బాలకృష్ణ సరసన నటిస్తే ..!
అన్ని రంగాలలోకంటే సినిమా రంగంలో సెంటిమెంట్లు ఎక్కువ. యాదృశ్చికంగా జరిగిన సంఘటనలను కూడా సెంటిమెంటుగా భావిస్తుంటారు. ఏ హీరోయిన్‌కి అయినా పెళ్లి కుదిరిన తరువాత ఆ హీరో సరసన నటిస్తే పెళ్లి ఆగిపోతుందా? అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ ప్రస్తుతం ప్రధానంగా చర్చించుకునే అంశం ఇదే. ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ఇద్దరు హీరోయిన్ల పెళ్లిళ్లు ఇలాగే ఆగిపోయాయి. ఆ హీరోయిన్లు ఆయనతో జతకట్టి నటించిన సినిమాల నిర్మాణం పూర్తి అయిన తరువాతే వారి ఇద్దరి పెళ్లిళ్లు ఆగిపోయాయి. వారి పెళ్లిళ్లు చివరి దశకు వచ్చిన తరువాతే ఆగిపోవడం యాదృశ్చికమే అయినప్పటికీ బాలయ్య సరసన నటించినందువల్లే ఆగిపోయాయా? అన్న రీతిలో సినీజనాలు చర్చించుకుంటున్నారు.
దక్షిణాది ప్రముఖ హీరోయిన్ నయనతార, ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రభుదేవా తన మొదటి భార్య రామాలత్కు కోట్ల రూపాయలు ఆస్తి రాసి ఇచ్చి, ఆమెతో తెగతెంపులు చేసుకున్నాడు. నయనతార-ప్రభుదేవా పెళ్లి చేసుకుంటున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. పెళ్లి తరువాత తాను సినిమాలలో నటించనని నయనతార ప్రకటించింది. బాలయ్యతో నటించే 'శ్రీరామరాజ్యం' తన చివరి చిత్రమని చెప్పింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత నటనకు స్వస్తి చెబుతున్నందుకు కంటతడికూడా పెట్టుకుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో ప్రభుదేవాతో నయనతార పెళ్లి ఆగిపోయింది. ఆమె హీరోయిన్గా కొనసాగుతోంది.
ఇప్పుడు త్రిష. తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం మూడు నెలల ముచ్చటగా ముగిసింది. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, వారి పెళ్లి తేదీని మాత్రం ఖరారు చేయలేదు. ఈ నేపధ్యంలో త్రిష తొలిసారిగా బాలకృష్ణ సరసన లయన్ చిత్రంలో నటించింది. ఆ సినిమా నిర్మాణం పూర్తి అయింది. విడుదలకు కూడా సిద్ధమైంది. ఇంతలో వరుణ్ - త్రిషల పెళ్లి ఆగిపోయినట్లు త్రిష తల్లి ఉమా కృష్ణన్ తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారనే వార్త కొద్దిరోజులుగా హల్చల్ చేస్తోంది. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వల్లే విభేదాలు నెలకొన్నాయనే వార్త ప్రచారం అయ్యింది. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు ఇష్టమేననీ, వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనీ ఉమ చెప్పారు. కుటుంబ పెద్దల నిర్ణయమే పెళ్లి రద్దు కావడానికి కారణమనీ, కానీ ఆ పెద్దల గురించి చెప్పి, వాళ్లను నొప్పించలేననీ ఆమె అన్నారు.
ఇలా వీళ్లు ఇద్దరూ పెళ్లి సంబంధం కుదిరిన తరువాత బాలయ్యతో నటించారు. ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే వారి పెళ్లిళ్లు ఆగిపోయాయి. దాంతో కోలీవుడ్, టాలీవుడ్‌లలో పెళ్లి కుదిరిన హీరోయిన్లు బాలయ్య బాబుతో నటిస్తే, పెళ్లి ఆగిపోతుందేమోనని అనుకుంటున్నారు. అదేమీ లేదని, అవి మూఢనమ్మకాలని కొందరు కొట్టిపారేస్తున్నారు.