Webland Online
-
‘పచ్చ’పాపం.. రైతు శోకం
► చాలవేముల రెవెన్యూ పరిధిలోని 512 సర్వేనంబర్‌లో 3.90 ఎకరాలు భూమి ఉంది. కానీ ఆన్లైన్లో అదనంగా 6.28 ఎకరాలు పెంచి దాన్ని ఇతరుల పేరుతో నమోదు చేశారు. దీనిపై బాధిత రైతు గత నెలలో ‘స్పందన’లో ఫిర్యాదు చేయగా, నోటీసులు జారీ చేసి తొలగించారు. ► మడుగుపల్లి రెవిన్యూ పరిధిలోని 372 సర్వేనంబర్‌లో డైగ్లాట్ ప్రకారం 56.65 ఎకరాలుండగా.. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ ఆ భూమిని 145 ఎకరాలకు పెంచి వెబ్‌ల్యాండ్‌లో 25 మంది పేర్లతో నమోదు చేశారు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో రె?వెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి పేర్లను తొలగించడానికి ఆర్డీఓ అనుమతికి పంపించారు. టీడీపీ హయాంలో ఇలాంటి అక్రమాలెన్నో జరిగాయి. సాక్షి, పుట్లూరు: టీడీపీ హయాంలో నేతల అండతో అధికారులు కనికట్టు చేశారు. లేనిది ఉన్నట్లు...ఉన్నది లేనట్లు చూపారు. ఈ క్రమంలో లేని భూమిని ఉన్నట్లు ఆన్లైన్ నమోదు చేశారు. ఫలితంగా ఆ సర్వేనంబర్‌లో భూములున్న రైతులు నేటికీ సమస్య పరిష్కారంకాక అల్లాడిపోతున్నారు. ఇలా ఆన్లైన్ భూమాయలో పుట్లూరు మండలం మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. 12 వేల ఎకరాలు ఎక్కువ డైగ్లాట్ ప్రకారం పుట్లూరు మండలంలోని భూ విస్తీర్ణం కంటే వెబ్‌ల్యాండ్‌లో 12 వేల ఎకరాలకు పైగా ఎక్కువగా నమోదు చేశారు. ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుని కొందరు అధికారులు వందల సంఖ్యలో ఖాతాలను సృష్టించి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇలా నమోదు చేసిన భూములక ‘మీ–సేవ’ సెంటర్ల ద్వారా ఈ పాస్ పుస్తకాలను సృష్టించారు. ఇలా ఈపాస్ బుక్కు పొందిన వారు సాగులో లేకపోయినా అన్ని రకాల రాయితీలు, బ్యాంకు రుణాలను దర్జాగా పొందుతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ‘రైతు భరోసా’ కూడా చాలా మంది దక్కించుకోవడం గమనార్హం. ఈ భూమాయ వెనుక మండలంలోని టీడీపీ నాయకులే ఉన్నారన్నది బహిరంగ రహస్యం. విచారణకు డిమాండ్ మండలంలో జరిగిన ఆన్లైన్ భూమాయపై విచారణ జరిపించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయానికి పెద్ద ఎత్తున అర్జీలు అందుతున్నాయి. గరుగుచింతలపల్లి, మడుగుపల్లి, పుట్లూరు, కడవకల్లు, చాలవేముల, కుమ్మనమల, చెర్లోపల్లి, దోశలేడు, అరకటివేముల, చిన్నమల్లేపల్లి రెవెన్యూ గ్రామాల్లో గత ఐదేళ్లలో జరిగిన భూ పంపకాలపై విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రారంభం కాని భూరికార్డుల స్వచ్ఛీకరణ మండలంలో గత నెల నుంచే భూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నా... అధికారులు ఆ దిశగా అడుగులు వేయలేదు. మండలానికో పైలెట్ గ్రామం ప్రకారం చిన్నమల్లేపల్లి గ్రామాన్ని ఎంపిక చేసినా.. అక్కడ గ్రామ సభ కూడా నిర్వహించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేదలకు అందాల్సిన భూమిని గత ప్రభుత్వంలో భూస్వాములకు కేటాయించిన విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని భూమి లేని నిరుపేదలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణతో అక్రమ భూ కేటాయింపుల వ్యవహారం తప్పకుండా తేలుతుంది. బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణ, లబ్ధిదారుల ఎంపిక పనుల వల్ల రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైంది. ‘స్పందన’లో అందిన ఫిర్యాదులుపై తగిన చర్యలు తీసుకుంటున్నాం. జంగంరెడ్డిపేట 372 సర్వేనంబర్‌లో 25 మందికి నోటీసులు ఇచ్చినా..వారు స్పందించకపోవడంతో వారి పేరుపై ఉన్న భూమిని వెబ్‌ల్యాండ్‌లో తొలగించేందకు అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరాం. – విజయకుమారి, తహసీల్దార్, పుట్లూరు -
సంక్షేమానికి ఆన్లైన్ తంటా
సాంకేతికత, ఆధునికత జోడించి అన్నదాతలకు మెరుగైన సేవలందించాలనే సంకల్పంతో వెబ్‌ల్యాండ్ ప్రక్రియ రూపొందింది. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు నమోదు చేయడంతో అభాసుపాలైంది. ఆ పాపాలు ఇప్పటికీ తీరని కష్టాలను మిగిల్చాయి. రైతుకు వాస్తవంగా ఉన్న భూములకన్నా ఎక్కువ విస్తీర్ణం వెబ్‌ల్యాండ్‌లో నమోదై ఉండడంతో కష్టాలు మరింతగా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు అర్హులు కూడా దూరమతున్నారు. సామాజిక పింఛను పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు వెబ్‌ల్యాండ్ పాపాలతో అనర్హులకు కూడా రైతు భరోసా వర్తించే పరిస్థితి నెలకొంది. సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు, సామాజిక పింఛనుదారులకు ప్రాముఖ్యతనిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి పలు సంక్షేమ పథకాలు రూపకల్పన చేశారు. ఏటా పంటల సాగుకు పెట్టుబడిగా ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున అందించనున్నారు. సామాజిక పింఛనుకు వృద్ధాప్య వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి మరింత మందిని ఈ పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే పథకాల ఫలాలు పొందాలంటే వెబ్‌ల్యాండ్‌లో ని తప్పుల తడక కారణంగా రైతు భరోసాకు అనర్హుడు కూడా అర్హుడుగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుండగా 60 ఏళ్లు నిండిన వారు వృద్ధాప్యపు పింఛనుకు అర్హతను కోల్పోతున్నారు. అనర్హులకూ లబ్ధి జిల్లాలో మొత్తం 6.48లక్షల మంది రైతులు ఉండగా, రైతు కుటుంబాలు దాదాపు 3.80 లక్షల మేరకు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా భూ విస్తీర్ణంలో మొత్తం 5.40లక్షల మేరకు సర్వే నంబర్లు ఉండగా, వాటిలో సబ్ డివిజన్లు దాదాపు 7.20 లక్షల మేరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములకు సంబంధించి 4.30 లక్షల మేరకు రైతులు పట్టాదారు పాసుపుస్తకా లు కలిగి ఉన్నారు. వెబ్‌ల్యాండ్‌లో 1బీ మాత్రం మొత్తం 5.48 లక్షలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం భూములకు సంబంధించి రిజిస్టర్ డాక్యుమెంట్ల అవసరం లేకుండానే వెబ్‌ల్యాండ్‌లోని 1బి ఆధారంగా ఏకంగా క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకుని అధికార పార్టీ అండతో టీడీపీకి చెందిన కిందిస్థాయి కార్యకర్త నుంచి, నాయకులు, ప్రజాప్రతినిధుల వరకు వెబ్‌ల్యాండ్‌లో తప్పుడు సర్వే నంబర్లతో 1బిలను సృష్టించుకున్నారు. వీటి ఆధారంగా సెటిల్మెంటు భూములను కూడా వాటి యజమానులతో పనిలేకుండానే ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. దీనిపై భూ యజమానులు ప్రశ్నిస్తే అక్రమదారులు ఏకంగా 1బి మేరకు అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి, ఏకంగా కోర్టులను ఆశ్రయించారు. దీంతో అసలైన భూ యజమానులకు పక్కాగా రికార్డులు ఉన్నా కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిణామాల కారణంగా రైతు భరోసాకు అనర్హులు కూడా 1బి ఆధారంతో లబ్ధిదారులుగా మారే పరిస్థితి ఏర్పడింది. సామాజిక పింఛన్లకు జిల్లాలో మొత్తం 4,64,969 మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. అందులో వృద్ధులు 2,08,475 మంది ఉన్నారు. వారిలో కనీస వయస్సు 65 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛనుకు కనీస వయస్సు 60 ఏళ్లకు తగ్గించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు దాదాపు 40 వేల మంది మేరకు ఉన్నట్లు అధికారుల అంచనా. అయితే అందులో ఇప్పటివరకు 25 వేల మంది మాత్రమే ఇప్పటికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికంతటికి వ్యవసాయ భూములు ఉన్న రైతులకే దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు కూడా 5 ఎకరాలకు పైబడి భూములు ఉన్నట్లు వెబ్‌ల్యాండ్ 1బి లో చూపెడుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు సన్న, చిన్నకారు రైతులు మాత్రమే సామాజిక పింఛనుకు అర్హులు అవుతారు. దీంతో అర్హులైన రైతులు కూడా సామాజిక పింఛనుకు దరఖాస్తు చేసుకుంటే వెబ్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న తప్పుల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వెబ్‌ల్యాండ్‌ను ప్రక్షాళన చేయాలి వెబ్‌ల్యాండ్‌లో ఉన్న తప్పులను వెంటనే ప్రక్షాళన చేయాలి. నా పేరుపై ఖాతా నంబరు 65లో 2.49 ఎకరాల భూమి ఉంది. అయితే 1బిలో మాత్రం ఇతరుల సర్వే నంబర్లు కూడా నమోదై 16 ఎకరాలు ఉన్నట్లు చూపెడుతోంది. దీనికారణంగా 63 ఏళ్ల వయస్సు ఉన్నా పింఛనుకు దరఖాస్తు చేసుకోడానికి వీలవడం లేదు. – కేశవులు రెడ్డి, పాపిరెడ్డిపల్లె, పెనుమూరు మండలం -
తప్పులు..తిప్పలు
►చిన్న పొరపాటు... రైతులకు గ్రహపాటు ►వెబ్‌ల్యాండ్ ఆన్లైన్లో కనిపించని పహణీలు ►కదలని రెవెన్యూశాఖ ►అవస్థలు పడుతున్న అన్నదాత కోరుట్ల: రెవెన్యూ రికార్డుల్లో ఉన్న చిన్నచిన్న పొరపాట్లతో రైతులు అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి తప్పులను సరిదిద్దాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) నుంచి ఏటా ఉత్తర్వులు వస్తున్నా.. కిందిస్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడడంలేదు. ఫలితంగా పహణీలో ఉన్న చిన్నపాటి తప్పులకు రైతులు నష్టపోతున్నారు. ఈ పొరపాట్లతో ఆన్లైన్లో పహణీలు రాక రుణాలు తీసుకోవడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. భూక్రయవిక్రయాల సమయంలోనూ అవస్థలు తప్పడంలేదు. లెక్కలోని రానివే... రికార్డులను కంప్యూటరీకరించే క్రమంలో రెవెన్యూ సిబ్బంది చిన్నచిన్న పొరపాట్లకు తావిచ్చింది. వివరాలను కంప్యూటర్లో ఎంట్రీ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు ఉన్నా ఆన్లైన్లో పహణీలు కనిపించవు. సాధారణంగా సర్వే నంబర్ల నమోదు చేసే సమయంలో పుల్‌స్టాప్, కామా, ఆబ్లిక్, హైపన్ వంటి అక్షరాలతోపాటు సర్వే నంబర్లలోని విభాగాలను తెలిపే అంకెలు పొరపాటుగా పడినా భూములకు చెందిన పహణీలు ఆన్లైన్లో కనిపించవు. ఇలాంటి పొరపాట్లను సీసీఎల్ఏ అధికారులు ‘స్పెషల్ కారెక్టర్స్’గా గుర్తించి వీటిని సరిదిద్ది రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏటా కిందిస్థాయి అధికారులకు వివరాలు పంపుతోంది. వీటిలో పొరపాటుగా నమోదైన సర్వే నంబర్లు, పట్టా.. కబ్జాకాలమ్లోని పేర్లలో అక్షరాల తలకట్టు, దీర్ఘాలు వంటి చిన్నతప్పులకు చెందిన వివరాలను పంపి రికార్డులను సరిదిద్దాలని కోరుతోంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది మాత్రం ఇతర పనుల హడావుడిలో పడి ఈ దిద్దుబాటు చర్యలను పక్కనబెడుతోంది. రైతులకు అగచాట్లు.. చిన్నపాటి పొరపాట్లతో రైతులు ఆన్లైన్లో పహణీలు కనిపించక అవస్థలు పడుతున్నారు. పంటల సాగుసీజన్లో పహణీ, 1బీ రికార్డు పత్రాలు తప్పనిసరి. వీటికోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్ పహణీ కాపీలు పొందడానికి యత్నిస్తున్న సమయంలో ఆన్లైన్ పత్రాలు రాక నిరాశకు గురవుతున్నారు. పొరపాట్లు సరిదిద్దాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఫలితంగా రైతులు రుణాలు తీసుకోలేక పంటల సాగు కోసం అప్పుల పాలవుతున్నారు. కొన్నిచోట్ల వీఆర్వోలు, తహసీల్దార్లు ఈ చిన్నపాటి పొరపాట్లను సైతం తమకు అనుకూలంగా మార్చుకుని కాసుల సంపాదనకు బాటలు వేసుకుంటున్నారు. గత్యంతరం లేని రైతులు రెవెన్యూ సిబ్బంది..అధికారులు అడిగినంత ఇచ్చుకుని రికార్డులు సరిచేయించుకుంటున్నారు.