thadimarri
-
సూరీ..నిజం చెప్పాలె!
ఇంత కాలం నెరవేర్చకుండా అటకెక్కించిన హామీల మూటను ధర్మవరం ఎమ్మెల్యే సూరి కిందకు దించాడు. భుజాన వేసుకుని ఎన్నికల ప్రచారానికి జనం మధ్యలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ మూటలో నుంచి ఓ హామీ సూరిని పలకరించింది. ‘ఓ సూరీ.. ఎమ్మెల్యేగా ఐదేళ్లు ధర్మవరం నియోజకవర్గాన్ని పాలించావు. ఈ ఐదేళ్లూ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశావు. ఇప్పడు మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు పట్టువదలకుండా బయలుదేరావు. నీ సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నీకు ప్రయాస భారం తెలియకుండా ఓ కథ చెబుతాను విను. అంటూ ఆయన హామీలను ఓసారి గుర్తు చేసింది. సాక్షి, తాడిమర్రి : ముప్పై సంవత్సరాల క్రితం తాడిమర్రి మండలంలోని చెరువులను పీఏబీఆర్ నీటితో నింపేందుకు శ్రీకారం చుట్టారు. పీఏబీఆర్ నుంచి పలు గ్రామాల మీదుగా కాలువ తవ్వకాలు చేపట్టారు. తాడిమర్రి మండలంలోని శివంపల్లి వద్ద (112వ కిలోమీటర్)కు చేరుకోగానే పనులు ఆగిపోయాయి. మరో 2.4 కి.మీ మేర పనులు జరిగితే తాడిమర్రి సమీపంలోని తాటిమాండ్ల వంక మీదుగా చిత్రావతి నది నుంచి మండలంలోని చెరువులకు నీరు చేరుతుంది. చెరువుల్లో నీరు చేరితే ఈ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటిమట్టం పెరిగి సాగునీటి సంకటం తప్పిపోతుంది. రైతుల జీవితాలే మారిపోతాయి. కానీ ఈ పనులు మూడు దశాబ్దాలుగా ముందుకు సాగలేదు. మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే హోదాలో ఈ పనులు పూర్తి చేసి, చెరువులకు నీరు అందిస్తామంటూ నీవు చేసిన హంగామా అంతాఇంతా కాదు. కాలువ వెళ్లే మార్గంలో 33.70 ఎకరాల భూమి అవసరమని, రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు రైతులకు పరిహారంగా చెల్లించేందుకు రూ. 1.36 కోట్లు కూడా మంజూరయ్యాయని ప్రకటించావు. కాలువ తవ్వకాలకు రూ.8 కోట్లతో డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి అనుమతుల కోసం పంపినట్లు ఊరించావు. కాలువ నిర్మాణం పూర్తి కాగానే మండలంలోని అన్ని చెరువులనూ నీటితో నింపుతామంటూ ఆశలు పెట్టావు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. 2018 జనవరి 4న మర్రిమాకులపల్లిలో జరిగిన జన్మభూమి గ్రామసభలో, ఈ ఏడాది జనవరి 8న తాడిమర్రిలో జరిగిన జన్మభూమి గ్రామసభలోనూ పీఏబీఆర్ కాలువ నిర్మాణం పూర్తి చేస్తానని హామీనిచ్చావు. నేటికీ ఈ పనులు చేపట్టలేదు. సూరీ! ఇప్పుడు చెప్పు.. దేశానికి వెన్నముక రైతే అని అంటారు కదా? మరి అలాంటి రైతు సంక్షేమానికి నీవు చేసిందేమి? అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువ పనులు పూర్తి చేస్తానని మూడేళ్లుగా రైతులను మభ్య పెడుతూ వచ్చావు. నిధులూ మంజూరయ్యాయన్నావు... మరి పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయావు..? వాస్తవాలు నీవు చెప్పకపోతే నియోజకవర్గ ప్రజలే చెబుతారు. నియోజకవర్గంలో నీవు తలెత్తుకుని తిరగలేవు. అలాగని తప్పు సమాధానం చెప్పి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే నీకు ఓటమి తప్పదు. సమాధానం చెప్పేందుకు సూరి నోరు విప్పాడు. ‘ఓటు బ్యాంక్ రాజకీయల కోసం’ అంటూ చెప్పేలోపు హామీ అడ్డుకుని మభ్య పెట్టే ప్రయత్నం చేయమాకు సూరీ.. వాస్తవాలేమిటో ప్రజలే చెబుతారు విను అంటూ ఆ హామీ కాస్త గాలికి ఎగిరిపోయింది. ఇతని పేరు అల్లే రామచంద్రారెడ్డి. తాడిమర్రి మండలం శివంపల్లి గ్రామం. ఐదు ఎకరాల్లో 900 చీనీ చెట్లు పెంచుతున్నాడు. మరో 1.50 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేపట్టాడు. సాగునీరు సరిపోక పోవడంతో మరో మూడు ఎకరాలను బీడుగా వదిలేశాడు. ఇటీవల రూ.1.20 లక్షలు ఖర్చుచేసి రెండు బోర్లు వేశాడు. చుక్కనీరు పడలేదు. పీఏబీఆర్ కాలువ నిర్మాణం పూర్తయి చెరువులకు నీరు చేరి ఉంటే ప్రస్తుతమున్న పంటను కాపాడుకోవడంతో పాటు మిగిలిన మూడు ఎకరాల్లోనూ పంట సాగు చేసేవాడినంటూ రైతు చెబుతున్నాడు. రైతులను మభ్యపెట్టారు కాలువ నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు రైతులను ఎమ్మెల్యే సూరి మభ్య పెట్టారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఆయనలో లేకపోవడంతో నిర్మాణ పనులు హామీకే పరిమితమయ్యాయి. – ఓబిరెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం -
ఛిద్రావతి
అడుగంటిన సీబీఆర్ - మూడు మున్సిపాలిటీలో నీటి ఎద్దడి - వందలాది గ్రామాలకు పొంచిన ముప్పు - నాలుగు రోజులకోసారి విడుదల - ఇప్పటికీ మేల్కొనని పాలకులు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్)లో నీటి మట్టం రోజురోజుకూ పడిపోతోంది. ధర్మవరం, కదిరి, పులివెందుల మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి వాటర్ స్కీం, వైఎస్సార్ కడప జిల్లాలోని యురేనియం ప్రాజెక్ట్‌కు ఇక్కడి నుంచే నీరు అందుతోంది. అయితే నీటి మట్టం అడుగంటడంతో ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి వాటర్ స్కీం పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం : 10 టీఎంసీలు ప్రస్తుతం నిల్వ నీరు : 0.175 టీఎంసీలు తాగునీటి పథకాలు : 4 యురేనియం ప్రాజెక్ట్ : 1 రోజూ ఆయా ప్రాజెక్ట్‌లు వినియోగించే నీరు : 40 క్యూసెక్కులు ధర్మవరం: తాడిమర్రి మండల పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో అట్టడుగుకు చేరిన నీటి మట్టం ఆందోళన కలిగిస్తోంది. వేలాది గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకమవుతోంది. మండల సరిహద్దు, వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం పార్నపల్లి సమీపంలో చిత్రావతి నదిపై 1993లో అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచే సత్యసాయి వాటర్ స్కీం, ధర్మవరం, కదిరి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు సరఫరా అవుతోంది. నాలుగు పంప్‌హౌస్‌లను నిర్మించి ఆయా ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారు. వీటితో పాటు వైఎస్ఆర్ జిల్లా తుమ్మల వద్ద ఏర్పాటు చేసిన యురేనియం ఫ్యాక్టరీకి నీటిని అందించేందుకు మరో సంప్ నిర్మితమైంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రిజర్వాయర్‌లో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. గత ఆరేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో సీబీఆర్‌లో నీటి చేరిక అంతంత మాత్రంగానే ఉంటోంది. నెల రోజుల క్రితం 0.870 టీఎంసీలు ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 0.175 టీఎంసీలకు చేరుకుంది. ఫలితంగా నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయింది. ఫలితంగా ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలకు నీటిని సరఫరా చేసే పంప్‌హౌస్‌లలో రాళ్లు తేలాయి. ఈ కారణంగా ధర్మవరం మున్సిపాలిటీకి సంబంధించిన పంప్‌హౌస్ వద్దకు నీటిని మళ్లించేందుకు మున్సిపల్ అధికారులు జేసీబీలతో కాలువలు తవ్వించారు. అదేవిధంగా కదిరి మున్సిపాలిటీ పంప్హౌస్కూ కాలువ తీస్తున్నారు. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలకు సరఫరా అవుతున్న నీరు కూడా రంగు తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతుండగా.. ఇప్పుడు నాలుగు రోజులకోసారి పంపిణీ చేస్తుండటం గమనార్హం. వాటా నీరు రాకపోవడంతోనే సమస్య హెచ్ఎల్సీ నుంచి వాటా నీరు రాకపోవడంతోనే సమస్య తలెత్తుతోంది. వాస్తవానికి టీబీ డ్యాం నుంచి తాగునీటి కోసం 4.4 టీఎంసీలు, సాగునీటికి 0.6 టీఎంసీల నీటిని కేటాయించాల్సి ఉండగా.. 1.5 నుంచి 2 టీఎంసీలు మాత్రమే వదులుతున్నారు. మూడు మున్సిపాలిటీలకు, సత్యసాయి వాటర్ స్కీంకు రోజూ నీరు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఈ నెల 22న నిర్వహించే కృష్ణా ట్రిబ్యునల్ సమావేశం తర్వాతే నీటి విషయంలో స్పష్టత వస్తుంది. - ఖాదర్ వలి, ఏఈ సీబీఆర్, పార్నపల్లి -
విహార యాత్రలో విషాదం
తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండల సరిహద్దులోని పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు గల్లంతు అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు, సింహాద్రిపురం మండల కేంద్రానికి చెందిన మరో యువకుడు మొత్తం ఏడుగురు నాలుగు చక్రాల వాహనంలో ఆదివారం మధ్యాహ్నం సీబీఆర్‌లో విహార యాత్రకు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వారు తెచ్చుకున్న భోజనాలు తింటుండగా షేక్ బాబావలి (31) కొద్దిగా అన్నం తిని సీబీఆర్‌లోకి ఈతకు దిగాడు. ఇవతల గట్టునుంచి అవతల గట్టుకు ఈదుతూ వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో అతని దుస్తులకు ముళ్లకంపలు తగులుకున్నాయి. దీంతో భయబ్రాంతులకు గురైన బాబావలి రక్షించించండి అంటూ కేకలు వేశాడు. గట్టుమీద ఉన్న స్నేహితులు కిందకు దిగేలోపు అతను గల్లంతయ్యాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలసి సీబీఆర్‌లో గాలించినా జాడ కనించలేదు. గల్లంతైన బాబావలికి భార్య మెహరాబి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. లింగాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
సెగ మొదలైంది
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వేసవి సెగ మొదలైంది. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ వేడి, ఉక్కపోత పెరిగింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల మార్క్ నమోదవుతోంది. బుధవారం తాడిమర్రి, యాడికి మండలాల్లో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా... చెన్నేకొత్తపల్లి 40.9 డిగ్రీలు, శింగనమల 40.7, పామిడి 40.7, ఆత్మకూరు 40.5, యల్లనూరు 40.2, తాడిపత్రి 39.9, పుట్లూరు 39.8, పుట్టపర్తి 39.2, గుంతకల్లు 39.1, కదిరి 39.1, గుత్తి 38.9, ధర్మవరం 38.8, అనంతపురం, కళ్యాణదుర్గం 38 డిగ్రీలు, పెనుకొండ 37.9, హిందూపురం 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 22 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 56 నుంచి 82 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 20 వరకు ఉంది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి. -
తాడిమర్రిలో 33.7 మి.మీ వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం పగలు కూడా వర్షాలు పడటంతో తాడిమర్రి మండలంలో అత్యధికంగా 33.7 మి.మీ వర్షం పడగా మరో 40 మండలాల్లో వర్షపాతం నమోదైంది. మొత్తమ్మీద ఈ ఖరీఫ్‌లో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 221.4 మి.మీ గానూ 219.1 మి.మీతో సాధారణ వర్షపాతం నమోదైంది. -
బోగస్ పాసుపుస్తకాలపై విచారణ
తాడిమర్రి : మండలంలో గతంలో జరిగిన బోగస్ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై తహసీల్దార్ కార్యాలయంలో సీఐడీ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. గత ఏడాది క్రితం రెవెన్యూ అధికారులు స్థానిక బ్యాంక్‌ల్లో సోదాలు చేయగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 39, సహకార సంఘం బ్యాంక్‌లో 15 మొత్తం 54 బోగస్ పుస్తకాలను గుర్తించారు. దీంతో బోగస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు కొందరు వీఆర్ఓలపై కేసులు నమోదు చేశారు. గత నెలలో సీఐడీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. కాగా శనివారం సీఐడీ సీఐ సీఎస్హెచ్ గౌస్, ఎస్ఐ ఇబ్రహీంలు గతంలో తాడిమర్రి వీఆర్ఓగా పని చేసిన కాటమయ్య, అగ్రహారం వీఆర్ఓగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన విశ్వమూర్తిని విచారించారు. బ్యాంక్ తనిఖీల్లో లభించిన పట్టాదారు పాసుపుస్తకాల మేరకు వన్‌బీ, అడంగల్, డైక్లాట్ తదితర రికార్డులను పరిశీలించారు. ఎవరెవరికి ఎన్ని పుస్తకాలు పంపిణీ చేశారు? పుస్తకాలు ఎక్కడ నుంచీ సేకరించారు? ఎన్ని ఎకరాల విస్తీర్ణం పంపిణీ చేశారు? అనే విషయాలపై విచారించారు. తదుపరి విచారణలకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని సదరు వీఆర్ఓలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆదెప్ప, వీఆర్ఓలు వీరూపాక్షప్ప,రామకృష్ణ పాల్గొన్నారు. -
తప్పిన పెను ప్రమాదం
= అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా = ఐదుగురికి స్వల్ప గాయాలు తాడిమర్రి : మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేçÙన్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మవరం డిపోకు చెందిన (ఏపీ 02 ఎక్స్ 2748 నంబర్) ఆర్టీసీ అద్దె బస్సు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పులివెందులకు బయలుదేరింది. సుమారు గంట వ్యవధి తర్వాత తాడిమర్రిలోని సబ్‌స్టేçÙన్కు దగ్గర నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్డు మీదకు రాగానే అదుపు తప్పి రోడ్డుపక్కన గుంతలోకి పడింది. దీంతో అందులోని ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పగా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. గుడ్డంపల్లికి చెందిన వెంకటరెడ్డి, పెద్దకోట్లకు చెందిన వెంకటలక్ష్మి, పార్నపల్లికి కృష్ణమూర్తి, చిల్లకొండయ్యపల్లికి చెందిన గర్భవతి స్వాతి, కడపకు చెందిన అమరావతిలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారు. అధిక వేగం, అధిక లోడు కారణంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, ఆర్ఐ ఆదెప్ప, ఈఓపీఆర్డీ నాగరాజులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు.