సాక్షి, విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాచౌక్‌లో ఉద్యోగ సంఘాల నేతలు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో 8.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాధాకృష్ణ దారుణ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి, పని గంటలతో సంబంధం లేకుండా, వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్‌లు, జన్మభూమి కార్యక్రమాలు, ఇతరత్రా ప్రభుత్వ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అవమానకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. 'రాధాకృష్ణ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించలేదు. సీఎం స్థాయి వ్యక్తి ఉద్యోగులకు భరోసా కల్పించాలి. ఆంధ్రజ్యోతి పేపర్‌లో కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన సంఘాలుగా మారాయి. కొంతమంది ఉద్యోగులను ధర్నాలకు రాకుండా బెదిరించారు. మహిళా అధికారిపై దాడి చేసిన చింతమనేనికి సీఎం వత్తాసు పలికడమే కాకుండా మళ్లీ టికెట్ ఇచ్చారు. బ్లాక్ మనీ రాజకీయాలతో ఏబీఎన్ రాధాకృష్ణ విర్రవీగుతున్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని, మనో ధైర్యాన్ని దెబ్బతీసిన రాధాకృష్ణ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ సందర్భంగా చంద్రబాబు, రాధాకృష్ణ ఉద్యోగులపై ఎంత విషం నింపుకున్నారో తేటతెల్లమైన విషయం తెలిసిందే. ‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాం గానీ..’ అని చంద్రబాబు అనగానే.. రాధాకృష్ణ ‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా! ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలు ఇవ్వడానికా జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దేవద్దు. తీసేయండి’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా చంద్రబాబు ‘మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. వాళ్లను (ఉద్యోగులను) కూడా లాగాలి కదా?’ అని ఉద్యోగుల విషయంలో తన దుర్బుద్ధి ఏమిటో చంద్రబాబు బయటపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment