‘ప్రాదేశిక’ తొలిపోరు నేడే
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీల తొలివిడత ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనుండగా... తొలివిడతగా ఆదివారంనాడు కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు,357 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ స్థానాల్లో 114 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 1450 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో 8,30,868 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 4,10, 801 మంది పురుషులు, 4,20,067మంది మహిళలు ఉన్నారు. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 1051 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో భద్రాచలం డివిజన్లో 275, పాల్వంచ డివిజన్లో 311, కొత్తగూడెం డివిజన్లో 465 కేంద్రాలు ఉన్నాయి. 5,780 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. తొలివిడతకు 133 రూట్లను ఏర్పాటు చేశారు. సిబ్బందిని, మెటీరియల్ తరలించేందుకు 128 బస్సులు, 166 కార్లు, జీపులు సిద్ధం చేశారు. 83 మంది జోనల్ ఆఫీసర్లు, 120మంది రూట్ ఆఫీసర్లు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 289 అతి సమస్యాత్మక, 306 సమస్యాత్మక, 223 తీవ్రవాద ప్రభావిత పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 88 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ కోసం 60మంది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఏర్పాటు చేశారు. 672 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని 351 మంది వీడియోగ్రాఫర్లు చిత్రీకరించనున్నారు. 46 మంది ఆర్వోలు, 92 మంది ఏఆర్వోలను నియమించారు.
సీమాంధ్రలో తమ ప్రాంతాలను కలపవద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని రెండు జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు.
వెబ్‌కాస్టింగ్ కేంద్రాలు ఇవే...
సమస్యాత్మక కేంద్రాలు ఉన్న మొత్తం ఎనిమిది మండలాల్లో ఎన్నికల సరళిని అధికారులు వీక్షించేందుకు వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. కొత్తగూడెం మండలంలో 13, చండ్రుగొండలో 6, ఏన్కూరులో 3, గార్లలో 4, కామేపల్లిలో 10, సింగరేణిలో 12, అశ్వారావుపేటలో 4, పినపాకలో 8 వెబ్‌కాస్టింగ్‌లను ఏర్పాటుచేశారు.