జిల్లాలో పోలీసులకు ఇక వారాంతపు సెలవు
అమలు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా ఎస్పీ రాజకుమారి
అనంతగిరి: పోలీసులకు ఇక నుంచి వారంతపు సెలవులు అమలుపరుస్తామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టలోని హరిత రిసార్ట్స్‌లో శుక్రవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వారాంతపు సెలవును ఆయా పీఎస్‌ల ఎస్హెచ్ఓలు రొటేషన్ పద్ధతిలో అందరికి వచ్చేలా చూడాలన్నారు. ఇక నుంచి ప్రతినెల సిబ్బంది సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే అక్కడ విన్నవించుకోవచ్చన్నారు. పోలీసుల సంఘం కార్యాలయం కోసం తమ కార్యాలయ పరిధిలోని ఓ గదిని కేటాయిస్తున్నట్లు తెలిపారు.
పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. పోలీసుల నివాసాల మధ్య డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.85 లక్షలు మంజూరైనట్లు చెప్పా రు. రాజీవ్ గృహకల్ప ఎదుట పోలీసుశాఖకు ఉన్న స్థలంలో మహిళా పీఎస్ ఏర్పాటుకు నిధులు మం జూరయ్యాయన్నారు. ఇటీవల జరిగిన ఎస్పీల సమావేశంలో వికారాబాద్, తాండూరులలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డీజీపీకి విన్నవించినట్లు చెప్పారు. అనంతరం తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ పోలీసుల కోసం కల్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. డీపీఓలో ఉన్న క్యాంటీన్లో కిరాణా సరుకులు కూడా విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం సంఘం తరఫున ఎస్పీని, ఏఎస్పీని, డీఎస్పీలను సన్మానించారు. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబర్చిన అన్ని విభాగాల సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణామూర్తి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు, డీఎస్పీలు షేక్ ఇస్మాయిల్, నర్సింలు, ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు పవన్, రాష్ట్ర కో-ఆప్షన్ మెంబర్ చైతన్యకుమార్, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.