నేటి నుంచి ‘సంక్షేమం’లో ‘సన్న’ అన్నం
* జిల్లా వ్యాప్తంగా 146 హాస్టళ్లలో అమలు
* రెండు,మూడు రోజుల్లో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి
ఇందూరు : ఎప్పుడెప్పుడా అని సంక్షేమ విద్యార్థులు ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చింది. ఇన్ని రోజులుగా తిన్న దొడ్డు అన్నానికి బదులు సన్న అన్నాన్ని గురువారం నుంచి తినబోతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి సంక్షేమ వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులకు సన్న బియ్యం ద్వారా అన్నం వండిపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 146 వసతి గృహాలకు సివిల్ సప్లయ్ అధికారులు సన్న బియ్యాన్ని సరఫరా చేశారు.
15,114మంది విద్యార్థులకు ప్రతి రోజు 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండి పెడతారు. అయితే నెలకు సరిపడా రేషన్ అందుబాటులో లేని సందర్భంగా ప్రస్తుతానికి వారం పది రోజులకు సరిపడే విధంగా రేషన్ సరఫరా చేశారు. మిగతా మొత్తాన్ని త్వరలో సరఫరా చేయనున్నారు. గురువారం నుంచి సన్న బియ్యం వండి పెట్టనున్న నేపథ్యంలో సంబంధిత వసతిగృహ వార్డెన్లు విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా, సరిపోయే విధంగా నాణ్యమైన భోజనం వండిపెట్టాలని, ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకు రావాలని ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అధికారింగా మంత్రిచే ప్రారంభించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డిచే ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.