wedding muhurtalu
-
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.. అప్పుడు ఏమైందంటే..
‘పెళ్లి జరగాలంటే?’ అనే ప్రశ్నకు ‘రెండు మనసులు కలవాలి’ అనే సిన్మా డైలాగ్ చెబుతాం. బెంగళూరు విషయానికి వస్తే మాత్రం ‘వధూవరులు టైమ్‌కు ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలి’ అనే జవాబే వినిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అనేది తరచుగా వార్తల్లో ఉండే అంశం. బెంగళూరులో ఒక వధువు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. మరో వైపు పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది. దీంతో బ్రైడల్ కారును విడిచి పరుగెత్తుతూ మెట్రో రైలు ఎక్కింది వధువు. ముహుర్తం టైమ్‌కు ముందుగానే ఫంక్షన్ హాల్‌కు చేరుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు మెట్రో ఆటోమేటిక్ ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘మెట్రోవాలే దుల్హనియా లేజాయేంగే’ ‘ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ ‘స్మార్ట్ థింకింగ్’... ఇలాంటి రకరకాల కామెంట్స్ నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే
జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కడప కల్చరల్ : శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు...అంటున్నారు పురోహితులు. అవును మరి...వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ఉండవు. అందుకే తల్లిదండ్రులు హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఎదురుచూడక తప్పదు గనుక ఉన్నంతలో ఈ ముహూర్తాలకే తమ బిడ్డల పెళ్లిళ్లు కానిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముమూర్తాలు తక్కువ కావడం...ఉన్నా...కరోనా కారణంగా పెళ్లిళ్లు జరగకపోవడం, నిబంధనల కారణంగా వివాహాల సంఖ్య తగ్గడం, వాయిదాపడటంతో రెండేళ్లుగా పెళ్లి సందడి పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కరోనా ఉధృతి తగ్గడం, ముహూర్తాలు విరివిగా ఉండడంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెళ్లి బాజాలు మార్మోగాయి. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి.. జరుగుతున్నాయి.. ఈ నెల (మే) తర్వాత జూన్ మినహా (ఆగస్టులో కొద్దిగా) డిసెంబరు వరకు ముహూర్తాలు లేవు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారు ఆరు నెలలపాటు ఎదురు చూడటం మంచిది కాదన్న ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. పైగా ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా ఈ మధ్య కాలంలో మళ్లీ మన వైపు చూస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతోంది. ఆ.. ఏం కాదు...నిదానమే ప్రధానమని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు. కానీ నానాటికి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని పలుచోట్ల డిసెంబరు వరకు కల్యాణ మండపాలు రిజర్వు అయిపోయాయి. డెకరేషన్, కేటరింగ్ తదితరాలకు కూడా టోకన్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. గండం దాటుకుంటాం ఐదు నెలలుగా జరుగుతున్న వివాహాల వల్ల జిల్లాలో వ్యాపారాలు జోరందుకున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాక ధరలు రోజురోజుకు పెరుగుతున్నా పెళ్లిళ్ల కారణంగా డిమాండ్ తగ్గడం లేదు. వరుసగా రెండేళ్లపాటు దారుణంగా దెబ్బతిన్న వ్యాపారాలు ఈ వివాహాల ద్వారా కోలుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారాలు ఈ వివాహాల ద్వారానే జరిగాయి. దీంతో వ్యాపారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భయపెడుతున్న బంగారం రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని పిల్లల పెళ్లిళ్లకు సిద్ధమైన తల్లిదండ్రులు అవసరమైన బంగారం కొంటున్నారు. ప్రస్తుత ధరల్లో తులం బంగారంతో ఆభరణం చేయించాలంటే రూ. 55–60 వేలు వెచ్చించాల్సి వస్తోంది. కానీ వివాహాలలో బంగారం ప్రధానపాత్ర పోషిస్తుండడంతో దాన్ని కొనేందుకు తల్లిదండ్రులకు తప్పడం లేదు. దీంతో ఇటీవల బంగారం ధర పెరిగినా కొనుగోలు కూడా పెరుగుతోందని వ్యాపారులు తెలుపుతున్నారు. రికార్డు స్థాయిలో గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలపాటు వరుసగా ఉండడంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం మే నెల 18 వరకు మొత్తం 37 ముహూర్తాలు ఉండగా, జిల్లా వ్యాప్తంగా చిన్న, ఓ మోస్తరు వివాహాలు ఇప్పటివరకు ఐదు వేలు జరగ్గా, భారీ వివాహాలు దాదాపు 1000 వరకు జరిగినట్లు ఆయా వర్గాల సమాచారం. వీటి ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 1000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మే 18 నుంచి డిసెంబరు చివరి ముహూర్తంలోపుగా జిల్లా వ్యాప్తంగా మరో మూడు వేల చిన్న, పెద్ద వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మరో రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా. -
ఈ నెల 15న భారీగా పెళ్లి ముహూర్తాలు
నారాయణఖేడ్: పంద్రాగస్టు అనగానే సాధారణంగా గుర్తుకొచ్చేది స్వాతంత్య్ర దినోత్సవం. జాతీయ పండుగ అయిన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రజలు వేడుకలా జరుపుకోవడం దేశభక్తిని చాటుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే వివాహం చేసుకుంటే వధూవరులకు ప్రత్యేకమైన రోజున పెళ్లి చేసుకున్నామన్న సంతోషం అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేని విధంగా శ్రావణ మాసంలో స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన వివాహ ముహూర్తం ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. 40 రోజుల విరామం అనంతరం పురోహితులు ఆగస్టు మాసంలో కొన్ని రోజుల్లో అధిక వివాహాలు చేసేందుకు ముహూర్తాలు పెట్టారు. గత నెల జూలై మాసంలో 27న శ్రావణ మాసం మొదలైనా మంచి ముహూర్తాలు లేవు. పురోహితులు ఈ నెల 11, 15, 20, 22వ తేదీల్లో వివాహాలకు ముహుర్తాలు నిర్ణయించారు. అందులో పంద్రాగస్టున జిల్లాలో వందలాది వివాహాలు జరగనున్నాయి. శ్రావణ మాసానికి ముందు ఆషాఢ మాసం ఉండడంతో మూఢాల కారణంగా వివాహాలకు మంచి ముహూర్తాలు లేక పెళ్లిళ్లు జరగలేదు. దీంతో ఉన్న నాలుగు తేదీల్లోనూ విశేష దినమైన ఆగస్టు 15న వివాహాలు నిర్వహించేందుకు పెద్దలు సైతం ఆసక్తి చూపించారని పురోహితులు చెబుతున్నారు. తన 15 ఏళ్ల పౌరోహిత్యంలో ఆగస్టు 15న పెళ్లి ముహూర్తం పెట్టలేదని ఖేడ్‌కు చెందిన పురోహతుడు మలమంచి మనోహరశర్మ తెలిపారు. ఈ ఏడాది మాత్రమే ఆగస్టు 15న శ్రావణ శుక్రవారం కారణంగా భారీగా ముహూర్తాలు పెట్టానని వివరించారు. శ్రావణ మాసం తర్వాత మళ్ళీ మూఢాలు వస్తుండడంతో ఈ నెలలోనే వివాహాది శుభకార్యాలు చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక 11,15,20,22 తేదీల్లో వివాహ జరిపేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఫంక్షన్ హాల్లు బుక్ అయిపోయాయి. దీంతో ఫంక్షన్ హాల్లు లభించని వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, పుష్యం, మాఘం, పాల్గుణం మాసాల్లో ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెలలోనే వివాహాలు చేసేందుకు అందరూ సిద్ధమయ్యారు. దీంతో జిల్లా కేంద్రం సంగారెడ్డితో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వేలాదిగా వివాహాలు జరగనున్నాయి. దీంతో ఫంక్షన్ హాల్‌లతో పాటు బ్యాండు, సన్నాయి, పురోహితులు, క్యాటరింగ్, డెకరేషన్, వాహనాలు, ఫోటో, వీడియోగ్రాఫర్, టెంట్‌హౌస్, బంగారు, వస్త్ర దుకాణాలకు గిరాకీ పెరగనుంది.