సాక్షి, అమరావతి: ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. కోడ్ అమలు, ఉద్యోగుల విధుల గురించి చెప్పిన ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి కూడా వారికి వివరించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహించడం కష్టమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో బుధవారం జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తానని హమీ ఇచ్చారు. ఇక తమ భద్రతకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు పలు అనుమానాలు లేవనెత్తగా ఆయన నివృత్తి చేశారు. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. సమావేశానంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల విధుల్లో మృతిచెందితే రూ.50 లక్షలు ఇవ్వాలి
తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామని.. కానీ, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా సోకి మృతిచెందితే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరామన్నారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీ వేయవద్దని.. ఆరోగ్య సమస్యలున్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. తాము ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే కోరామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఉద్యోగులకు న్యాయం జరగలేదని, అయినా తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి అడిగితే తమకు రాజకీయాలు ఆపాదించారని, గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించండి అని నినాదాలు చేయించారని తెలిపారు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలవలేని వారు కూడా తమను విమర్శిస్తున్నారని, ఉద్యోగులతో వైరం మంచిది కాదని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ తమను వివాదంలోకి లాగిందని, తాము ఎప్పుడూ వారితో విభేదించలేదన్నారు. తమపై వ్యాఖ్యలు చేశాకే తాము వ్యాఖ్యలు చేశామని చెప్పారు. ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తామన్నారు.
ఎన్నికలకు సహకరిస్తాం
ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పామని, ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికలకు సహకరించాలని నిర్ణయించామని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని తాము కోరగా తాను ఆ విషయాన్ని ఎన్నికల కమిషనర్‌తో చర్చిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొని కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరగా ఆయన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఇప్పటికీ ఉద్యోగులు ఎన్నికలకు సిద్ధంగా లేరని.. తమ సంఘం జిల్లాల సభ్యులు ఎన్నికలకు వెళ్లలేమని చెబుతున్నారని చెప్పారు. వారిని ఒప్పించి ఎన్నికలకు సహకరిస్తామని, కానీ.. ఉద్యోగులకు కోవిడ్ నుంచి పూర్తి రక్షణ కల్పించాల్సిందేనని కోరామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలి
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. ఎక్కువ వయసున్న ఉద్యోగులను, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరామన్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటామని, పీపీఈ కిట్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారని, అవన్నీ జరిగేలా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment