అనంతపురం టౌన్: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి)కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహణలో భారీఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం భూగర్భ గనుల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది. దీంతో ఏకంగా రూ.1.60 కోట్ల జరిమానా విధించారు.
వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్ సంస్థ పేరిట అనంతపురం రూరల్ మండలం క్రిష్ణంరెడ్డిపల్లి సమీపంలో సర్వేనంబర్ 40–4, 53లో స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న క్వారీ నుంచి రోడ్డు మెటల్‌ను క్రషర్‌లోకి తరలించి 40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, 6 ఎంఎం..ఇలా వివిధ రకాల మెటల్(కంకర)తో పాటు డస్ట్‌గా మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే క్వారీలో నుంచి తరలించిన స్టాక్‌కు.. క్రషర్‌లోని స్టాక్‌కు భారీ వ్యత్యాసం ఉన్న విషయం ఇటీవల గనులశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది.
24 వేల క్యూబిక్ మీటర్లకు లెక్కలేదు!
చియ్యేడు గ్రామ సమీపంలోని క్వారీ నుంచి తరలించిన రోడ్డు మెటల్.. క్రషర్‌లో ఉన్న రోడ్డు మెటల్ స్టాక్ వివరాల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు క్వారీలో కొలతలు తీశారు. 24,370 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన రోడ్డు మెటల్ వివరాలను క్రషర్ యూనిట్ నిర్వాహకులు రికార్డుల్లో నమోదు చేయకుండా.. ఎలాంటి సీనరేజీ చెల్లించకుండానే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు.
ఆ మెటల్ ఎక్కడికి తరలించారో తెలపాలంటూ నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటిపై యాజమాన్యం ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో అధికారులు అక్రమంగా తరలించిన రోడ్డు మెటల్‌కు ఎంత మొత్తం అవుతుందో లెక్కగట్టి ఐదు రెట్లు జరిమానా విధించారు. మొత్తం రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో క్రషర్ యూనిట్‌ను సీజ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి
నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్‌కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్‌లో రోడ్డు మెటల్‌కు సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. క్వారీ నుంచి వచ్చిన మెటల్‌కు, క్రషర్‌లో ఉన్న స్టాక్‌కు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. దీంతో రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపాం. క్వారీల్లో అక్రమ తవ్వకాలు, క్రషింగ్ చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వారిని ఉపేక్షించం. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– నాగయ్య, గనుల శాఖ డీడీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment