
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని(డీఏ) 3.144 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల డీఏ వారి బేసిక్ జీతంలో 30.392 శాతం నుంచి 33.536 శాతానికి చేరుకుంది. ఈ పెరిగిన డీఏ 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెరిగిన డీఏతోనే జూలై నెల జీతాలు, పెన్షన్లు ఇవ్వనున్నారు. 2019 జనవరి నుంచి 2021 జూన్ వరకు ఉన్న డీఏ బకాయిలను పెన్షనర్లకు, సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతల్లో అందజేయనున్నారు. అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఉన్న ఉద్యోగులకు బకాయిలను మూడు విడతలుగా.. వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు.
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్(హెచ్‌ఆర్‌ఏ)ను మరో ఏడాది కొనసాగిస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సచివాలయం, శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి వచ్చి.. అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి 2021 జూలై 1 నుంచి ఏడాది పాటు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ అమల్లో ఉంటుంది.
ఉద్యోగ సంఘాల హర్షం..
డీఏ పెంపు, బకాయిల చెల్లింపుతోపాటు 30 శాతం హెచ్‌ఆర్‌ఏను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల సమస్యలను గురువారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment