పరిపాలన నీతిని విస్మరించొద్దు..
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
దేవరుప్పుల(పాలకుర్తి) : ప్రజలను పరిపాలించే పాలకవర్గాలు మానవీయ కల్యాణం కోసం పరితపించాలే తప్ప పరిపాలన నీతిని విస్మరించొద్దని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు. మండలంలోని చిన్నమడూరులో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో మొక్కులు చెల్లిం చుకున్న అనంతరం సీతారాముల కల్యాణోత్సవ శోభాయాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉండేందుకు, పరిపాలన దక్షతకు నిదర్శనంగా వెలిసినవే ఆలయాలు అని అభివర్ణించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీరారెడ్డి సోమశేఖర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, సర్పంచ్ మేడ సునీత, ఉత్సవ నిర్వాహక కమిటీ ప్రతినిధి శ్రీనివాస్, జనగామ టీ జేఏసీ కన్వీనర్ ఆకుల సతీష్ పాల్గొన్నారు.
పేదోళ్ల అడ్డానే దొరికిందా ?
జనగామ : పదహారేళ్లుగా నివాసముంటున్న ఏసీ.రెడ్డి నగర్ గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చి, డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాల్సిందేనని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు గుడిసె వాసులు తలపెట్టిన రిలే దీక్షలు బుధవారం 59వ రోజుకు చేరుకోగా దీక్షా శిబిరాన్ని కోదండరాం సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రమంతటా శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు జరుగుతుంటే.. ఏసీ.రెడ్డి నగర్ వాసులు మాత్రం రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామలో కలెక్టరేట్ నిర్మించుకునేందుకు చాలా చోట్ల స్థలాలు ఉన్నా.. పేద కుటుంబాలు నివసించే కాలనీపై కన్ను వేయడం దుర్మార్గమన్నారు.
కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇక్కడే నిర్మించాలనుకుంటే ముందుగా గుడిసె వాసులకు పక్కా ఇళ్లు కట్టించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలోని మంచిర్యాల, వేములఘాట్‌తో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల నెలల తరబడి దీక్షలు జరుగుతున్నా స్వరాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. టీ జేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల సతీష్, కోచైర్మన్‌ప్రొఫెసర్ పురుషోత్తం, కోడెం కుమార్, రామచంద్రం, బిట్ల శ్రీనివాస్, సీపీఎం నాయకులు బూడిద గోపి, ఎం.డీ.దస్తగిరి, ఆకుల లక్ష్మయ్య, కుమార్, జోగు ప్రకాష్, సుధాకర్, రవి పాల్గొన్నారు.