Wedding Planners
-
14, 15 తేదీల్లో హైటెక్స్‌లో వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం
సనత్‌నగర్ (హైదరాబాద్): జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజం, తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ 3వ ఎడిషన్, 3వ టీసీఈఐ ఎస్ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్ 2024 బియాండ్ ఇమాజినేషన్, 7వ టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు జరగనున్నాయి.ఈ మేరకు ఆదివారం బేగంపేట పర్యాటక భవన్‌లోని ది ప్లాజా హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, భారతీయ వివాహ పరిశ్రమలోని నిపుణులను ఇది ఒకచోట చేర్చుతుందని, ఈ ఈవెంట్ ద్వారా వివాహాలకు దక్షిణాది నుంచి ముఖ్యమైన సహకారం, పరిజ్ఞానం, ప్రత్యేక వేదికను అందించడమే లక్ష్యమన్నారు. భారతీయ వివాహ వ్యవస్థలోని వివిధ అంశాలపై జ్ఞానయుక్తమైన సెషన్లు ఉంటాయని, జాతీయ, అంతర్జాతీయ వక్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారని తెలిపారు. ఈ కన్వెన్షన్ కోసం దేశవిదేశాల్లో ఉన్న 20కి పైగా వెడ్డింగ్ ప్లానర్లు, వెడ్డింగ్ డిజైనర్లు, వెడ్డింగ్ స్టైలిస్టులు, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ ఇండస్ట్రీలోని ఇతర క్రాప్ట్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయన్నారు.ఈవెంట్‌కు సిడ్నీ నుంచి వెండీ ఈఎల్ ఖౌరీ సహా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులు హాజరవుతారన్నారు. టెడ్డీ ఇమాన్యుయేల్ (ఫిలిప్పీన్స్), మైఖేల్ రూయిజ్ (ఫిలిప్పీన్స్), బ్రయాన్ టాచీ–మెన్సన్ (ఘనా) తదితరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవిదేశాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులకు స్వాగతం పలుకుతోందన్నారు. ‘ఈవెంట్ బజార్’గా పిలవబడే ఎక్స్‌పోలో 60కి పైగా స్టాల్స్‌లో గ్రాండ్ డిస్ప్లే ఉంటుందన్నారు. ఈవెంట్ పరిశ్రమలో ఉన్న విభిన్న ఉత్పత్తులు, సేవలు, అత్యాధునిక ట్రెండ్లను ప్రదర్శిస్తుందని చెప్పారు.ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్ సేప్టీ, టెక్నాలజీ పాత్ర తదితర కీలక అంశాలపై సమాంతర సెషన్లు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ డైరెక్టర్ రమేశ్‌నాయుడు, హైటెక్స్ హెడ్ టీజీ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాంబాబు, ప్ర«ధాన కార్యదర్శి రవిబురా, కోశాధికారి ఎండీ తౌఫిక్ ఖాన్, ఎస్ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్ 2024 కన్వీనర్ సాయి శ్రవణ్ మాదిరాజు, టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024 కన్వీనర్ రామ్ ముప్పన, కో–కన్వీనర్లు హిరీష్రెడ్డి, కుమార్‌రాజా, సుధాకర్ యారబడి, డాక్టర్ సౌరభ్ సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
ఈవెంట్ ఎంతో ఈజీ.. వేడుక ఏదైనా మేనేజ్ చేస్తారు
కల్చర్ మారిపోతోంది. ప్రజల ఆలోచనా విధానం కొత్తదనాన్ని కోరుకుంటోంది. రెడీమేడ్ను ఎక్కువగా ఇష్టపడుతోంది. ఒకప్పుడు పెళ్లి కోసం నెలల తరబడి కసరత్తు జరిగేది. ఊరూవాడా కలిసి వివాహ వేడుకల్లో పాలుపంచుకునేది. కానీ రోజులు మారాయి. పెళ్లిళ్లు, పుట్టిన రోజు తదితర వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తమకు నచ్చిన విధంగా వీటిని నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉంటే చాలు.. ఒక్క ఫోన్ కాల్‌తో పిసరంత కష్టం లేకుండా కావలసినవన్నీ స్మార్ట్‌గా సిద్ధమైపోతున్నాయి. ఇక ఏర్పాట్ల హడావుడి లేకపోవడంతో కుటుంబం అంతా సంతోషంలో హైలెస్సా అంటూ ఎంజాయ్ చేస్తోంది. అదరహో అనిపించేలా.. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల ధగధగలతో కల్యాణ వేదికలు కనువిందు చేస్తాయి. స్వర్గలోకాన్ని తలపించే స్వాగత ద్వారాలు అలరిస్తాయి. అక్కడ మంచు, వర్షం కురుస్తున్న అనుభూతి కలిగించే భారీ సెట్లు, ఫైర్ షాట్లు అబ్బుర పరుస్తాయి. విందారగించేందుకు లెక్కకు మిక్కిలి రుచులు కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. నిశ్చితార్థం, మెహందీ, సంగీత్, హల్దీ, వివాహం, రిసెప్షన్ తదితర వేడుకలతో పాటు ఫొటో షూట్లు, వధూవరుల ఊరేగింపు వంటి ఏర్పాట్లన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్లే సమకూరుస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇక ఫంక్షన్‌కు వచ్చే వారికి వినోదాన్ని పంచడానికి ప్రత్యేకంగా ఉర్రూతలూగించే డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లు ఉంటాయి. వచ్చిన వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు హుషారైన యాంకర్లు ఉంటారు. ఇంకా పెళ్లి పందిళ్లు, పురోహితులను సమకూర్చే బాధ్యతలను తీసుకునే ఈవెంట్ మేనేజ్మెంట్లూ ఉన్నాయి. విజయవాడ నగర పరిధిలో వందకు పైగా ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలున్నాయి. వీటిలో 50 వరకు నాణ్యమైన, పది అత్యంత నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నవిగా గుర్తింపు పొందాయి. రోబో సర్వింగ్.. చీర్ గాళ్స్ హంగామా.. పెళ్లిళ్లకు వచ్చిన వారికి రోబోలతో స్వాగతం పలకడం, సర్వింగ్ చేసే సరికొత్త ట్రెండ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరికొందరు మరో అడుగు ముందుకేసి రష్యాకు చెందిన చీర్ గాళ్స్ (నలుగురైదుగురుండే బృందం)ను రప్పించి వారితో వయ్యారాలొలికిస్తూ ఆనందాన్ని పంచుతున్నారు. స్వాగత ద్వారాల వద్ద వీరిని ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతున్నారు. రోబోలు, చీర్ గాళ్స్ సంస్కృతి హైదరాబాద్‌లో ఇప్పటికే ఉంది. ఇటీవల కొంతమంది స్థితిమంతులు విజయవాడలోనూ ఈ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. రోబోకు రూ.50–60 వేలు, చీర్ గాళ్స్‌కు రూ.50–70 వేల వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. సరికొత్తగా కొన్ని వివాహాల్లో కేరళ డ్రమ్స్, పంజాబీ డోలు వాయిద్యాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. రూ.లక్షల్లో ప్యాకేజీలు.. ► పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎవరి స్థాయిని బట్టి వారు వివాహ వేడుకలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది ఖర్చు ఎంత అన్నది కాదు.. పెళ్లి ఎంత ఘనంగా చేశామా? అన్నదే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. వివాహ వేడుకలకు ఎంత వెచ్చిస్తే అంత స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న వారూ ఉన్నారు. ► దీంతో ఈవెంట్ మేనేజర్లు విందు భోజనాలు, కల్యాణ మండపాల డెకరేషన్, విద్యుదలంకరణ, ఫొటో, వీడియో షూట్లు, డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లు వంటి వాటికి వేర్వేరు ధరలు నిర్ణయిస్తున్నారు. అన్నీ కలిపి ఓ ప్యాకేజీగాను, అలాకాకుండా వేర్వేరు ప్యాకేజీలుగాను వెసులుబాటు కల్పిస్తున్నారు. ► డెకరేషన్‌కు కనీసం రూ.లక్ష నుంచి ఏడెనిమిది లక్షలు, ఫొటోగ్రఫీ/ఫొటో షూట్లకు రూ.70 వేల నుంచి రూ.5–6 లక్షలు, విందు భోజనాలకు రూ.లక్ష నుంచి రూ.5–6 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారు. ► విజయవాడలో కొంతమంది స్థితిమంతులు వివాహ వేడుకలకు రూ.30 లక్షలు వెచ్చిస్తున్న వారూ ఉన్నారు. ► మునుపటికి భిన్నంగా ఇటీవల పలువురు డెకరేషన్ కంటే ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని విజయవాడలోని అమ్మ ఈవెంట్స్ నిర్వాహకుడు అనిల్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కావాల్సిన విధంగా.. నా వివాహం ఇటీవల విజయవాడలో జరిగింది. రిసెప్షన్ ఘనంగా చేసుకోవాలనుకున్నాను. స్నేహితుల సాయంతో నగరంలో పేరున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను సంప్రదించాను. చివరకు ఓ ఈవెంట్ సంస్థకు అప్పగించాను. మాకు రిసెప్షన్‌కు ఏం కావాలో, ఎలాంటి డెకరేషన్ అవసరమో వాళ్లకు చెప్పాం. మా అభిరుచులకు అనుగుణంగా అన్నీ వారే సమకూర్చారు. డెకరేషన్ వగైరాలు కనుల పండువగా ఏర్పాటు చేశారు. అందువల్ల రిసెప్షన్ ఎలా జరుగుతుందా? అన్న ఆలోచనే లేకుండా పోయింది. ఈ రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. – విజయసాయి, విజయవాడ ట్రెండ్ మారుతోంది.. వివాహ వేడుకల ట్రెండ్ మారుతోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులు తగ్గించి ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యత పెరిగింది. వెరైటీ వంటకాలు, వినూత్న హంగామాలు, లైవ్ మ్యూజిక్‌లు వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వేడుక సమ్‌థింగ్ స్పెషల్‌గా, స్టేటస్ సింబల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. కొందరు రోబోలు, చీర్ గాళ్స్ సందడితో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నారు. వారి టేస్ట్‌కు అనుగుణంగా సంస్థలు అన్నీ సమకూరుస్తున్నాయి. – విజ్జు విన్నకోట, సెలబ్రిటీ ఈవెంట్స్, విజయవాడ -
మహిళా వెడ్డింగ్ ప్లానర్స్ ఆకాశమే హద్దు...
తమ వివాహ వేడుక నూరేళ్లు గుర్తుండిపోయేలా ఆకాశమే హద్దుగా.. భూదేవంత కళగా వైభవంగా.. వినూత్నంగా .. కనివిని ఎరగని విధంగా జరుపుకోవాలంటే డబ్బొక్కటే ఉంటే సరిపోదు... సరైన ప్లానింగ్ కూడా ఉండాలి. పట్టుచీరలు, నగలు అలంకరించుకుని మండపానికి వచ్చే మగువలే కాదు.. తమ చేతులతో పెళ్లిళ్లను అర్ధవంతంగా జరిపించి, అంతటా పేరు తెచ్చుకుంటున్న అతివలు మన దేశాన అగ్రశ్రేణిలో ఉన్నారు. వివాహ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకోవాలనే ఆలోచన మెజారిటీ ప్రజల్లో ఉండటం కారణంగా వెడ్డింగ్ ప్లానర్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఖర్చుతో బాటు సరైన ప్లానింగ్‌తో జరగాలన్న ఒత్తిడితో కూడుకున్న ఈ వేడుక ప్లానర్‌ని నియమించేలా చేస్తుంది. ఇండియా టాప్ వెడ్డింగ్ ప్లానర్ల జాబితాలో ఉన్న వందనామోహన్, దివ్యావితిక, టీనా తర్వాణి, దేవికా సఖుజ, ప్రీతీ సిద్వానీలు పెళ్లి పెద్దలుగా ప్లానింగ్ చేసే అవకాశాన్ని ఏళ్ల తరబడి అందిపుచ్చుకుంటున్నారు. వందనా మోహన్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్సైన్ విభాగం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న వందన ఐక్యరాజ్యసమితిలో పనిచేయాలనుకుంది. రూట్ మార్చుకుని భారతదేశపు అగ్రశ్రేణి వెడ్డింగ్ ప్లానర్‌లో ఒకరుగా పేరొందారు. ‘ది వెడ్డింగ్ డిజైన్’ కంపెనీ పేరుతో 28 ఏళ్లుగా వందనా మోహన్ దేశవ్యాప్తంగా సెలబ్రిటీల పెళ్లి కళ బాధ్యతను తీసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఇటలీలోని లేక్ కోమోలో బాలీవుడ్ అగ్రనటులు దీపికాపదుకొనే, రణ్‌వీర్‌సింగ్‌ల పెళ్లి కలను నిజం చేసిన ప్లానర్ వందనామోహన్. అద్భుతమైన కథలా కళ్లకు కట్టే సెట్టింగ్, సమ్మోహనపరిచే డిజైన్స్, ఎక్కడా దేనికీ తడుముకోవాల్సిన అవసరం లేకుండా వివాహతంతును పూర్తి చేయడంలో వందనది అందె వేసిన చేయి. ‘ఒకప్పటి ప్రఖ్యాత ప్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్, బిజినెస్ ఉమెన్ కోకో చానెల్ నుండి ప్రేరణ పొందుతాను. మూస విధానాలను దాటి ఆలోచించడమే నా విజయం’ అనేది ఈ ఫస్ట్ ఇండియన్ ఉమన్ వెడ్డింగ్ ప్లానర్ మాట. ఇప్పటికి 500 పెళ్లిళ్ళను అద్భుతంగా చేసిందన్న ఘనత వందన ఖాతాలో జమ అయ్యింది. దివ్య – వితిక బెంగుళూరు వెడ్డింగ్ ప్లానర్స్ దివ్య–వితిక లు ప్రారంభించిన సంస్థ. వీరి సోషల్ మీడియా అకౌంట్ చూస్తే చాలు ఆ పెళ్లిళ్లు ఎంత గ్రాండ్‌గా ఉంటాయో కళ్లకు కడతాయి. గతంలో మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్న ఈ ఇద్దరు దివ్యా చౌహాన్, వితికా అగర్వాల్ స్నేహితులయ్యారు. ‘దివ్య వితిక’ అని తమ పేరుతోనే 2009లో వెడ్డింగ్ ప్లానర్ కంపెనీని ప్రారంభించారు. తమ ప్లానింగ్‌లో భాగంగా ఎక్కడా ఆనందాన్ని మిస్ కానివ్వదు. వచ్చే అతిథులు చూపులకు పూర్తిగా ఓ కళారూపంగా, వినోద భరితంగా వీరి ఈవెంట్ డిజైనింగ్ ఉంటుంది. ఒక బలమైన థీమ్, కలర్ డిజైన్, అద్భుతమైన అలంకరణ కావాలనుకుంటే దివ్య వితికను కలవాల్సిందే అనేలా వీరి ప్లానింగ్ ఉంటుంది. టీనా థర్వాణి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ‘షాదీ స్క్వాడ్’ సహ వ్యవస్థాపకురాలు టీనా థర్వాణి. ఈ కంపెనీలో కొనసాగాలని నిర్ణయించుకోవడానికి ముందు టీనా చిత్ర నిర్మాణంలో పనిచేసింది. ఇటలీలోని టుస్కానీలో బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరొందిన అనుష్క–విరాట్‌కోహ్లి (విరుష్క)ల అందమైన పెళ్లి వేడుకను టీనా ప్లాన్ చేసింది. ఈ జంట వారి ప్రత్యేక రోజును వారి ఊహలను, గ్రాండ్‌నెస్‌ను కలిపి ఆవిష్కరించింది. టీనా చేసే థీమ్ బేస్డ్ ప్లానింగ్‌లో ఒక ప్రత్యేకమైన రిచ్‌నెస్‌తో పాటు యువజంట కలలను కళ్లముందు నిలుపుతుంది. దేవికా సఖుజా ఢిల్లీలో ఉంటున్న ఈ వెడ్డింగ్ ప్లానర్ తన పేరుతో స్థాపించిన సొంత కంపెనీకి ఈవెంట్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గతం నుంచి తీసుకున్న థీమ్‌ను ప్రస్తుత కాలానికి తగినట్టుగా వినూత్నంగా నవీకరిస్తుంది. ఈ రకమైన థీమ్‌లను రూపొందించడంలో దేవికకు ప్రత్యేకమైన పేరుంది. సన్నిహితుల మధ్య జరిగే చిన్న సమావేశమైనా, పెళ్లి వంటి పెద్ద వేడుకలైనా ప్రతీ క్షణం ఆహూతులు ఆస్వాదించే విధంగా జంటకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఈవెంట్‌ను ప్లాన్ చేయాలన్నదే దేవిక అభిమతం. సందర్భానికి తగిన విధంగా సరైన వాతావరణాన్ని తనదైన కోణంలో సృష్టించకపోతే వేడుక సంపూర్ణం కాదనేది దేవికా సఖుజా అభిప్రాయం. వేడుక సందర్భాన్ని బట్టి ఎలాంటి డిజైన్లనైనా ఏ బడ్జెట్లోనైనా పూర్తి చేయడంలో దేవిక సఖుజ దిట్ట. ప్రీతి సిధ్వాని రెండు దశాబ్దాలుగా వెడ్డింగ్ ప్లానింగ్‌లో తీరికలేకుండా ఉంటున్నారు ప్రీతి సిధ్వాని. ‘డ్రీమ్జ్ క్రాఫ్ట్’ పేరుతో 2002లో ప్రారంభించిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ నిర్వహణతో పాటు సినిమా సెట్టింగ్ డిజైన్లలోనూ బిజీగా ఉంటారు ప్రీతి. సినిమా సెట్టింగ్స్ నుంచి పెళ్లి వేడుకల సెట్టింగ్స్‌తో ఆమె ఈ మార్కెట్లోకి ప్రవేశించింది. దేశ నలుమూలల నుండి వెడ్డింగ్ ప్లానింగ్‌కు సంబంధించిన సృజనాత్మక ఐడియాల కోసం ప్రీతిని సోషల్‌మీడియా ద్వారా కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి ఎంతో వైభవంగా జరుపుకోవాలనే ఆలోచన ఒక్క పెళ్లి విషయంలోనే చేస్తారు. వధువు, వరుడి వైపు కుటుంబాలు ప్రశాంతంగా, సంబరంగా జరుపుకునే ఈ వేడుక అన్నీ పద్ధతి ప్రకారం జరగాలంటే ఓ పెద్ద సవాల్. రకరకాల అంశాలతో కూడి ఉండే ఈ వేడుక బాధ్యతను సవాల్‌గా తీసుకొని తమ సమర్థతను చాటుతున్నారు ఈ మహిళామణులు. -
మాస్క్‌లకి పెళ్లి కళ
కరోనా మూలంగా మాస్క్‌లు రోజువారి జీవితాల్లో భాగమైపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్కులు వాడుతున్నారు. వీటిలో ఒకసారి వాడి పడేసేవే ఎక్కువ. దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని గ్రహించిన యూకే వెడ్డింగ్ ప్లానర్స్ వినూత్న ఆలోచనతో మాస్కులతో మంచి డ్రెస్‌ను డిజైన్ చేశారు. వాడి పడేసిన 1500 మాస్కులతో వెడ్డింగ్ గౌనును రూపొందించారు. రీ సైకిల్ చేసిన పీపీఈ కి ట్‌తో గౌనుకు ఆకారాన్ని తీసుకొచ్చి అందమైన తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌ను తయారుచేశారు. వెడ్డింగ్ ప్లానర్ వెబ్సైట్ ‘హిట్చ్‌డ్’ (Hitched) ఈ గౌను రూపకల్పనకు పూనుకోగా, డిజైనర్ సిల్వర్‌వుడ్ గౌనును రూపొందించారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్‌లో కేసులు తగ్గి వివిధ కార్యక్రమాలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో హిట్చ్‌డ్ మాస్కులతో సరికొత్త వెడ్డింగ్ గౌనును రూపొందించి మోడల్‌కు వేసి ఫోటోలు తీయడంతో ఈ గౌను వెలుగులోకి వచ్చింది. ‘‘ఏటా రూపొందించే వెడ్డింగ్ గౌన్లకు భిన్నంగా పర్యావరణ హితంగా సరికొత్త గౌన్లు తయారు చేయాలనుకున్నాం. ఈ క్రమంలోనే మాస్కులను ఈ విధంగా కూడా వాడవచ్చని మెస్సేజ్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే... వాడేసిన మాస్కులను శుభ్రపరిచి వెడ్డింగ్ గౌన్‌ను రూపొందించాం. మాస్కులతో వెడ్డింగ్ గౌన్ మరింత అందంగా వచ్చింది’’అని హిట్చ్‌డ్ ఎడిటర్ సారా అలార్డ్ చెప్పారు. -
పెళ్లంటే ఇదేరా!
రెండు మనసులను ముడి వేసే పెళ్లంటే సందడే సందడి. బంధుమిత్ర సపరివారం హడావిడి సరేసరి.. ఈ హంగామాకు ఇప్పుడు సరికొత్త రూపం ఇస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. పెళ్లికి రావడం.. వధూవరుల్ని ఆశీర్వదించడం.. అందరినీ పలకరించి, భోజనాలు ముగించి వెళ్లిపోవడం..ఈ రొటీన్ సీన్‌కే డిఫరెంట్ థీమ్‌లను జతచేసి.. ముహూర్తానికిరెండ్రోజుల ముందు నుంచే వెడ్డింగ్ వెదర్‌ను ఆటపాటలతో జాయ్‌ఫుల్‌గా మార్చేస్తున్నారు. ఆకాశ పందిరిలో వినోదాలు వెల్లివిరిసేలా ప్రతి సీన్లో క్రియేటివిటీ జోడించి.. కల్యాణాన్ని మరింత కమనీయం చేస్తున్నారు. కల్యాణ మంటపం ఎంట్రన్స్ నుంచి.. పెళ్లి పందిరి వరకూ డెకరేషన్తో అదరగొట్టడం మామూలే. పెళ్లి వేడుకలో.. ఆర్కెస్ట్రాతో పాటలు పాడించడమూ పాత ట్రెండే. దీనికి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. పెళ్లికొచ్చిన అతిథులందరినీ ఇన్వాల్వ్ చేస్తూ.. నూతన వధూవరులకు అపురూపమైన ఆనందాన్ని అందిస్తున్నారు. పెళ్లి మంటపంలో బంధుమిత్రుల అనుబంధాలను ప్రతి ‘ఫ్రేమ్’లో ఇమిడ్చి కలర్‌ఫుల్ చేస్తున్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సరదా వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఈ ప్లానర్లు. కొన్ని వర్గాల వారికే పరిమితమైన మెహందీ ఘట్టాన్ని ప్రతి ఇంట జరిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌ను కలర్ఫుల్గా సాగేలా చూస్తున్నారు. అతిథులే ఎంటర్టైనర్స్ పెళ్లి పందిరికి సమాంతరంగా మరో వేదిక వేసి దానిపై ఆటపాటలతో అదరగొడుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఎవరినో పిలిపించడం లేదు కూడా. వచ్చిన అతిథుల్లోని ఔత్సాహికులను ఎంకరేజ్ చేసి మరీ ఇందులో పాల్గొనేలా చేస్తున్నారు. అంత్యాక్షరీలు, సంగీత కచేరీలు, స్టాండప్ కామెడీ, స్కిట్స్ ఇలా డిఫరెంట్ ఈవెంట్స్‌తో పెళ్లిసందడిని రెట్టింపు చేస్తున్నారు. పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడని జనాలు.. ఈ తరహా పెళ్లి వేడుకకు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు. నేచురల్ మేకోవర్.. ఒకప్పుడు వధూవరులు కాస్త మేకప్ అయ్యేవారు. ఈ ప్లాన్డ్ మ్యారేజెస్లో స్పెషల్ మేకప్ ఆర్టిస్టులను పిలిపిస్తున్నారు. కాలి కొనగోటి నుంచి.. హెయిర్ వరకూ అన్ని అందంగా కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. ‘వధూవరుల కలర్, పర్సనాలిటీని బట్టి మేకప్ వేస్తుంటాం. మేకప్ అంటే రంగులు రుద్దేయడం కాదు. అలా చేయడం వల్ల అసహజంగా కనిపిస్తారు. సహజమైన అందాన్ని ఇనుమడింపజేసేలా మేకప్ చేయాలి. అప్పుడే నేచురల్‌గా కనిపిస్తారు. మ్యారేజ్ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ.. ఇలా అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముస్తాబు చేస్తున్నాం’ అని చెబుతారు మేకప్ ఆర్టిస్ట్ తాన్య వసల్రాజ్. బ్యాండ్ బారాత్.. పెళ్లిలో డ్యాన్స్‌ల కోసం ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్‌ను కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత జరిగే బారాత్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకునే వాళ్లూ ఉన్నారు. ‘పెళ్లిలో డ్యాన్స్ చేయాలని ఉత్సాహం ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. అందుకోసం స్పెషల్ స్టేజ్ ఏర్పాటు చేస్తాం కూడా. చాలా మంది మొదట్లో డ్యాన్స్ చేయడానికి తటపటాయిస్తారు. ట్రైనింగ్ తర్వాత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తుంటారు’ అని చెబుతారు కొరియోగ్రాఫర్ అమిత్ గుప్తా.