పరీక్ష కాగానే జవాబుల కాపీ!
ఆఫ్‌లైన్ పరీక్షల్లో కార్బన్‌లెస్ పేపర్లు ఇవ్వనున్న టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: పరీక్ష రాయగానే జవాబు పత్రం కాపీని అభ్యర్థులు ఇక ముందు వెంటనే తీసుకెళ్లవచ్చు.. ప్రతి ప్రశ్నకు సంబంధించి తాము గుర్తించిన సమాధానాలను పరీక్ష ‘కీ’తో సరిచూసుకోవచ్చు.. ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయించింది. వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఆఫ్‌లైన్ పరీక్షల్లో అభ్యర్థులకు కార్బన్‌లెస్ జవాబు పత్రాలను అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించి అన్ని రాతపరీక్షల (ఆఫ్‌లైన్‌లో)కు ఈ విధానాన్ని అమలు చేయనుంది. తొలుత వచ్చే నెల 1న జరుగనున్న వాటర్ వర్క్ విభాగంలో మేనేజర్ పోస్టుల రాతపరీక్షలో దీన్ని అమలు చేస్తోంది.
ఆఫ్‌లైన్‌లో నిర్వహించడంతో..
వాటర్ వర్క్ విభాగంలో 146 మేనేజర్ పోస్టులకు పోటీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని భావించారు. కానీ ఏకంగా 87 వేల దరఖాస్తులు రావడంతో ఆఫ్‌లైన్‌లో చేపట్టాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక అభ్యర్థులకు జవాబు పత్రాల కాపీలను అందజేసేలా కార్బన్‌లెస్ పత్రాలను వినియోగించడంపై చక్రపాణితో పాటు సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ లోతుగా చర్చించారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు కార్బన్‌లెస్ కాపీ విధానం ఉపయోగపడుతుందన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతోపాటు అభ్యర్థుల్లో ఎలాంటి అనుమానాలు తలెత్తవని, కమిషన్ పనితీరుపై నమ్మకం మరింత పెరుగుతుందని.. అందువల్ల ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
‘కార్బన్‌లెస్’ ఇలా..: ‘కార్బన్‌లెస్’ విధానం అంటే అసలు జవాబు పత్రాని (ఓఎంఆర్ షీట్)కి కింద అదేవిధంగా ఉన్న మరొక పత్రం ఉంటుంది. పైన ఉన్న అసలు పత్రంలో ఏదైనా రాస్తే.. ఆ ఒత్తిడికి కింద ఉన్న పత్రంపైన కూడా అది అచ్చు (మార్కింగ్)గా వస్తుంది. అయితే ఇందులో అచ్చుకాగితం (కార్బన్ పేపర్) ఉండదు. అందువల్లే కార్బన్‌లెస్ విధానం అంటారు. అభ్యర్థులు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్‌పై జవాబులను గుర్తించేటప్పుడు నాలుగు ఆప్షన్లలో సరైన ఆప్షన్‌ను టిక్ (వృత్తాన్ని పెన్ను/పెన్సిల్‌తో నింపడం) చేస్తారు. దీంతో కింద ఉన్న అదనపు పత్రంపై కూడా ఈ జవాబులు మార్కింగ్ అవుతాయి. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇచ్చి.. అదనంగా ఉన్న కార్బన్‌లెస్ కాపీని వెంట తీసుకెళ్లవచ్చు. తాను ఏయే ప్రశ్నలకు ఏయే ఆప్షన్లను ఎంచుకున్నదీ సరిచూసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి అనుమానాలకు ఆస్కారం ఉండదు.