తెలుగుదేశం పార్టీ బాకాగా గుర్తింపు పొందిన మీడియాలో ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అయితే నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో నిత్యం సంబంధాలు నెరపుతుంటారు. టీడీపీ ప్రభుత్వం ఏపీలో ఉన్నప్పుడు రాధాకృష్ణే పలు మద్యవర్తిత్వాలు, ఆర్దిక లావాదేవీలు చేసి బాగా లాభపడ్డ వ్యక్తి అన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయల మేర ఆయన తన సంస్థలకు కట్టబెట్టుకున్నారని అప్పట్లో కొందరు ప్రముఖులు నేరుగానే విమర్శలు గుప్పించేవారు. అలాంటి వ్యక్తి ఏమైనా చెబితే అదంతా చంద్రబాబు మనసులో మాటగాను, టీడీపీ భావనగాను అంతా భావిస్తారు. తాజాగా ఆయన రాసిన ఒక వ్యాసంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై చాలా ఆందోళన చెందారు. ప్రజలకు ఇలా పప్పు , బెల్లాలు మాదిరి పంచిపెట్టి వారిని సోమరులుగా మార్చుతారా అని ఆయన ప్రశ్నించారు.
✍️ఇది చదుతుంటే ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడే చంద్రబాబే గుర్తుకు వస్తారు. ఎంతకాదన్నా ఆయన సొంత మనిషిగానో, మరో రకంగానో ఈయన పేరు పడ్డారు కాబట్టి అలా రాసి ఉండవచ్చు. తెలంగాణ ఎన్నికల ఖర్చు, అక్కడి హామీల గురించి రాస్తూ కూడా ఈయన ఏపీని, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ద్వేషించడం మానుకోలేదు. ఈయన వ్యాసంలోని ఒక భాగం ఇలా ఉంది'ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసిన హామీల అమలుకు ఏటా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఒక అంచనా.
✍️కళ్లు చెదిరే అభివృద్ధి చేశామని చెప్పుకొనే పాలకులు ఈ విధంగా ప్రజలకు తాయిలాలు పంచుకుంటూ పోవడం సమర్థనీయమా? ఇలా అయితే ఈ హామీలకు అంతెక్కడ? కేసీఆర్ కోరుకుంటున్నట్టు ప్రజలు ఎలా గెలుస్తారు? రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించే హక్కు రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారు? ఎవరో ముఖ్యమంత్రి పీఠం మీద కుర్చోవడానికి ఇలా అలవికాని హామీలు ఇచ్చుకుంటూ పోవచ్చునా? ఈ ధోరణికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం లేదా? ఈ విషయంలో రాజ్యాంగబద్ధ సంస్థలు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేవు. స్వీయ నియంత్రణ పాటించాల్సిన రాజకీయ నాయకులు ఆ పని చేయరు. మరి ఎలా? మౌలిక సదుపాయాల కల్పనకు డబ్బు లేకపోయినా సంక్షేమం పేరిట ప్రజా ధనాన్ని పప్పూ బెల్లాల్లా పంచడం వల్ల ప్రజల్లో సోమరితనం పెరిగిపోతుండటం నిజం కాదా? "అని రాశారు.ఇది చదివితే ఏమనిపిస్తుంది.
✍️చంద్రబాబు నాయుడు తన మనసులో మాట పుస్తకంలో రాసిన విషయాల మాదిరే అనిపిస్తుంది కదా! పేద ప్రజలకు సాయం చేయడం వారిని సోమరిపోతుల్లా మార్చడమే అని అంటున్న ఈయన మాత్రం ప్రభుత్వాల నుంచి వందల కోట్లు సంపాదింవచ్చు. అది ప్రజల అభివృద్ది. అది మౌలిక వసతుల అభివృద్ది అని అనుకోవాలి. తన మీడియా వ్యాపారం కోసం ఈయన రాజకీయ నేతల నుంచి కోట్లకు కోట్లు వసూలు చేయవచ్చు. అప్పుడు ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందన్న సందేహం ఈయనకు రాదు. ప్రచార ప్రకటనల పేరుతో , నేతల పుట్టిన రోజు అనో, మరొకటనో వారిని పీడించి డబ్బులు గుంజవచ్చు. అక్కడితో ఆగకుండా ఆంధ్రజ్యోతి వార్షికోత్సవం పేరుతో ఎందరి నుంచి ప్రకటనల రూపంలో డబ్బు దండుకుంటున్నారు!ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది!చేసేది ..ఈ పనులు.. చెప్పేవి మాత్రం నీతులు. ప్రజలపైన, రాష్ట్రం పైన ప్రేమ ఉన్నట్లు నీతి శతకాలు వల్లె వేయడం. పోనీ ఇన్ని కబుర్లు చెప్పే ఈయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో రైతుల, డ్వాక్రా మహిళల లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని బోగస్ హామీ ఇచ్చినప్పుడు, అబ్బో ఆయన కాబట్టి రుణమాఫీ చేసేస్తారు.. అని ఆయన పత్రిక ప్రచారం చేసిందా?లేదా? అప్పుడేమైనా చంద్రబాబు హామీని నమ్మవద్దని రాసి ఉంటే ఫర్వాలేదనుకోవచ్చు.టీడీపీ ప్రతినెల రెండువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మానిఫెస్టోలో రాసినప్పుడు అదెలా సాధ్యమని ప్రశ్నించారా?సుమారు 400 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినప్పుడు ఈయనకు కమ్మగా ఉంది కదా!
✍️ఆ మానిఫెస్టోని వెబ్ సైట్ నుంచి మాయం చేసేశారు కదా! అప్పుడు నోరెత్తలేదే! చిత్తశుద్ది ఉంటే వాటిని కూడా ప్రశ్నించాలి కదా! ఈయన అసలు ద్వేషం తెలంగాణ పార్టీల మీద.. ఆ నేతల మీద కాదు. ఎందుకంటే ఆ పార్టీల నేతలతో ఆయన ఏదో రకంగా ఒప్పందం అయి ఉంటారు. బాగానే గిట్టుబాటుఅయి ఉంటుంది.అందుకే మొదట కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా ,టిఆర్ఎస్ పై దూకుడుగా వెళ్లిన ఈ మీడియా ఆ తర్వాత ఎందుకు పంధా మార్చుకుందో అర్ధం చేసుకోలేమా! ఆయన వెంటనే ఆవు కధ మాదిరి ఏపీ ప్రభుత్వంపై పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై నిత్యం వెదజల్లె విషాన్ని మరోసారి చిమ్మి తన వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఇదే వ్యాసంలో ఏమంటారో చూడండి...'పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. బటన్లు నొక్కుతున్నామని చెప్పుకొంటున్న పాలకులు అభివృద్ధిని, మౌలిక వసతులను గాలికి వదిలేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను చూశాక తెలంగాణ పరిస్థితి కూడా దిగజారబోతోందన్న గుబులు పట్టుకుంది."ఇది పచ్చి అబద్దం. తెలంగాణలో సైతం పలు సంక్షేమ స్కీములు ఉన్నాయి.
✍️దళిత కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని, బిసి బంధు, మరో బంధు పేరుతో లక్ష రూపాయల చొప్పున డబ్బు ఇప్పటికే ఇస్తున్నారు కదా!అవి కరెక్టా?కాదా?రైతు బంధు పేరుతో ఇచ్చే డబ్బులను సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?ఇంకో సంగతేమిటంటే ఈయన కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆరు గ్యారంటీలను ఎందుకు వివరంగా విశ్లేషించలేదు?కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణలో మరింత కష్టం అని తెలియదా! మనసులో కాంగ్రెస్ గెలవాలి... రేవంత్ రెడ్డి సి.ఎమ్. అయితే ప్రభుత్వంలో చక్రం తిప్పాలన్న కోరిక కాకుండా మరొకటి ఉందా? మరి ఏపీలో నిజంగా మౌలిక వసతులపై దృష్టి పెట్టలేదా? వేలాది గ్రామాలలో స్కూళ్లను బాగు చేయడం , ఆస్పత్రులను బాగు చేయడం, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ,వార్డు సచివాలయాల భవనాలు నిర్మించడం ఇవేవి మౌలిక వసతులు కావా? పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, నాలుగు ఓడరేవుల నిర్మాణం, తొమ్మిది ఫిషింగ్ హార్బనిర్మాణం వంటివి ఎన్నడైనా చంద్రబాబు టైమ్‌లో జరిగాయా?
