సంక్షేమానికి ఆన్‌లైన్‌ తంటా   | Webland Give Problems To The Farmers In Chittoor | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి ఆన్‌లైన్‌ తంటా  

Published Sat, Aug 17 2019 10:22 AM | Last Updated on Sat, Aug 17 2019 10:23 AM

Webland Give Problems To The Farmers In Chittoor - Sakshi

సాంకేతికత, ఆధునికత జోడించి అన్నదాతలకు మెరుగైన సేవలందించాలనే సంకల్పంతో వెబ్‌ల్యాండ్‌ ప్రక్రియ రూపొందింది. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు నమోదు చేయడంతో అభాసుపాలైంది. ఆ పాపాలు ఇప్పటికీ తీరని కష్టాలను మిగిల్చాయి.  రైతుకు వాస్తవంగా ఉన్న భూములకన్నా ఎక్కువ విస్తీర్ణం వెబ్‌ల్యాండ్‌లో నమోదై ఉండడంతో కష్టాలు మరింతగా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు అర్హులు కూడా దూరమతున్నారు. సామాజిక పింఛను పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు వెబ్‌ల్యాండ్‌ పాపాలతో అనర్హులకు కూడా రైతు భరోసా వర్తించే పరిస్థితి నెలకొంది.

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు, సామాజిక పింఛనుదారులకు ప్రాముఖ్యతనిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి పలు సంక్షేమ పథకాలు రూపకల్పన చేశారు. ఏటా పంటల సాగుకు పెట్టుబడిగా ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున అందించనున్నారు. సామాజిక పింఛనుకు వృద్ధాప్య వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి మరింత మందిని ఈ పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే పథకాల ఫలాలు పొందాలంటే వెబ్‌ల్యాండ్‌లో ని తప్పుల తడక కారణంగా రైతు భరోసాకు అనర్హుడు కూడా అర్హుడుగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుండగా  60 ఏళ్లు నిండిన వారు  వృద్ధాప్యపు పింఛనుకు అర్హతను కోల్పోతున్నారు. 
అనర్హులకూ లబ్ధి
జిల్లాలో మొత్తం 6.48లక్షల మంది రైతులు ఉండగా, రైతు కుటుంబాలు దాదాపు 3.80 లక్షల మేరకు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా భూ విస్తీర్ణంలో మొత్తం 5.40లక్షల మేరకు సర్వే నంబర్లు ఉండగా, వాటిలో సబ్‌ డివిజన్లు దాదాపు 7.20 లక్షల మేరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములకు సంబంధించి 4.30 లక్షల మేరకు రైతులు పట్టాదారు పాసుపుస్తకా లు కలిగి ఉన్నారు. వెబ్‌ల్యాండ్‌లో 1బీ మాత్రం మొత్తం 5.48 లక్షలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం భూములకు సంబంధించి రిజిస్టర్‌ డాక్యుమెంట్ల అవసరం లేకుండానే వెబ్‌ల్యాండ్‌లోని 1బి ఆధారంగా ఏకంగా క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది.

దీన్ని  ఆసరాగా తీసుకుని అధికార పార్టీ అండతో టీడీపీకి చెందిన కిందిస్థాయి కార్యకర్త నుంచి, నాయకులు, ప్రజాప్రతినిధుల వరకు వెబ్‌ల్యాండ్‌లో తప్పుడు సర్వే నంబర్లతో 1బిలను సృష్టించుకున్నారు. వీటి ఆధారంగా సెటిల్‌మెంటు భూములను కూడా వాటి యజమానులతో పనిలేకుండానే ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. దీనిపై భూ యజమానులు ప్రశ్నిస్తే అక్రమదారులు ఏకంగా 1బి మేరకు అన్‌రిజిస్టర్‌ డాక్యుమెంట్లు సృష్టించి, ఏకంగా కోర్టులను ఆశ్రయించారు. దీంతో అసలైన భూ యజమానులకు పక్కాగా రికార్డులు ఉన్నా కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిణామాల కారణంగా రైతు భరోసాకు అనర్హులు కూడా 1బి ఆధారంతో లబ్ధిదారులుగా మారే పరిస్థితి ఏర్పడింది. 

సామాజిక పింఛన్లకు
జిల్లాలో మొత్తం 4,64,969 మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. అందులో వృద్ధులు 2,08,475 మంది ఉన్నారు. వారిలో  కనీస వయస్సు 65 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛనుకు కనీస వయస్సు 60 ఏళ్లకు తగ్గించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు దాదాపు 40 వేల మంది మేరకు ఉన్నట్లు అధికారుల అంచనా. అయితే అందులో ఇప్పటివరకు 25 వేల మంది మాత్రమే ఇప్పటికి దరఖాస్తు చేసుకున్నారు.

దీనికంతటికి వ్యవసాయ భూములు ఉన్న రైతులకే దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు కూడా 5 ఎకరాలకు పైబడి భూములు ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌ 1బి లో చూపెడుతోంది.  ప్రభుత్వ నిబంధనల మేరకు సన్న, చిన్నకారు రైతులు మాత్రమే సామాజిక పింఛనుకు అర్హులు అవుతారు. దీంతో అర్హులైన రైతులు కూడా సామాజిక పింఛనుకు దరఖాస్తు చేసుకుంటే వెబ్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న తప్పుల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

వెబ్‌ల్యాండ్‌ను ప్రక్షాళన చేయాలి
వెబ్‌ల్యాండ్‌లో ఉన్న తప్పులను వెంటనే ప్రక్షాళన చేయాలి. నా పేరుపై ఖాతా నంబరు 65లో 2.49 ఎకరాల భూమి ఉంది. అయితే 1బిలో మాత్రం ఇతరుల సర్వే నంబర్లు కూడా నమోదై 16 ఎకరాలు ఉన్నట్లు చూపెడుతోంది. దీనికారణంగా 63 ఏళ్ల వయస్సు ఉన్నా పింఛనుకు దరఖాస్తు చేసుకోడానికి వీలవడం లేదు. 
– కేశవులు రెడ్డి, పాపిరెడ్డిపల్లె, పెనుమూరు మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement