జగన్‌కు మరో 2రోజులు చికిత్స అవసరమన్న వైద్యులు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి మరో రెండు రోజులు చికిత్స అవసరమని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయన బాగా నీరసంగా ఉన్నట్లు వారు చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయానికి నిరసన తెలుపుతూ, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో జగన్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏడు రోజులు దీక్ష చేసిన తరువాత కోర్టు ఆదేశాలతో వైద్యులు శనివారం ఆయన దీక్షను భగ్నం చేశారు. ఆ రోజు నుంచి నిమ్స్‌లోనే ఆయనకు చికిత్స చేస్తున్నారు.
ఏడు రోజులపాటు ఎటువంటి ఆహారం తీసుకోనందున ఆయన ఇంకా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని వారు చెప్పారు.
జగన్ శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు ఉదయం నిమ్స్ వైద్యులు తెలిపారు. షుగర్, బీపీ, కీటోన్స్ సాధారణ స్థాయికి చేరుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఏడు రోజులుగా దీక్ష చేయడంవల్ల శరీరంలో ఉన్న కొవ్వులు పూర్తిగా కరిగిపోయాయని, ఈ కారణంగానే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
జగన్ ఇప్పటికీ నీరసంగానే ఉన్నారని, సాధారణ స్థితికి చేరుకోవాలంటే బలమైన ఆహారం తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఆరోగ్యం మందకొడిగా ఉన్నందున జగన్ పూర్తిగా కోలుకోవటానికి కొన్నిరోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. నిమ్స్ వైద్య బృందంలో ప్రముఖులైన డాక్టర్ శేషగిరిరావు (కార్డియాలజీ), డాక్టర్ శ్రీభూషణ్‌రాజు (నెఫ్రాలజీ), డాక్టర్ వైఎస్ఎన్ రాజు (జనరల్ మెడిసిన్)లు ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.