✍️మరి అప్పుడు జరగకపోయినా చాలా జరిగిపోయినట్లు, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా, అసలేమీ చేయనట్లు పచ్చి అబద్దాలు రాస్తూ ప్రజలను మోసం చేయాలన్న తలంపు తెలుస్తూనే ఉంది. ఇది పక్కన బెడదాం. జగన్ బటన్ నొక్కుతున్నారని రోధిస్తున్నారు కదా! మరి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరంలో మహానాడు పెట్టి మినీ మానిఫెస్టోని ప్రకటించి, అందులో జగన్ ఇస్తున్నవాటికి ఐదు రెట్ల సంక్షేమ స్కీములు అమలు చేస్తామని,బటన్ నొక్కుతామని చెప్పినప్పుడు ఇదే రాధాకృష్ణ తన పత్రికలో ఏమి రాశాడో తెలుసా! జగన్ ప్రభుత్వంపైకి చంద్రబాబు శరాలు సిద్దం..ఇక ప్రభుత్వం పని అవుట్ అన్న చందంగా వాటిని పోల్చి తెగపొగిడారు కదా! రాధాకృష్ణ ఎంతకాదన్నా చంద్రబాబుకు ఏజెంటే కాబట్టి , ఆయనలాగే వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చా! జగన్ తాను చెప్పిన నవరత్నాల అమలుకు ఏడాదికి నలభైఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంటే గుండెలు బాదుకుంటున్న ఆంధ్రజ్యోతి, దీనితో పాటు ఉన్న మరో మీడియా ఈనాడులకు, చంద్రబాబు, పవన్‌లు ఇస్తున్న హామీల ప్రకారం ఏడాదికి లక్షన్నర కోట్లకు పైగానే ఆయా వెల్ఫేర్ స్కీములకు ఖర్చు చేయాలన్న విషయం తెలియదా!
✍️ఏనాడైనా అంత డబ్బు ఎక్కడనుంచి వస్తుందని రాధాకృష్ణ నిలదీశారా?అలా చేయకపోగా ..ఆహా మా చంద్రబాబు కాబట్టి అలా ప్రకటించారు అని చంకలు గుద్దుకున్నారు. నిజంగా రాధాకృష్ణకు ఏమాత్రం కొద్దిపాటి విలువలు ఉన్నా, చంద్రబాబు ప్రకటించిన మినీ మానిఫెస్టోని విమర్శిస్తూ వ్యాసం రాయాలి కదా? కర్నాటకలో కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పినవాటిని కొన్నిటిని, జగన్ అమలు చేస్తున్న కొన్నిటిని కాపీ కొట్టి మరింత ఎక్కువగా అమలు చేస్తామని కదా టీడీపీ మినీ మానిఫెస్టో ఇచ్చింది.దానికి బాబు గ్యారంటీ అంటూ ఒక సర్టిఫికెట్. 2014లో రైతుల రుణమాఫీ హామీ ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా జరిపి చేతులెత్తేసినప్పుడు ఆ గ్యారంటీ ఏమైంది?ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో ఇష్టారీతిన హామీలు ఇచ్చేశారని రాధాకృష్ణ చెప్పకనే చెప్పేశారు.
✍️టీడీపీ మినీ మానిఫెస్టోని నమ్మవద్దని ఆయనకు తెలియకుండానే ఒక వాస్తవం చెప్పేశారనుకోవాలి. లేదంటే 2014లో మాదిరి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేయవచ్చులే అని అయినా అనుకుని ఉండాలి. ఒకవేళ జగన్ తాను చెప్పిన విధంగా హామీలను నెరవేర్చకుంటే ఇదే రాధాకృష్ణ ఎంత ఘోరంగా రాసి ఉండేవారు! ఆ అవకాశం లేదు కనుక ఇప్పుడు ఈ రాగం ఎత్తుకున్నారు. పోనీ అందులో ఏమైనా చిత్తశుద్ది ఉందా అంటే అదేమి లేదు. మళ్లీ చంద్రబాబు చేసే అబద్దపు హామీలన్నిటిని భుజాన వేసుకుని తిరుగుతుంటారు. రాధాకృష్ణ, రామోజీవంటి వారిని ఆంధ్ర ప్రజలు నమ్ముతారా?నమ్మి మోసపోతారా? అంటే అలా జరగదనే 2019 ఎన్నికల అనుభవం చెబుతుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment