Government Employees Association
-
అసలు సూత్రధారి సూర్యనారాయణే.. ఆయన వల్ల రూ.124 కోట్ల నష్టం!
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ఖజానాకు రూ.124 కోట్ల నష్టం కలిగించారని పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి సూర్యనారాయణేనని పేర్కొన్నారు. ఇతర నిందితులు, వ్యాపారులతో సూర్యనారాయణ వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ మాట్లాడారని, ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమపై ఎలాంటి లావాదేవీలు నడిపారు, ఎలా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు వంటి కీలక వివరాలను వ్యాపారులు వాంగ్మూలాల రూపంలో తెలియచేశారని వివరించారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇస్తే అంతుచూస్తానని, వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తానంటూ వ్యాపారులను సూర్యనారాయణ బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సూర్యనారాయణ నుంచి కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందన్నారు. చదవండి: ఉమ్మడి జిల్లాలో టోల్గేట్ల నుంచి రోజుకు రూ.కోటి అందువల్ల అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఏ విచారణల నివేదికల ఆధారంగా కేసు నమోదు చేశారో.. ఆ నివేదికల్లో సూర్యనారాయణ పేరు లేదన్నారు. గవర్నర్‌ను కలిసి జీపీఎఫ్ మొత్తాల మళ్లింపుపై ఫిర్యాదు చేసిన నాటినుంచే సూర్యనారాయణకు ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయన్నారు. అందులో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. సూర్యనారాయణకు సైతం బెయిల్ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని రవిప్రసాద్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
షోకాజ్ నోటీసు ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవద్దు
సాక్షి, అమరావతి: సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను అవమానకరంగా మాట్లాడినందుకు సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ జారీ చేసిన షోకాజ్ నోటీసు ఆధారంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేవీ సూర్యనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తుది నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. షోకాజ్ నోటీసుపై అధికరణ 226 కింద దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని చెప్పారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు. సంఘం అధ్యక్షుడి సమాధానం ఆధారంగా తుది చర్యలుంటాయన్నారు. ఉద్యోగ సంఘం వారి సమస్యలపై పోరాటం చేయడం, సంఘం ప్రతినిధులు గవర్నర్‌ను కలవడంలో తప్పులేదన్నారు. ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కించపరుస్తూ మాట్లాడటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంతర్గత, సున్నిత, కీలక సమాచారాన్ని మీడియా ముఖంగా బహిర్గతం చేశారని, దీనిపైనే తమకు అభ్యంతరమని చెప్పారు. ఇది సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్ సంఘం ప్రతినిధులకు భావ ప్రకటన స్వేచ్ఛ వర్తించదా అని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు ఏది పడితే అది మాట్లాడటానికి వీలు లేదన్నారు. వారికి నియమావళి ఉంటుందని, దానికి లోబడే పని చేయాలని చెప్పారు. అంతకు ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌ను కలిశారన్న కోపంతోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. సంఘం గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. నోటీసు నామమాత్రపు చర్యేనని తెలిపారు. -
Andhra Pradesh : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని(డీఏ) 3.144 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల డీఏ వారి బేసిక్ జీతంలో 30.392 శాతం నుంచి 33.536 శాతానికి చేరుకుంది. ఈ పెరిగిన డీఏ 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెరిగిన డీఏతోనే జూలై నెల జీతాలు, పెన్షన్లు ఇవ్వనున్నారు. 2019 జనవరి నుంచి 2021 జూన్ వరకు ఉన్న డీఏ బకాయిలను పెన్షనర్లకు, సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతల్లో అందజేయనున్నారు. అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఉన్న ఉద్యోగులకు బకాయిలను మూడు విడతలుగా.. వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్(హెచ్ఆర్ఏ)ను మరో ఏడాది కొనసాగిస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సచివాలయం, శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి వచ్చి.. అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి 2021 జూలై 1 నుంచి ఏడాది పాటు 30 శాతం హెచ్ఆర్ఏ అమల్లో ఉంటుంది. ఉద్యోగ సంఘాల హర్షం.. డీఏ పెంపు, బకాయిల చెల్లింపుతోపాటు 30 శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల సమస్యలను గురువారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు
సాక్షి, అమరావతి/బస్‌స్టేషన్ (విజయవాడ వెస్ట్): దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు పనిచేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అన్ని విభాగాల ఉద్యోగులు ఒకే సంఘంగా ఏర్పడి ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్’ ఆవిర్భావానికి నాంది పలికారు. సోమవారం ఆర్టీసీ క్లాంపెక్స్‌లోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డి నేతృత్వంలో అసోసియేషన్‌ను ఎన్నుకున్నారు. ఎంపీడీవో అసోసియేషన్, ఈవోపీఆర్డీ ఉద్యోగుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్, ఏపీ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్, ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం, ఏపీపీఆర్ ఇంజనీరింగ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్, ఏపీ పీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, ఏపీ డీఎల్డీవో అసోసియేషన్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడుగా వెంకట్రావిురెడ్డిని, అధ్యక్షుడిగా కె. శ్రీనివాసరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీనివాస్‌ను, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా వైవీడీ ప్రసాద్‌ను, కన్వీనర్‌గా జె.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే తొమ్మిది మంది సభ్యులతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ కౌన్సిల్లో సభ్యత్వం దక్కేలా.. పంచాయతీరాజ్ శాఖలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నప్పటికీ అందరూ ఏకతాటిపై లేకపోవడం వలన ప్రభుత్వ ఉద్యోగుల విధానపరమైన నిర్ణయాల్లో వీరి భాగస్వామ్యం లేకుండా పోయిందని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకట్రావిురెడ్డి అన్నారు. అసోషియేషన్ ఏర్పాటుపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ వేదిక అయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అసోసియేషన్ సభ్యత్వం పొందే దిశగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. -
ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి మూలవేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసు చేసింది. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాలని సూచించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగించాలంటూ మరో కీలక సిఫారసు కూడా చేసింది. ఈ మేరకు చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి పీఆర్సీ గత డిసెంబర్ 31న సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బహిర్గతం చేసింది. ఫిట్మెంట్ 7.5 శాతం ఎలా అంటే..? ఉద్యోగుల కనీస వేతనాన్ని నెలకు రూ.13,825 నుంచి రూ.19 వేలకు పెంచాలని కమిషన్ తొలుత నిర్ణయం తీసుకుంది. దీని ప్రాతిపదికగా ఫిట్మెంట్ శాతాన్ని ఖరారు చేసింది. అదెలాగంటే.. ప్రస్తుత కనీస వేతనం రూ.13,825కు 2018 జూలై 1 నాటికి ఉన్న 33.399 శాతం డీఏ కలిపిన తర్వాత 7.5 శాతం ఫిట్మెంట్ జోడిస్తే (రూ.13,825+33.399% డీఏ+7.5% ఫిట్మెంట్) కనీస వేతనం రూ.19 వేలకు పెరుగుతుంది. అందుకే 7.5 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరపాలని సిఫారసు చేస్తున్నట్టు కమిషన్ వివరణ ఇచ్చింది. కమిషన్ చేసిన ఇతర సిఫారసులు ఇలా ఉన్నాయి. మాస్టర్ పే విధానం యథాతథం కనీస వేతనాన్ని నెలకు రూ.రూ.13,825 నుంచి రూ.19 వేలకు పెంచాలి. గరిష్ట వేతనాన్ని రూ.1,10,850 నుంచి రూ.1,62,070కు పెంచాలి. కనీస, గరిష్ట వేతనాల మధ్య నిష్పత్తి 1:8.53గా ఉండనుంది. 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లతో మాస్టర్ పే విధానం యథాతథంగా కొనసాగనుంది. వార్షిక ఇంక్రిమెంట్ రేంజ్ ప్రారంభ దశలో 3.36 శాతం నుంచి తుదకు 2.33 శాతం వరకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి ఏటా రెండు పర్యాయాలు డీఏను మంజూరు చేసే విధానాన్ని కొనసాగించాలి. 2018 జూలై 1 నాటికి ఉన్న డీఏను కనీస వేతనంలో కలిపేస్తున్న నేపథ్యంలో 2019 జనవరి 1 నుంచి డీఏను 0.910 కన్వర్షన్ ఫ్యాక్టర్ ఆధారంగా మంజూరు చేయాలి. ఈ లెక్కన 2019 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 1 శాతం డీఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 0.910 శాతం పెరుగుతుంది. గత పీఆర్సీ సిఫారసు చేసిన డీఏ కన్వర్షన్ ఫ్యాక్టర్ 0.524 % మాత్రమే. బుధవారం బీఆర్కేఆర్ భవన్ ముందు ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలు హెచ్ఆర్ఏ రేటులో కోత వేసినా.. 7వ కేంద్ర వేతనాల కమిషన్ (సీపీసీ) హెచ్ఆర్ఏ శ్లాబు రేట్లను 30 శాతం, 20 శాతం, 10 శాతం నుంచి వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతానికి తగ్గిస్తూ సిఫారసులు చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ శ్లాబ్ రేట్లను సైతం తగ్గించాలి. వారి మూల వేతనంపై 30, 20, 14.5, 12 శాతాల నుంచి వరుసగా 24, 17, 13, 11 శాతాలకు తగ్గించాలి. కనీస వేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.18 వేల మాత్రమే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.19 వేలు సిఫారసు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో హెచ్ఆర్ఏ ఖరారు చేసే అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్పంగా లబ్ధి చేకూరుతుంది. దీనికి తోడు మూలవేతనానికి డీఏను కలపడంతో పాటు 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను జత చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న దాని కన్నా అధికంగా హెచ్ఆర్ఏ పొందుతారు. మూల వేతనంతో పోల్చితే కరువు భత్యం 50 శాతానికి మించిన సందర్భాల్లో హెచ్ఆర్ఏ శ్లాబు రేట్లను వరుసగా 27, 18.5, 14, 11.5 శాతాలకు పెంచాలి. హెచ్ఆర్ఏ చెల్లింపులకు నగరాల వర్గీకరణ 2011 జనాభా లెక్కలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ ప్రాంతాల ఆధారంగా హెచ్ఆర్ఏ చెల్లింపులకు సంబంధించిన నగరాల వర్గీకరణను పీఆర్సీ నవీకరించింది. వివరాలు.. – 50 లక్షలు ఆపై జనాభా కలిగిన జీహెచ్ఎంసీ పరిధిలో మూల వేతనంపై హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించాలి. – 2 లక్షలకు పైగా జనాభా కలిగిన కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ నగరాల్లో 20 శాతం నుంచి 17 శాతానికి తగ్గించాలి. – 50 వేల నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలతో పాటు 50 వేలకు లోపల జనాభా కలిగిన జిల్లా కేంద్రాల్లో 14.5 శాతం నుంచి 13 శాతానికి తగ్గించాలి. – ఇతర ప్రాంతాల్లో 12 శాతం నుంచి 11 శాతానికి తగ్గించాలి. ఒంటరి తండ్రులకు చైల్డ్ కేర్ లీవ్ వర్తింపు సాధారణ పిల్లల విషయంలో చైల్డ్ కేర్ లీవ్‌ను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలి. దివ్యాంగ పిల్లలు కలిగి ఉంటేనే చైల్డ్ కేర్ లీవ్‌ను 90 రోజుల నుంచి రెండేళ్లకు పెంచాలి. తొలి 365 రోజుల పాటు 100 శాతం జీతంతో, మిగిలిన 365 రోజులు 80 శాతం వేతనంతో ఈ సెలవులు ఇవ్వాలి. అవివాహిత, విడాకులు పొందిన, భార్య మరణించిన పురుష ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్‌ను వర్తింపజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. ప్రస్తుతం వీరికి వేతనం లేని 120 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఇలా.. ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం, మూల పెన్షన్ నుంచి 1 శాతాన్ని మినహాయించుకుని ‘ఆరోగ్య భద్రత’ఖాతాలో నిల్వ ఉంచడం ద్వారా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద క్యాష్‌లెస్ వైద్య సదుపాయం కల్పించాలి. తొలుత వైద్య ఖర్చులను ఈ ఖాతా నుంచి చెల్లించాలి. బిల్లులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ద్వారా తిరిగి ఈ ఖాతాలో డబ్బులు జమ చేయాలి. పదవీ విరమణ సమయంలో ఒక నెల పెన్షన్‌కు సమానమైన డబ్బులను లేదా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులను ఏకమొత్తంగా తీసుకున్న సీపీఎస్ ఉద్యోగులకు సైతం ఈహెచ్ఎస్ వర్తింపజేయాలి. సర్వీసు పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల వైద్య భత్యాన్ని నెలకు రూ.350 నుంచి రూ.600కు పెంచాలి. పరిమితులు లేకుండా ఎల్టీసీ ప్రస్తుత లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) పథకానికి బదులు దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు వీలుగా కొత్త పథకాన్ని అమలు చేయాలి. నాలుగు ఏళ్లకు ఒకసారి చొప్పున మొత్తం సర్వీసు కాలంలో గరిష్టంగా 4 పర్యాయాలు ఎల్టీసీ సదుపాయాన్ని కల్పించాలి. దూరం, డబ్బుల విషయంలో పరిమితులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. సర్కారీ బడుల్లో చదివిస్తేనే ఫీజులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువులకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లల ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించే ఉద్యోగుల పిల్లల ఫీజులను ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఇద్దరు పిల్లలకు చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంత్యక్రియల వ్యయం రూ.30 వేలు ఉద్యోగుల అంత్యక్రియల వ్యయాన్ని రూ.30 వేలకు పెంచాలి. షెడ్యూల్డ్ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్‌లను నెలకు 30 శాతం వరకు గరిష్టంగా రూ.1,660కు మించకుండా పెంచాలి. అంధ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు చెల్లించే రీడర్స్ అలవెన్సును గరిష్టంగా రూ.2,500కు మించకుండా 30 శాతానికి పెంచాలి. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పని చేసే ఉద్యోగులకు మూల వేతనంపై 20 శాతం వరకు ఢిల్లీ అలవెన్సు/ప్రత్యేక అలవెన్సును రూ.5,500 కు మించకుండా పెంచాలి. అంధ, బధిర, శారీరక వికలాంగ ఉద్యోగుల కన్వేయన్స్ అలవెన్సును రూ.3 వేలకు మించకుండా మూత వేతనంపై 10 శాతానికి పెంచాలి. సీపీఎస్‌లో సర్కారు వాటా పెంపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)లో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మూలవేతనం+డీఏపై 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలి. సీపీఎస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇన్వాలిడేషన్ పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలి. పాత పెన్షన్ పథకం పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు సమానంగా సీపీఎస్ పెన్షనర్లకు సైతం డెత్ రిలీఫ్ చార్జీలను వర్తింపజేయాలి. -
ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు బుధవారం విడుదలైంది. ఆ రిపోర్టులో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సూచించింది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉండాలని, గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండొచ్చని సిఫారసు చేసింది. గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు.. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచింది. ( బంగారు తెలంగాణకు బలమైన పునాదులు ) సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. 2018 జులై 1వ తేదీ నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సాయంత్రం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపనుంది. ఈ మేరకు తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు ఆహ్వానం పంపింది. -
ఎన్నికల విధుల్లో పాల్గొనండి
సాక్షి, అమరావతి: ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. కోడ్ అమలు, ఉద్యోగుల విధుల గురించి చెప్పిన ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి కూడా వారికి వివరించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహించడం కష్టమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో బుధవారం జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తానని హమీ ఇచ్చారు. ఇక తమ భద్రతకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు పలు అనుమానాలు లేవనెత్తగా ఆయన నివృత్తి చేశారు. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. సమావేశానంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో మృతిచెందితే రూ.50 లక్షలు ఇవ్వాలి తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామని.. కానీ, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా సోకి మృతిచెందితే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరామన్నారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీ వేయవద్దని.. ఆరోగ్య సమస్యలున్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. తాము ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే కోరామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఉద్యోగులకు న్యాయం జరగలేదని, అయినా తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి అడిగితే తమకు రాజకీయాలు ఆపాదించారని, గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించండి అని నినాదాలు చేయించారని తెలిపారు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలవలేని వారు కూడా తమను విమర్శిస్తున్నారని, ఉద్యోగులతో వైరం మంచిది కాదని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ తమను వివాదంలోకి లాగిందని, తాము ఎప్పుడూ వారితో విభేదించలేదన్నారు. తమపై వ్యాఖ్యలు చేశాకే తాము వ్యాఖ్యలు చేశామని చెప్పారు. ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఎన్నికలకు సహకరిస్తాం ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పామని, ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికలకు సహకరించాలని నిర్ణయించామని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని తాము కోరగా తాను ఆ విషయాన్ని ఎన్నికల కమిషనర్‌తో చర్చిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొని కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరగా ఆయన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఇప్పటికీ ఉద్యోగులు ఎన్నికలకు సిద్ధంగా లేరని.. తమ సంఘం జిల్లాల సభ్యులు ఎన్నికలకు వెళ్లలేమని చెబుతున్నారని చెప్పారు. వారిని ఒప్పించి ఎన్నికలకు సహకరిస్తామని, కానీ.. ఉద్యోగులకు కోవిడ్ నుంచి పూర్తి రక్షణ కల్పించాల్సిందేనని కోరామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. ఎక్కువ వయసున్న ఉద్యోగులను, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరామన్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటామని, పీపీఈ కిట్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారని, అవన్నీ జరిగేలా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
ఎన్నికల విధులు నిర్వర్తించలేం
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సిన్ ఇచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించలేమని అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి తెలిపాయి. వ్యాక్సిన్ ఇచ్చేవరకూ పంచాయతీ ఎన్నికలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం వేర్వేరుగా సీఎస్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చాయి. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వైవీ రావు, కోశాధికారి, పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.వి.మురళీకృష్ణనాయుడు, టీచర్ల సంఘాల జేఏసీ చైర్మన్ జి.వి.నారాయణరెడ్డి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, కార్యదర్శి బి.కిషోర్‌కుమార్ తదితరులు సీఎస్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు సీఎస్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగులపై ఎందుకీ కాఠిన్యం? అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల అభ్యంతరాలను తొమ్మిది పేజీల లేఖలో సీఎస్‌కు తెలిపామన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు డోసుల వ్యాక్సిన్ అందేవరకు ఎన్నికలు నిర్వహించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ అభ్యర్థనను, ఉద్యోగుల ఆందోళనను పెడచెవినపెట్టి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం బాధాకరమని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో పూర్తయ్యేది కాదని, కనీసం నెలరోజులపాటు నిత్యం ఉద్యోగులతో, ఓటర్లతో మమేకం కావాల్సి ఉంటుందని తెలిపారు. 1.40 లక్షల పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, బ్యాలెట్ బాక్సులు, సరంజామా తీసుకోవాలని, ఈ క్రమంలో ఎక్కడైనా కరోనా బారినపడే ముప్పు ఉందని చెప్పారు. ఉద్యోగుల పట్ల ఎన్నికల కమిషనర్ ఎందుకు ఇంత కఠినవైఖరితో ఉన్నారో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత కార్యాలయ ఉన్నతాధికారులను సైతం వదలకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయి వ్యక్తిని తొలగించారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వ్యాక్సిన్ పంపిణీ, ఎన్నికల నిర్వహణ రెండు ఒకేసారి చేపట్టడం ఉద్యోగులకు ఎలా సాధ్యమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా భయంతో ఎన్నికల విధులంటేనే హడలిపోతున్నాం కరోనా మహమ్మారి ముప్పు ఇంకా ప్రబలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. కరోనా భయంతో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖంగా ఉన్నవారిని ఎన్నికల విధులకు కేటాయించవద్దని, సుముఖంగా ఉన్న ఉద్యోగులను.. అదీ వారికి వ్యాక్సిన్లు వేసిన తరువాతే ఎన్నికల విధుల్లో నియమించాలని కోరారు. కరోనా వైరస్ మ్యుటేషన్ చెందుతూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైతే కరోనా బారినపడే ప్రమాదం ఉందని కలవరపడుతున్నట్టు పేర్కొన్నారు. -
ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : అవంతి
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, ఉద్యోగులకిచ్చిన హామీలను సైతం నెరవేర్చారని తెలిపారు. విశాఖలో జరిగిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశానికి మంత్రి అవంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు, విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రరావు, ఎస్వీ రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం ఉద్యోగులను పీడించేది కాదన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే సీఎం వైఎస్ జగన్ ధ్యేయమని చెప్పారు. అధికారంలోని వచ్చిన మూడు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చారని గుర్తుచేశారు. వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని అన్నారు. -
‘సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం’
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గర్తింపు ఇవ్వడాన్ని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా ఆయన సంతకం లేకుండా కొంతమంది అధికారులు రహస్యంగా గుర్తింపు ఇచ్చారని ఆరోపించారు. గుర్తింపు ఇచ్చిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం రోసా నిబంధనలను అనుసరించి ఎన్నికల ద్వారా నిర్వహణ సభ్యుల నియామకం చేపడుతుందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రోసా నిబంధనలు పాటించకుండా జీవో 103 ద్వారా గుర్తింపుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఖండించారు. ప్రభుత్వం సంఘాలకు గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి కమిటీ లో చర్చించాలని పేర్కొన్నారు. స్టాఫ్ కౌన్సిల్ లో ఎటువంటి సమాచారం లేకుండానే దొడ్డిదారిన 103 జీవోతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే జీవో 103 రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం అవాస్తవం
సాక్షి, అమరావతి : ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తోన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షడు రామసూర్యనారయణ తెలిపారు. ఈ విషయంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు గ్రామ సచివాలయంలో పరిపాలన సౌలభ్యం కోసమే. ఈ పోస్టులకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఈ పరీక్షల్లో 10 శాతం వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. ఒకవేళ వారు పరీక్షల్లో ఉత్తీర్ణత కాకపోయినా వారిని ఉద్యోగాల్లో నుంచి తీసివేయరు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం జరగదు. అర్హత కలిగిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరాం. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో జరిగిన తప్పిదం వల్లే ఈ గందరగోళం నెలకొంది. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానాన్ని రద్దు చేయాలని అడిగాం. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారని’ వెల్లడించారు. -
ఏపీజీఈఏ అధ్యక్షుడిగా రామ సూర్యనారాయణ
సాక్షి, కాకినాడ : ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యకుడిగా రామ సూర్యనారాయణను, కార్యదర్శిగా ఆస్కరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రం నలుములల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీలోని 13 జిల్లాలకు నూతన అధ్యక్ష, కార్యదర్శిల పేర్లను సంఘం అధ్యక్షుడు రామసూర్యనారాయణ ప్రకటించారు. గత ప్రభుత్వ హయంలో సీఎం వద్ద భజన చేసిన కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ నూతన ముఖ్యమంత్రి వద్దకు చేరారని రామసూర్యనారాయణ అన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల ధర్నా
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాచౌక్‌లో ఉద్యోగ సంఘాల నేతలు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో 8.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాధాకృష్ణ దారుణ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి, పని గంటలతో సంబంధం లేకుండా, వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్‌లు, జన్మభూమి కార్యక్రమాలు, ఇతరత్రా ప్రభుత్వ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అవమానకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. 'రాధాకృష్ణ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించలేదు. సీఎం స్థాయి వ్యక్తి ఉద్యోగులకు భరోసా కల్పించాలి. ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన సంఘాలుగా మారాయి. కొంతమంది ఉద్యోగులను ధర్నాలకు రాకుండా బెదిరించారు. మహిళా అధికారిపై దాడి చేసిన చింతమనేనికి సీఎం వత్తాసు పలికడమే కాకుండా మళ్లీ టికెట్ ఇచ్చారు. బ్లాక్ మనీ రాజకీయాలతో ఏబీఎన్ రాధాకృష్ణ విర్రవీగుతున్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని, మనో ధైర్యాన్ని దెబ్బతీసిన రాధాకృష్ణ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు. ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ సందర్భంగా చంద్రబాబు, రాధాకృష్ణ ఉద్యోగులపై ఎంత విషం నింపుకున్నారో తేటతెల్లమైన విషయం తెలిసిందే. ‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాం గానీ..’ అని చంద్రబాబు అనగానే.. రాధాకృష్ణ ‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా! ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలు ఇవ్వడానికా జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దేవద్దు. తీసేయండి’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా చంద్రబాబు ‘మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. వాళ్లను (ఉద్యోగులను) కూడా లాగాలి కదా?’ అని ఉద్యోగుల విషయంలో తన దుర్బుద్ధి ఏమిటో చంద్రబాబు బయటపెట్టారు. -
బాబు, రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 24వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ధర్నాచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో 8.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాధాకృష్ణ దారుణ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయని చెప్పారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి, పని గంటలతో సంబంధం లేకుండా, వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్‌లు, జన్మభూమి కార్యక్రమాలు, ఇతరత్రా ప్రభుత్వ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అవమానకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై రాధాకృష్ణ ఇంతవరకూ స్పందించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహావేశాలు రగిలిస్తోందన్నారు. రాధాకృష్ణ ఉద్యోగులపై వాడిన పదజాలం వల్ల ప్రతి ఉద్యోగి ఆత్మాభిమానం దెబ్బతిందన్నారు. అంతేకాకుండా ఉద్యోగ వర్గాల ప్రతినిధి రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై కొందరు రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రతి ఉద్యోగి ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని, మనో ధైర్యాన్ని దెబ్బతీసిన రాధాకృష్ణ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 24న ధర్నా చౌక్ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమానికి ఆత్మాభిమానం గల ఉద్యోగులందరూ హాజరు కావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. -
అశోక్‌బాబు ప్యానల్ ఏకగ్రీవ ఎన్నిక!
గాంధీనగర్ (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో పి.అశోక్‌బాబు ప్యానల్ విజయం ఖాయమైంది. అధ్యక్ష స్థానానికి అశోక్‌బాబు ఆదివారం ఎన్నికల అధికారి డి.దాలినాయుడుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే ఇప్పటి వరకు అశోక్‌బాబు ప్యానల్ మాత్రమే నామినేషన్ వేసింది. దీంతో ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి. నామినేషన్ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు ఎ.విద్యాసాగర్, ఇక్బాల్, కోనేరు రవి తదితరులు పాల్గొన్నారు.