కోదండరామ్‌వి మాయమాటలు
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాయమాటలు చెబుతున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల ర్యాలీ పేర వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్న కోదండరామ్ కాకిలెక్కలు చెబుతూ విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాం, ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేశాం’ అన్న అంశాలను ప్రభుత్వం గణాంక వివరాలతోసహా వెల్లడించినా కోదండరామ్ నిరుద్యోగులను తప్పుదారి పట్టించేలా మోసపూరిత మా టలు చెబుతున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్ ఎప్పుడూ అనలేదని పల్లా వివరించారు.