సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ఖజానాకు రూ.124 కోట్ల నష్టం కలిగించారని పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి సూర్యనారాయణేనని పేర్కొన్నారు. ఇతర నిందితులు, వ్యాపారులతో సూర్యనారాయణ వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ మాట్లాడారని, ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
తమపై ఎలాంటి లావాదేవీలు నడిపారు, ఎలా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు వంటి కీలక వివరాలను వ్యాపారులు వాంగ్మూలాల రూపంలో తెలియచేశారని వివరించారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇస్తే అంతుచూస్తానని, వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తానంటూ వ్యాపారులను సూర్యనారాయణ బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సూర్యనారాయణ నుంచి కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందన్నారు.
చదవండి: ఉమ్మడి జిల్లాలో టోల్‌గేట్ల నుంచి రోజుకు రూ.కోటి
అందువల్ల అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఏ విచారణల నివేదికల ఆధారంగా కేసు నమోదు చేశారో.. ఆ నివేదికల్లో సూర్యనారాయణ పేరు లేదన్నారు. గవర్నర్‌ను కలిసి జీపీఎఫ్ మొత్తాల మళ్లింపుపై ఫిర్యాదు చేసిన నాటినుంచే సూర్యనారాయణకు ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయన్నారు.
అందులో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. సూర్యనారాయణకు సైతం బెయిల్ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని రవిప్రసాద్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment