సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్ల మేర నష్టం కలిగించారంటూ విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సూర్యనారాయణపై ఉన్నవి మామూలు ఆరోపణలు కాదని, అవి చాలా తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది.
సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చి చెప్పింది. సూర్యనారాయణ పాత్రపై వ్యాపారులు స్పష్టమైన వాంగ్మూలాలు ఇచ్చారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత వ్యాపారులు ముందుకొచ్చి వాంగ్మూలాలు ఇచ్చారని, సహ నిందితులు సైతం వాంగ్మూలాలు ఇచ్చారని, పలువురు సాక్షులు కూడా వాంగ్మూలం ఇచ్చారని, వీటన్నింటినీ పరిశీలిస్తే నేరంలో సూర్యనారాయణ పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయంది.
చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు
దర్యాప్తులో పోలీసులు సేకరించిన సాక్ష్యాలు సూర్యనారాయణ పాత్రను ప్రాథమికంగా నిర్ధారిస్తున్నాయని తెలిపింది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినటువంటి తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో సూర్యనారాయణ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అది ఇంకా పూర్తి కాలేదంది. అందువల్ల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment