కూలిన మెట్రోపొలిస్ స్వాగత ద్వారం
యువకుడి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: మెట్రోపొలిస్ సదస్సు కోసం ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం యువకుడిని బలి తీసుకుంది. ఎంతో అట్టహాసంగా మెట్రోపొలిస్ సదస్సు కోసం నగరంలో పలు ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అందులో రాయదుర్గంలోని సర్వే నంబర్ 83 వద్ద ఏర్పాటు చేసిన ద్వారం ఆదివారం కూలిపోయింది. అదే సమయంలో అటుగా వాహనంపై వస్తున్న పృథ్వీసేనారెడ్డిపై పడింది. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, నూతంకి గ్రామానికి చెందిన బి.పృథ్వీసేనారెడ్డి (29) నిజాంపేటలో నివాసముంటున్నాడు. నానక్‌రాంగూడలోని హిటాచీ కంపెనీలో హౌస్‌కీపింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని కోకాపేటలోని స్నేహితుని ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం కంపెనీకి వచ్చాడు.
విధుల్లో ఉన్న సూపర్వైజర్ శేఖర్‌కు చెందిన బైక్‌పై ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. అదేసవుయుంలో రాయదుర్గం సర్వేనంబర్ 83లోని ఎం హోటల్ సమీపంలో జీహెచ్ఎంసీ మెట్రోపొలిస్ సదస్సు కోసం ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కుప్పకూలి పృథ్వీసేనారెడ్డిపై పడింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వెంకటేశ్వరరావు (30), రవిప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు మాదాపూర్‌లోని ఇన్ఫోటెక్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతున్నారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పృథ్వీసేనారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.