వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు | YSRCP Leader Lakshmi Parvathi Open Letter To ABN And Andhra Jyothi Chief Vemuri Radhakrishna - Sakshi
Sakshi News home page

వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు

Published Wed, Nov 1 2023 1:30 PM | Last Updated on Wed, Nov 1 2023 1:59 PM

Lakshmi Parvathi Open Letter To ABN Vemuri Radhakrishna - Sakshi

ఓ గొప్ప జర్నలిస్టు స్థాపించిన ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఒక చిత్తుకాగితంగా, చెత్త బుట్టగా మార్చేసి..  

సాక్షి, విజయవాడ: ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు ఎన్టీఆర్‌ సతీమణి, వైఎస్సార్‌సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు అవినీతిని ప్రొత్సహించి.. ఈనాడు టీడీపీని పతనం అంచున నిలబెట్టడంలో రాధాకృష్ణ పాత్రను లేఖలో ప్రస్తావిస్తూ.. చురకలతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారామె. 

చంద్రబాబు, ఆయనకి భుజంగా ఉంటూ రాధాకృష్ణ, రామోజీరావులు.. ఈ ముగ్గురు తెలుగు దేశం పార్టీకి నేటి దుస్థితిని కలగజేశారని లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీలాంటి(రాధాకృష్ణను ఉద్దేశించి..) వాళ్లు ఉంటారని తెలియకనే ఎన్టీఆర్‌ ఆనాడు టీడీపీని స్థాపించారు. నాడు 201 స్థానాల్లో నెగ్గి ప్రభంజనం సృష్టించిన పార్టీ.. 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయ్యింది. అందుకు కారణం మీతో పాటు చంద్రబాబు, రామోజీరావులే’’ అని లేఖలో పేర్కొన్నారామె. 

నార్ల వెంకటేశ్వరరావు లాంటి గొప్ప జర్నలిస్టు స్థాపించిన ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఒక చిత్తుకాగితంగా, చెత్త బుట్టగా మార్చావంటూ రాధాకృష్ణపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎవరో కష్టపడి సాధించుకున్నది తెలివిగా ఎత్తుకుపోవడంలో మీ గురుశిష్యులు ఇద్దరూ సిద్ధ హస్తులే అంటూ.. చంద్రబాబుకి, రాధాకృష్ణకి చురకలంటించారామె. తనను టీడీపీలో దుష్టశక్తిగా, సైతాన్‌గా, రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించిన ఆనాటి యెల్లో మీడియా.. ఆ ఆరోపణల్ని ఇప్పటివరకు రుజువు చేయలేకపోయిందని అన్నారామె. 

అల్లుడు కదాని అప్పజెబితే ఇల్లంతా ఏదో చేసాడట!
నారా లోకేష్‌ను అడ్డదారిలో తీసుకొచ్చి మంత్రిని చేస్తే.. అవినీతి రెండింతలు పెరిగిందని లక్ష్మీ పార్వతి లేఖలో పేర్కొన్నారు. అప్పటిదాకా ఒక చేత్తోనే సంపాదించిన చంద్రబాబు.. కొడుకు చేతుల్ని కలుపుకొని లక్షల కోట్లకు ఎగబాకాడని ఆరోపించారామె. అయినా.. అలాంటి కుటుంబాన్ని జాకీలు పెట్టి లేపడానికి ఆంధ్రజ్యోతి ఉంది కదా అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. 

ఎంత గొప్ప విజనరీనో?
చంద్రబాబు విజన్‌కు ఆకాశానికి ఎత్తే రాధాకృష్ణకు లేఖలో చురకలంటించారామె. వెన్నుపోటు, అడ్డగోలు అవినీతి సంపాదన, కేసులు బయటకు రాకుండా మేనేజ్‌ చేయడంలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ(చంద్రబాబు) గొప్ప విజన్‌ సాధించారని అన్నారామె. ‘‘ప్రస్తుతం తెలుగుదేశం పరువు ఏ మురుగు గుంటలో పడి దొర్లుతుందో చూడండి. అవినీతి చక్రవర్తి మీ విజనరీ నాయకుడు పై కేసులు మీద కేసులు వస్తుంటే.. జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెట్టాడు. కొడుకు నారా లోకేష్‌ జైలు దారిలో ఉన్నాడు. హెరిటేజ్ లెక్కలు చెప్పలేక భువనేశ్వరి రోడ్లమీద తిరుగుతున్నది. ఎంత గొప్ప విజనరీ’’ అని లేఖలో లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. 

టీడీపీకి సమాధి కట్టి కోట్లు సంపాదించారు
పేదల పార్టీగా ఉన్న టీడీపీని.. పెద్దల పార్టీగా మార్చడానికి  చంద్రబాబు, రాధాకృష్ణ చాలా కష్టపడ్డారంటూ విమర్శలు గుప్పించారామె. ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారో.. తెలంగాణలో ఇప్పుడు అదే కాంగ్రెస్‌ కాళ్ల దగ్గర టీడీపీని పెట్టాడని.. ఏపీలోనూ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి తాకట్టు పెట్టే యత్నం జరుగుతోందని.. గంగా నదిలాంటి టీడీపీని మురుగు కాలువగా మార్చి అబద్దాల పునాదుల మీద నడిపిస్తున్నారని మండిపడ్డారామె. తెలుగు దేశం ఖ్యాతిని సమాధి చేసి.. ఆ రాళ్లతో కోట్లు సంపాదించుకున్నారంటూ రాధాకృష్ణ, చంద్రబాబులపై ఆమె లేఖ ద్వారా తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement