వరంగల్లో చేనేత పార్కు నిర్మించాలి
* కేంద్రాన్ని కోరిన టీడీపీ ఎంపీ గుండు సుధారాణి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వరంగల్లో చేనేత పార్కు నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని టీడీపీ ఎంపీ గుండు సుధారాణి కేంద్రాన్ని కోరారు. చేనేత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్లో చేనేత పార్కు నిర్మాణానికి నాటి టీడీపీ ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసిందని, కానీ కేంద్రం ఇంత వరకు చేనేత పార్కు నిర్మించడానికి ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు.
చేనేత పార్కు నిర్మించడం ద్వారా సుమారు ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. యూపీఏ పాలనలో మరమ్మతు, ఆధునీకరణ, పునరుద్ధరణ(ఆర్ఆర్ఆర్) పథకంలో నిధులు కేటాయించగా అవి కూడా బ్యాంకులో మురిగిపోయాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం చేనేత పార్కుకు చొరవ చూపి ఉపాధి కల్పించాలని విన్నవించారు.