లు పెంచుతున్నాడు. మరో 1.50 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేపట్టాడు. సాగునీరు సరిపోక పోవడంతో మరో మూడు ఎకరాలను బీడుగా వదిలేశాడు. ఇటీవల రూ.1.20 లక్షలు ఖర్చుచేసి రెండు బోర్లు వేశాడు. చుక్కనీరు పడలేదు. పీఏబీఆర్‌ కాలువ నిర్మాణం పూర్తయి చెరువులకు నీరు చేరి ఉంటే ప్రస్తుతమున్న పంటను కాపాడుకోవడంతో పాటు మిగిలిన మూడు ఎకరాల్లోనూ పంట సాగు చేసేవాడినంటూ రైతు చెబుతున్నాడు. 

రైతులను మభ్యపెట్టారు
కాలువ నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు రైతులను ఎమ్మెల్యే సూరి మభ్య పెట్టారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఆయనలో లేకపోవడంతో నిర్మాణ పనులు హామీకే పరిమితమయ్యాయి. 


– ఓబిరెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మేడిమేకలపల్లి సమీపంలో ఆగిపోయిన పీఏబీఆర్‌ కాల్వ పనులు, శివంపల్లి సమీపంలో ఎండుతున్న చీనీతోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement