తప్పులు..తిప్పలు
►చిన్న పొరపాటు... రైతులకు గ్రహపాటు
►వెబ్‌ల్యాండ్ ఆన్‌లైన్‌లో కనిపించని పహణీలు
►కదలని రెవెన్యూశాఖ
►అవస్థలు పడుతున్న అన్నదాత
కోరుట్ల: రెవెన్యూ రికార్డుల్లో ఉన్న చిన్నచిన్న పొరపాట్లతో రైతులు అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి తప్పులను సరిదిద్దాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్‌ఏ) నుంచి ఏటా ఉత్తర్వులు వస్తున్నా.. కిందిస్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడడంలేదు. ఫలితంగా పహణీలో ఉన్న చిన్నపాటి తప్పులకు రైతులు నష్టపోతున్నారు. ఈ పొరపాట్లతో ఆన్‌లైన్‌లో పహణీలు రాక రుణాలు తీసుకోవడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. భూక్రయవిక్రయాల సమయంలోనూ అవస్థలు తప్పడంలేదు.
లెక్కలోని రానివే...
రికార్డులను కంప్యూటరీకరించే క్రమంలో రెవెన్యూ సిబ్బంది చిన్నచిన్న పొరపాట్లకు తావిచ్చింది. వివరాలను కంప్యూటర్‌లో ఎంట్రీ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు ఉన్నా ఆన్‌లైన్‌లో పహణీలు కనిపించవు. సాధారణంగా సర్వే నంబర్ల నమోదు చేసే సమయంలో పుల్‌స్టాప్, కామా, ఆబ్లిక్, హైపన్ వంటి అక్షరాలతోపాటు సర్వే నంబర్లలోని విభాగాలను తెలిపే అంకెలు పొరపాటుగా పడినా భూములకు చెందిన పహణీలు ఆన్‌లైన్‌లో కనిపించవు. ఇలాంటి పొరపాట్లను సీసీఎల్‌ఏ అధికారులు ‘స్పెషల్ కారెక్టర్స్’గా గుర్తించి వీటిని సరిదిద్ది రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏటా కిందిస్థాయి అధికారులకు వివరాలు పంపుతోంది. వీటిలో పొరపాటుగా నమోదైన సర్వే నంబర్లు, పట్టా.. కబ్జాకాలమ్‌లోని పేర్లలో అక్షరాల తలకట్టు, దీర్ఘాలు వంటి చిన్నతప్పులకు చెందిన వివరాలను పంపి రికార్డులను సరిదిద్దాలని కోరుతోంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది మాత్రం ఇతర పనుల హడావుడిలో పడి ఈ దిద్దుబాటు చర్యలను పక్కనబెడుతోంది.
రైతులకు అగచాట్లు..
చిన్నపాటి పొరపాట్లతో రైతులు ఆన్‌లైన్‌లో పహణీలు కనిపించక అవస్థలు పడుతున్నారు. పంటల సాగుసీజన్‌లో పహణీ, 1బీ రికార్డు పత్రాలు తప్పనిసరి. వీటికోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆన్‌లైన్ పహణీ కాపీలు పొందడానికి యత్నిస్తున్న సమయంలో ఆన్‌లైన్ పత్రాలు రాక నిరాశకు గురవుతున్నారు. పొరపాట్లు సరిదిద్దాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఫలితంగా రైతులు రుణాలు తీసుకోలేక పంటల సాగు కోసం అప్పుల పాలవుతున్నారు. కొన్నిచోట్ల వీఆర్‌వోలు, తహసీల్దార్లు ఈ చిన్నపాటి పొరపాట్లను సైతం తమకు అనుకూలంగా మార్చుకుని కాసుల సంపాదనకు బాటలు వేసుకుంటున్నారు. గత్యంతరం లేని రైతులు రెవెన్యూ సిబ్బంది..అధికారులు అడిగినంత ఇచ్చుకుని రికార్డులు సరిచేయించుకుంటున్నారు.