‘పచ్చ’పాపం.. రైతు శోకం  | In Putlur Revenue Range Official Irregularities During The TDP Period | Sakshi
Sakshi News home page

‘పచ్చ’పాపం.. రైతు శోకం 

Published Wed, Oct 23 2019 8:14 AM | Last Updated on Wed, Oct 23 2019 8:14 AM

In Putlur Revenue Range Official Irregularities During The TDP Period - Sakshi

పుట్లూరు తహశీల్దార్‌ కార్యాలయం

చాలవేముల రెవెన్యూ పరిధిలోని 512 సర్వేనంబర్‌లో 3.90 ఎకరాలు భూమి ఉంది. కానీ ఆన్‌లైన్‌లో అదనంగా 6.28 ఎకరాలు పెంచి దాన్ని ఇతరుల పేరుతో నమోదు చేశారు. దీనిపై బాధిత రైతు గత నెలలో ‘స్పందన’లో ఫిర్యాదు చేయగా, నోటీసులు జారీ చేసి తొలగించారు.  

మడుగుపల్లి రెవిన్యూ పరిధిలోని 372 సర్వేనంబర్‌లో డైగ్లాట్‌ ప్రకారం 56.65 ఎకరాలుండగా.. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్‌ ఆ భూమిని 145 ఎకరాలకు పెంచి వెబ్‌ల్యాండ్‌లో 25 మంది పేర్లతో నమోదు చేశారు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో రె?వెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి పేర్లను తొలగించడానికి ఆర్డీఓ అనుమతికి పంపించారు. టీడీపీ హయాంలో ఇలాంటి అక్రమాలెన్నో జరిగాయి. 

సాక్షి, పుట్లూరు: టీడీపీ హయాంలో నేతల అండతో అధికారులు కనికట్టు చేశారు. లేనిది ఉన్నట్లు...ఉన్నది లేనట్లు చూపారు. ఈ క్రమంలో లేని భూమిని ఉన్నట్లు ఆన్‌లైన్‌ నమోదు చేశారు. ఫలితంగా ఆ సర్వేనంబర్‌లో భూములున్న రైతులు నేటికీ సమస్య పరిష్కారంకాక అల్లాడిపోతున్నారు. ఇలా ఆన్‌లైన్‌ భూమాయలో పుట్లూరు మండలం మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.  

12 వేల ఎకరాలు ఎక్కువ 
డైగ్లాట్‌ ప్రకారం పుట్లూరు మండలంలోని భూ విస్తీర్ణం కంటే వెబ్‌ల్యాండ్‌లో 12 వేల ఎకరాలకు పైగా ఎక్కువగా నమోదు చేశారు. ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుని కొందరు అధికారులు వందల సంఖ్యలో ఖాతాలను సృష్టించి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇలా నమోదు చేసిన భూములక ‘మీ–సేవ’ సెంటర్ల ద్వారా ఈ పాస్‌ పుస్తకాలను సృష్టించారు. ఇలా ఈపాస్‌ బుక్కు పొందిన వారు సాగులో లేకపోయినా అన్ని రకాల రాయితీలు, బ్యాంకు రుణాలను దర్జాగా పొందుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ‘రైతు భరోసా’ కూడా చాలా మంది దక్కించుకోవడం గమనార్హం. ఈ భూమాయ వెనుక మండలంలోని టీడీపీ నాయకులే ఉన్నారన్నది బహిరంగ రహస్యం.   

విచారణకు డిమాండ్‌ 
మండలంలో జరిగిన ఆన్‌లైన్‌ భూమాయపై విచారణ జరిపించాలని కోరుతూ తహసీల్దార్‌ కార్యాలయానికి పెద్ద ఎత్తున అర్జీలు అందుతున్నాయి. గరుగుచింతలపల్లి, మడుగుపల్లి, పుట్లూరు, కడవకల్లు, చాలవేముల, కుమ్మనమల, చెర్లోపల్లి, దోశలేడు, అరకటివేముల, చిన్నమల్లేపల్లి రెవెన్యూ గ్రామాల్లో గత ఐదేళ్లలో జరిగిన భూ పంపకాలపై విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.  
ప్రారంభం కాని భూరికార్డుల స్వచ్ఛీకరణ 
మండలంలో గత నెల నుంచే భూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నా... అధికారులు ఆ దిశగా అడుగులు వేయలేదు.
మండలానికో పైలెట్‌ గ్రామం 
ప్రకారం చిన్నమల్లేపల్లి గ్రామాన్ని ఎంపిక చేసినా.. అక్కడ గ్రామ సభ కూడా నిర్వహించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేదలకు అందాల్సిన భూమిని గత ప్రభుత్వంలో భూస్వాములకు కేటాయించిన విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని భూమి లేని నిరుపేదలు కోరుతున్నారు.   

చర్యలు తీసుకుంటాం 
రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణతో అక్రమ భూ కేటాయింపుల వ్యవహారం తప్పకుండా తేలుతుంది. బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణ, లబ్ధిదారుల ఎంపిక పనుల వల్ల రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైంది. ‘స్పందన’లో అందిన ఫిర్యాదులుపై తగిన చర్యలు తీసుకుంటున్నాం. జంగంరెడ్డిపేట 372 సర్వేనంబర్‌లో 25 మందికి నోటీసులు ఇచ్చినా..వారు స్పందించకపోవడంతో వారి పేరుపై ఉన్న భూమిని వెబ్‌ల్యాండ్‌లో తొలగించేందకు అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరాం.  
– విజయకుమారి, తహసీల్దార్, పుట్లూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement