నారాయణఖేడ్: పంద్రాగస్టు అనగానే సాధారణంగా గుర్తుకొచ్చేది స్వాతంత్య్ర దినోత్సవం. జాతీయ పండుగ అయిన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రజలు వేడుకలా జరుపుకోవడం దేశభక్తిని చాటుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే వివాహం చేసుకుంటే వధూవరులకు ప్రత్యేకమైన రోజున పెళ్లి చేసుకున్నామన్న సంతోషం అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేని విధంగా శ్రావణ మాసంలో స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన వివాహ ముహూర్తం ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.
40 రోజుల విరామం అనంతరం పురోహితులు ఆగస్టు మాసంలో కొన్ని రోజుల్లో అధిక వివాహాలు చేసేందుకు ముహూర్తాలు పెట్టారు. గత నెల జూలై మాసంలో 27న శ్రావణ మాసం మొదలైనా మంచి ముహూర్తాలు లేవు. పురోహితులు ఈ నెల 11, 15, 20, 22వ తేదీల్లో వివాహాలకు ముహుర్తాలు నిర్ణయించారు. అందులో పంద్రాగస్టున జిల్లాలో వందలాది వివాహాలు జరగనున్నాయి. శ్రావణ మాసానికి ముందు ఆషాఢ మాసం ఉండడంతో మూఢాల కారణంగా వివాహాలకు మంచి ముహూర్తాలు లేక పెళ్లిళ్లు జరగలేదు.
దీంతో ఉన్న నాలుగు తేదీల్లోనూ విశేష దినమైన ఆగస్టు 15న వివాహాలు నిర్వహించేందుకు పెద్దలు సైతం ఆసక్తి చూపించారని పురోహితులు చెబుతున్నారు. తన 15 ఏళ్ల పౌరోహిత్యంలో ఆగస్టు 15న పెళ్లి ముహూర్తం పెట్టలేదని ఖేడ్‌కు చెందిన పురోహతుడు మలమంచి మనోహరశర్మ తెలిపారు. ఈ ఏడాది మాత్రమే ఆగస్టు 15న శ్రావణ శుక్రవారం కారణంగా భారీగా ముహూర్తాలు పెట్టానని వివరించారు. శ్రావణ మాసం తర్వాత మళ్ళీ మూఢాలు వస్తుండడంతో ఈ నెలలోనే వివాహాది శుభకార్యాలు చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక 11,15,20,22 తేదీల్లో వివాహ జరిపేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఫంక్షన్ హాల్‌లు బుక్ అయిపోయాయి.
దీంతో ఫంక్షన్ హాల్‌లు లభించని వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, పుష్యం, మాఘం, పాల్గుణం మాసాల్లో ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెలలోనే వివాహాలు చేసేందుకు అందరూ సిద్ధమయ్యారు. దీంతో జిల్లా కేంద్రం సంగారెడ్డితో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వేలాదిగా వివాహాలు జరగనున్నాయి. దీంతో ఫంక్షన్ హాల్‌లతో పాటు బ్యాండు, సన్నాయి, పురోహితులు, క్యాటరింగ్, డెకరేషన్, వాహనాలు, ఫోటో, వీడియోగ్రాఫర్, టెంట్‌హౌస్, బంగారు, వస్త్ర దుకాణాలకు గిరాకీ పెరగనుంది.
ఈ నెల 15న భారీగా పెళ్లి ముహూర్తాలు
Published Mon, Aug 11 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
Advertisement
Advertisement