Web options process
-
వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్వర్డ్
-
వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్వర్డ్
* 8వ తేదీ నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు! * నేటి సాయంత్రానికి కాలేజీల జాబితా ఇస్తేనే సాధ్యం * లేదంటే వెబ్ ఆప్షన్లలో ఆలస్యం తప్పదు * కోర్టు తీర్పు వచ్చాకే ఇస్తామంటున్న జేఎన్టీయూహెచ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. వెబ్సైట్లో విద్యార్థులు తమ వివరాలను ఇవ్వగానే వారి మొబైల్ నంబర్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వచ్చేలా, దానితో లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టింది. ఈ వన్‌టైమ్ పాస్వర్డ్ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకోవాలంటే మళ్లీ వన్‌టైమ్ పాస్వర్డ్ పొందాల్సి ఉంటుంది. 8 నుంచి మొదలయ్యేనా? ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను బుధవారం (ఈనెల 8వ తేదీ) నుంచి చేపట్టాలని ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ ఇప్పటికే నిర్ణయించింది. కానీ హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇంకా ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి అందలేదు. అనుబంధ గుర్తింపు నిరాకరణ, కోర్సుల కోతపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించడంతో... కోర్టు తీర్పు వచ్చాకే కాలే జీల జాబితాలు, సీట్ల వివరాలు ఇస్తామని జేఎన్టీయూహెచ్ చెబుతోంది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే కోర్టు తీర్పు వస్తుందని... 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలని తొలుత ప్రవేశాల కమిటీ భావించింది. అలా జరగలేదు. తర్వాత సోమవారం కోర్టు తీర్పు వస్తుందని భావించి.. 8 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ కోర్టు తీర్పు మంగళవారం (7వ తేదీ) సాయంత్రానికి వాయిదా పడింది. అయితే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జేఎన్టీయూహెచ్ కాలేజీల జాబితాను తమకు అందజేస్తే 8వ తేదీ నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టవచ్చని ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. జాప్యం జరిగితే మాత్రం 9వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇదీ వన్‌టైమ్ పాస్వర్డ్ విధానం వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి. ఇందుకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను ఉపయోగించడం మంచిది. తొలుత జ్ట్టిఞట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్‌ను ఓపెన్ చేయాలి. అందులో విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్‌టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి పాస్వర్డ్ జనరేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో పైబాక్సులో ఒక పాస్‌వర్డ్‌ను (అది 8 నుంచి 10 లెటర్లు ఉండాలి. అది క్యాపిటల్ లెటర్, నంబరు, సింబల్, అక్షరాలతో కూడినదై ఉండాలి) ఎంటర్ చేయాలి. రెండో బాక్సులో మరోసారి దాన్నే ఎంటర్ చేయాలి. మూడో బాక్సులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌ను ఇచ్చి, సేవ్ పాస్‌వర్డ్‌ను నొక్కాలి. దాంతో మొబైల్ నంబర్‌కు రహస్య లాగిన్ ఐడీ వస్తుంది. తర్వాత హోంపేజీలో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్లి ఈ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ కావాలి. అక్కడ వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) బటన్‌ను నొక్కితే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఓటీపీ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. ఇచ్చిన వెబ్ ఆప్షన్లు ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. మళ్లీ ఆప్షన్లను మార్పు చేసుకోవాలన్నా, మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నా మళ్లీ ఓటీపీని తీసుకుని ఎంటర్ చేయాలి. అఫిలియేషన్లపై నేడు ఉత్తర్వులు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించడం, సీట్ల కోతను సవాలు చేస్తూ పలు కాలేజీల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయాన్ని హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేస్తానని న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల మేర బోధనా సిబ్బంది, సౌకర్యాలు లేవనే కారణంతో పలు కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతోపాటు పలు కాలేజీల్లో సీట్లకు కోత వేసింది కూడా. దీనిని సవాలు చేస్తూ పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై కాలేజీల యాజమాన్యాల తరఫు న్యాయవాదులతో పాటు, జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. -
ఇంజనీరింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఈనెల 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన * కాలేజీలు, సీట్ల వివరాలు తేలాకే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) ప్రవేశాల కమిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు కమిటీ పేర్కొంది. ప్రతి రోజు రెండు దశలుగా వెరిఫికేషన్‌ను చేపట్టనుంది. ఉదయం 9కి మొదటి పరిశీలన ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12:30కి రెండో దశ పరిశీలన చేపడతారు. ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టే హెల్ప్‌లైన్ కేంద్రాలు, ఇతర వివరాలను వెబ్సైట్లో (జ్ట్టిఞట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ) పొందవచ్చని పేర్కొంది. కాలేజీలకు గుర్తింపు ప్రక్రియపై శుక్రవారం హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ ప్రవేశాల కమిటీ అధికారులు సమావేశమై చర్చించారు. తర్వాత నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కాలేజీల యాజమాన్యాలకు ఈనెల 27 వరకు గడువు ఇచ్చినందున, కాలేజీలు, సీట్ల వివరాలు ఆ తరువాతే తేలనున్నాయి. అవి వచ్చాకే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. విద్యార్థులకు సూచనలు.. వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలి. అలాగే ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, పదో తరగతి మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, జనవరి 1వ తేదీ తరువాత జారీచేసిన ఆదాయం ధ్రువీకరణ పత్రం తదితర సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీలు, సీట్లు, కాలేజీ వారీగా ఫీజుల వివరాలను వెబ్ ఆప్షన్ల ప్రారంభానికి ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వికలాంగులు, ఎన్సీసీ కోటా, ఆంగ్లోఇండియన్, స్పోర్ట్ కోటా విద్యార్థులకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా నిర్ణీత హెల్ప్‌లైన్ కేంద్రంలో వెరిఫికేషన్ ఉంటుంది.