తప్పిన పెను ప్రమాదం
= అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
= ఐదుగురికి స్వల్ప గాయాలు
తాడిమర్రి : మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేçÙన్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మవరం డిపోకు చెందిన (ఏపీ 02 ఎక్స్ 2748 నంబర్) ఆర్టీసీ అద్దె బస్సు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పులివెందులకు బయలుదేరింది. సుమారు గంట వ్యవధి తర్వాత తాడిమర్రిలోని సబ్‌స్టేçÙన్‌కు దగ్గర నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్డు మీదకు రాగానే అదుపు తప్పి రోడ్డుపక్కన గుంతలోకి పడింది. దీంతో అందులోని ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డారు.
ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పగా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. గుడ్డంపల్లికి చెందిన వెంకటరెడ్డి, పెద్దకోట్లకు చెందిన వెంకటలక్ష్మి, పార్నపల్లికి కృష్ణమూర్తి, చిల్లకొండయ్యపల్లికి చెందిన గర్భవతి స్వాతి, కడపకు చెందిన అమరావతిలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారు. అధిక వేగం, అధిక లోడు కారణంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, ఆర్‌ఐ ఆదెప్ప, ఈఓపీఆర్డీ నాగరాజులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు.