కొత్త సంవత్సరం ప్రజల్లో క్రొంగొత్త ఆశలను రేకెత్తిస్తోంది. జనం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదల సొంతింటి కల ఈ ఏడాది పూర్తిస్థాయిలో సాకారం కానుంది. 2020లో ఆన్‌లైన్‌కే పరిమితమైన చదువులను మళ్లీ తరగతుల బాట పట్టించేందుకు కార్యాచరణ రూపొందించింది. కుదేలైన వ్యవసాయ రంగానికి పునరుజ్జీవం అందిస్తోంది. చిరువ్యాపారులకు ‘తోడు’గా నిలిచి వారి బతుకుల్లో వెలుగులు నింపుతోంది. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోంది. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 2020లో కోవిడ్, నివర్, బురేవి వైపరీత్యాల చేదు జ్ఞాపకాలతో బెంబేలెత్తిన జిల్లావాసులకు 2021లో తీపి గుర్తులు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: జిల్లావాసులకు 2020 సంవత్సరం మరిచిపోలేని చేదు గుర్తులను మిగిల్చింది. జీవనశైలిని పూర్తిగా మార్చేసిది. అయితే ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అన్నివిధాలుగా అండగా నిలిచింది. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలకు ఆదుకుంది. ఈ క్రమంలోనే 2021 సంవత్సరంలో సైతం ముందుగా ప్రకటించిన ప్రణాళిక మేరకే అన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతోంది.
ఉన్నత విద్యకు ఆర్థిక సాయం
విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం భరోసాను కల్పి స్తోంది. డిగ్రీ, ఆ పై చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద నిధులు అందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన మూడో విడత, జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను మంజూరు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 1,32,924 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 98,490 మందికి మొదటి దశలో రూ.222.85 కోట్లు అందించారు. ఈ ఏడాది రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు
ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 1,74,240 మంది సొంతింటి కల సాకారం కానుంది. రూ.3,136.32 కోట్ల వ్యయంతో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వనుంది. ఈ పథకం కింద 1,41,775 మందికి ఇంటి పట్టాలను అందించే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. కొత్త సంవత్సరంలో ఆయా స్థలాల్లో ఇంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
మన బడి నాడు–నేడు
సర్కారు బడుల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. మన బడి నాడు–నేడు పథకం కింద జిల్లావ్యాప్తంగా 1,533 పాఠశాలల్లో మౌలిక వసతులు, కార్పొరేట్ హంగులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం అన్ని స్కూళ్లలో పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులన్నీ పూర్తయితే ప్రభుత్వ పాఠశాలలు నగరాల్లోని కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తయారవుతాయని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు. దీంతో సర్కార్ బడుల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు బారులు తీరుతారని తెలియజేస్తున్నారు.
ఠంచన్‌గా పింఛన్
గతంలో ఎన్నడూ లేనివిధంగా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దనే ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా జిల్లాలో 5,22,869 మందికి ప్రతినెలా రూ.126.85 కోట్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 2,32,765 మంది వృద్ధులు, 9,245 చేనేత కార్మికులు, 1,81,323 మంది వితంతువులు, 53,875 మంది వికలాంగులు, 840 మంది కల్లుగీత కార్మికులు, 113 మంది హిజ్రాలకు, 630 మంది మత్స్యకారులు, 12,275 మంది ఒంటరి మహిళలకు, 1,005 మంది కిడ్నీ బాధితులు, 6,822 మంది డప్పు కళాకారులు, 1,087 మంది చర్మకారులు, 167 మంది చిత్రకారులు, 146 మంది సైనిక్ వెల్ఫేర్, 1,831 మంది హెచ్‌ఐవీ బాధితులు, 6,415 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అభయహస్తం కింద 14,370 మందికి పింఛన్లు అందిస్తున్నారు.
వ్యాక్సిన్‌తో కోవిడ్‌కు చెక్!
కరోనా వైరస్ 2020లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. జిల్లాలో 86వేలమందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు అహర్నిశలు శ్రమించింది. సుమారు 7.61లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించిన పాజిటివ్ కేసులను గుర్తించింది. వారికి సకాలంలో వైద్యచికిత్సలందించి ప్రాణాలను కాపాడింది. 2021లో కోవిడ్ వ్యాక్సిన్‌తో భరోసా ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ నిల్వకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరిలో 1.3లక్షలమంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టింది. అనంతరం ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది.
మహిళల అభ్యున్నతి కోసం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వైఎస్సార్ చేయూత పథకానికి నాంది పలికారు. ఈ పథకం కింద 45–60 మధ్య వయసున్న అర్హులైన మహిళలకు ఏడాదికి రూ.18,750 జమ చేస్తున్నారు. నాలుగేళ్లల్లో ఒక్కొక్కరికి రూ.75వేలను అందించనున్నారు. ఈ ఏడాది రెండో విడత చేయూతను మహిళలకు అందించనున్నారు. జిలాలో 1,21,827 మందికి మొదటి విడతలో రూ.228.42కోట్లు అందజేసింది. కార్పొరేట్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుని అతివలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
పల్లె ప్రగతికి పెద్దపీట
గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. జిల్లాలో 1,412 గ్రామ పంచాయతీలున్నాయి. 1,308 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 1,012 సచివాలయ భవనాలు,, 932 రైతు భరోసా కేంద్ర భవనాలు, 721 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 687 అంగన్‌వాడీ భవనాలను నూతనంగా నిర్మిస్తున్నారు. అలాగే రూ.590.53 కోట్లతో సీసీ రోడ్లను నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే పల్లెల రూపురేఖలే మారిపోనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
అమ్మఒడితో చదువుకు అండ
విద్యార్థుల చదువుకు భరోసాను కల్పించేందుకు ప్రభుత్వం అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. పేదరికం విద్యకు అడ్డుకాకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.15వేలు జమ చేస్తున్నారు. రెండో విడత నగదు జనవరి 9న తల్లుల ఖాతాల జమ కానుంది. జిల్లాలో అమ్మఒడి ద్వారా 5,03,175 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
రైతుకు భరోసా
వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తోంది. అందులో భాగంగా అన్నదాతకు పెట్టుబడి నిధి కింద వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన రైతులకు విడతలవారీగా నగదు మంజూరు చేస్తోంది. జిల్లాలో మొదటి విడతలో రూ.5,500 చొప్పున 4,55,998 మందికి రూ.250.8 కోట్లు అందజేసింది. రెండో విడతలో రూ.2వేల చొప్పున 4,56,371 మందికి రూ.91.54 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే సంక్రాంతి ముందే కర్షకులకు మూడో విడత సాయాన్ని అందిస్తోంది.
వృత్తులకు చేదోడు
టైలర్లు, నాయిబ్రాహ్మణులు, రజకులు తదితరుల వృత్తి పనులను అభివృద్ధి చేసేందుకు జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. వెనకబాటుకు గురై అంతరించిపోతున్న చేతివృత్తులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేదోడు ద్వారా అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 19,521 మంది లబ్ధిదారులకు రూ.19.51 కోట్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment