వా2?
వాట్ ఈజ్ దిస్... ఏంటిది? సినిమాకి ఎండ్‌కార్డ్ పడదా? ఎండ్‌లో నంబర్ 2 ఉందని చెప్తారేంటి? కథకి ఇంటర్వెల్ ముందూ, తర్వాత ఉంటాయని తెలుసు. సినిమా తర్వాత కూడా కథ ఉంటుందా? ఏమిటి ఈ మాయాలోకం... సినిమాలోకం... వా2?
కట్టప్పా...మాకు చెప్పేయప్పా!
తెలుగుతో పాటు భారతీయ ప్రేక్షకులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సీక్వెల్ ఏదైనా ఉందంటే.. అది ‘బాహుబలి– 2’నే. దీనికి ముఖ్య కారణం... ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఆరాటమే! ‘కట్టప్పా... ఆ రహస్యం మాకు చెప్పేయప్పా!’ అంటున్నారు ప్రేక్షకులు. ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో వింత వింత సమాధానాలు ఇస్తూ, కామెడీ చేస్తున్నారు. మొత్తం మీద ‘బాహుబలి–2’పై ప్రేక్షకుల దృష్టి మరలకుండా ఉండేలా చేయడంలో రాజమౌళి రెండొందల శాతం సక్సెస్ అయ్యారు. అన్నట్టు... ఈ సినిమాని సీక్వెల్ అనకూడదు.
ఓ కథని రెండు భాగాలుగా తీస్తున్నారని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుతో పాటు ‘బాహుబలి’కి భారీ వసూళ్లు దక్కాయి. అందులో చూపించిన మాహిష్మతి సామ్రాజ్యం, యుద్ధ సన్నివేశాలు, నటీనటుల ప్రతిభ ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించాయి. ‘బాహుబలి 2’లో వాటికి తోడు అసలు కథ ఏంటనేది ఉంటుంది కనుక సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి రెండింతలు అయింది. అంచనాలను మించి అలరించడానికి ప్రభాస్ అండ్ కో ఏప్రిల్‌లో వస్తున్నారు.
నాగార్జున గారి గది!
చిన్న గది. అందులో నటీనటులు కూడా చిన్నోళ్లే! గదిని సృష్టించిన దర్శకుడూ చిన్నోడే! కానీ, నిర్మాత కాసుల పెట్టెని గలగలలాడించింది. కింగ్ లాంటి కంటెంట్‌తో ఓంకార్ దర్శకత్వం వహించిన ‘రాజుగారి గది’ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎంత పెద్ద విజయం అంటే... గదిలోకి నిజంగానే రాజుగారు ఎంటరయ్యేంత! అవును... కింగ్ నాగార్జున ఇప్పుడా గదిలోకి ఎంటరయ్యారు. చిన్న గదికి సీక్వెల్‌గా వస్తున్న ‘రాజుగారి గది–2’లో ఆయన నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌కి కొన్ని ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా సీక్వెల్స్‌లో ఫస్ట్ పార్ట్‌లో నటించిన నటీనటులే నటిస్తుంటారు.
ఓ స్టార్ హీరోకి ఫస్ట్ పార్ట్ నచ్చి, సెకండ్ పార్ట్ అంగీకరించడం... తెలుగులో ఇదే మొదటిసారి. అంతకు ముందు తమిళ డబ్బింగ్ సినిమా ‘చంద్రముఖి’ సీక్వెల్ ‘నాగవల్లి’లో వెంకటేశ్ నటించారు. నాగార్జున నటిస్తున్న మొదటి సీక్వెల్ కూడా ఇదే. దీని తర్వాత ఆయన సూపర్‌హిట్ సినిమాల్లో ఒకటైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి ప్రీక్వెల్ కూడా చేయనున్నారు. ‘రాజుగారి గది–2’ తర్వాత సోగ్గాడే.. ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యే ఛాన్సుంది.
మళ్లీ దండుపాళ్యం గ్యాంగ్!
కర్ణాటకలో ఓ ముఠా చేసిన హత్యలు, వరుస దోపిడీలు వంటి వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు శ్రీనివాసరాజు తీసిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా దర్శక–నిర్మాతలు ‘దండుపాళ్యం–2’ తీస్తున్నారు. పోలీసులు, మీడియా, ప్రజలు... సమాజంలో జరుగుతోన్న ఘటనలను ఈ ముగ్గురూ ఏ ధృక్పథంతో చూస్తున్నారనే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి భాగంలో నటించిన పూజా గాంధీ, రఘు ముఖర్జీలతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు.
గుంటూరులో శృంగారతార?
‘కరెంట్ తీగ’తో ప్రముఖ శృంగారతార సన్నీ లియోన్ తొలిసారి తెలుగు తెరపై కనిపించారు. మరోసారి ఆమె తెలుగు సినిమాలో నటిస్తారో? లేదో? చూడాలి. ‘గుంటూర్ టాకీస్–2’కి సన్నీని తీసుకురావాలని దర్శక–నిర్మాత ఎం. రాజ్‌కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘గుంటూర్ టాకీస్’కి సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్‌లో రష్మీ హాట్ షో సంచలనమైంది. సీక్వెల్‌ని మరింత హాట్‌గా తీయాలనుకుంటున్నారట! ఆల్రెడీ ‘కొమరం పులి’ ఫేమ్ నికిషా పటేల్ సీక్వెల్‌కి సంతకం చేశారు. ఒకవేళ సన్నీ లియోన్ నో చెబితే.. ఆ పాత్రకు నమితాని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సీక్వెల్‌తో నిర్మాత రాజ్‌కుమార్ దర్శకుడిగా మారుతున్నారు.
....సన్నాఫ్ లేడీస్ టైలర్
ప్రతిరోజూ ఓ కొత్త ఫ్యాషన్ మార్కెట్లోకి వస్తోంది. మరి, ముప్ఫై ఏళ్ల క్రితం వచ్చిన ఫ్యాషన్‌కి కంటిన్యూగా కొత్త ఫ్యాషన్ తీసుకొస్తామంటే జనాలకు ఆసక్తిగానే ఉంటుంది. టైలర్లో టాలెంట్ ఉంటే.. కొత్త ఫ్యాషన్‌లో డ్రస్ కుట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ‘సిల్వర్ స్క్రీన్ కామెడీ టైలర్’ దర్శకుడు వంశీ ఇప్పుడది నిరూపించే పనిలో ఉన్నారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ముప్ఫై ఏళ్ల క్రితం ఆయన కుట్టిన నవ్వుల తెర ‘లేడీస్ టైలర్’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఫ్యాషన్ డిజైనర్... సన్నాఫ్ లేడీస్ టైలర్’ సినిమా తీస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. టైటిల్లో చెప్పినట్టు... ‘లేడీస్ టైలర్’ కుమారుడి కథ ఇది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాని నేటి కాలానికి అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు.
కమల్రూపం ఎప్పుడొస్తుందో?
విడుదలకు ఆటంకాలు... వివాదాలు... వెరసి లోకనాయకుడు కమల్‌హాసన్‌కి ‘విశ్వరూపం’ బోల్డన్ని కష్టాలు చూపించింది. ఆ చిత్రం థియేటర్‌కు రావడానికి బయట జరిగిన కహానీ అప్పట్లో పెద్ద సినిమాని తలపించింది. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాణంలో భాగస్వామ్యం... సినీ విశ్వమంతా తానై కమల్ తీసిన స్పై థ్రిల్లర్ ‘విశ్వరూపం’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల్నీ మెప్పించింది. అంతర్జాతీయ స్థాయిలో కమల్ సినిమా తీశారన్నాని చూసినవాళ్లు అన్నారు.
ఈ సినిమా సీక్వెల్ ‘విశ్వరూపం–2’ నలభై శాతం షూటింగ్‌ని తొలి భాగం తీస్తున్నప్పుడే పూర్తి చేశారు. అయితే.. రెండోభాగం నిర్మాణ బాధ్యతల్ని కమల్ ఇతరులకు అప్పగించేశారు. బహుశా... ‘విశ్వరూపం’ విడుదల టైమ్‌లో ఎదురైన పరిస్థితులే కారణం కావొచ్చు. రెండో భాగం షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్టు... ఈ సిన్మా పలు కారణాలతో విడుదలకు నోచుకోలేదు. కమల్రూపం ఎప్పుడొస్తుందో పరమేశ్వరుడికే ఎరుక!
2.0 దటీజ్ తలైవా!
రజనీకాంత్ ప్రత్యేకంగా పని గట్టుకుని ఓ సినిమాకి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేయరు. సీక్వెలే ఆయన దగ్గరకి వెళ్లి అడిగితే కాదనరు. ‘ఓకే’ చెప్పేస్తారు. ఇప్పుడీ సూపర్‌స్టార్ చేతిలో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. అందులో ఆసియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ‘2.0’ (‘రోబో’ సీక్వెల్) ఒకటి. రెండోది ‘కబాలి’ సీక్వెల్. సాధారణంగా ఓ సిన్మా హిట్టయితే సీక్వెల్ చేస్తారు. కానీ, ‘కబాలి’ సోసోగా ఆడినప్పటికీ... అందులో రజనీ గెటప్, వచ్చిన వసూళ్ల దృష్ట్యా ఆ చిత్రనిర్మాత కలైపులి ఎస్.థాను సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. దటీజ్ తలైవా! ‘కబాలి–2’ పేరుతో ఆయనో టైటిల్ రిజిస్టర్ చేయించారు కూడా.
ఈ సీక్వెల్‌కి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది సస్పెన్సే. ఎందుకంటే.. ‘కబాలి’ తెరకెక్కించిన దర్శకుడు పా. రంజిత్ ఇప్పుడు రజనీ హీరోగా గ్యాంగ్‌స్టర్ కథతో ఓ సినిమా మొదలుపెట్టారు. మరి, ‘కబాలి–2’కి ఆయనే దర్శకత్వం వహిస్తారా? మరో దర్శకుడు సీన్లోకి వస్తారా? అనేది చూడాలి. ‘2.0’ గానీ, ‘కబాలి–2’ గానీ... రజనీ లేకుండా ఊహించుకోవడం కష్టం. ఆయన ‘ఓకే’ చేయబట్టే ఆ సీక్వెల్స్‌కి అంత క్రేజ్ వచ్చింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘2.0’ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రఘువరన్ ఈజ్ బ్యాక్!
ఉద్యోగం సజ్జోగం లేని ఓ బీటెక్ కుర్రాడు పక్కింట్లోకి కొత్తగా వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఓ వైపు ప్రేమ.. మరోవైపు ఉద్యోగం చేస్తున్న తమ్ముణ్ణి చూపిస్తూ, తండ్రి పెట్టే చీవాట్లు! ‘రఘువరన్ బీటెక్’లో ధనుష్ పాత్రలో పలువురు యువకులు తమను తాము చూసుకున్నారు. అంతేనా? జీరో నుంచి హీరోగా ఎదిగిన రఘువరన్ కథలో హీరోయిజంతో పాటు తల్లి సెంటిమెంట్, మంచి ప్రేమకథ కూడా ఉన్నాయి. ఈ తమిళ డబ్బింగ్‌ని మన ప్రేక్షకులూ బాగా ఆదరించడంతో తెలుగులో ధనుష్‌కి మంచి మార్కెట్ వచ్చింది. దాంతో సీక్వెల్ ‘వీఐపీ–2’ని తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నారు.
రఘువరన్ ఈజ్ బ్యాక్... అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా కోసం ధనుష్ కలం పట్టారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వ బాధ్యతలను మరదలు సౌందర్యా రజనీకాంత్ చేతిలో పెట్టారు. బావామరదళ్లు కలసి చేస్తున్న సినిమా కావడం ‘వీఐపీ–2’కి ఓ ప్రత్యేకత అయితే.. ఈ సినిమాతో సుమారు ఇరవైయేళ్ల తర్వాత ప్రముఖ హిందీ నటి కాజోల్ సౌత్ ఇండస్ట్రీలోకి రీ–ఎంట్రీ ఇస్తుండడం మరో ప్రత్యేకత.
హిందీలోనూ వా2
హిందీలోనూ ఈ ఏడాది డిఫరెంట్ జానర్లలో సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. అందులో ముఖ్యమైనది బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ‘సర్కార్–3’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘సర్కార్’ సిరీస్‌లో మూడోది. మార్చిలో ‘సర్కార్–3’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ‘ఏక్ థా టైగర్’కి సీక్వెల్‌గా ‘టైగర్ జిందా హై’ చేస్తున్నారు. ఈ యాక్షన్ సిన్మాకి గతేడాది ‘సుల్తాన్’తో సల్మాన్‌కి మంచి సక్సెస్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. క్రిస్మస్కి ఈ సినిమా విడుదల కానుంది. రజనీకాంత్ ‘2.0’లో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్, హిందీలో హీరోగా ‘జాలీ ఎల్ఎల్బి–2’ చేశారు.
ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలవుతుంది. యాక్షన్ కామెడీ ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో నాలుగో సిన్మా ‘గోల్మాల్–4’ కూడా ఈ ఏడాదే మొదలుకానుంది. హీరో అజయ్ దేవగన్, దర్శకుడు రోహిత్‌శెట్టి కాంబినేషన్లో రూపొందుతోన్న 9వ చిత్రమిది. హిందీలో స్టార్ హీరోలు ఒక్కో సీక్వెల్ చేస్తుంటే యంగ్ హీరో వరుణ్‌ధావన్ రెండు చేస్తున్నాడు. అందులో రొమాంటిక్ ఫిల్మ్ ‘హంప్టీ శర్మకి దుల్హనియా’ సీక్వెల్ ‘బధ్రినాథ్కి దుల్హనియా’ ఒకటి. రెండోది మన ‘హలో బ్రదర్’కి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ‘జుడ్వా’కి సీక్వెల్ ‘జుడ్వా–2’. వీళ్లందరూ సీక్వెల్స్ చేస్తుంటే.. సొట్టబుగ్గల తాప్సీ ‘బేబి’కి ప్రీక్వెల్ ‘నామ్ షబానా’తో రెడీ అవుతున్నారు.
– సత్య పులగం