White elephant
-
ఇంద్రుడి ఐరావతం భూమిపై పుట్టింది! ఏడు రకాల ప్రత్యేకతలు కూడా..
పురాణాల ప్రకారం ఇంద్రుడి వాహనం ఐరావతం. అంటే తెల్లని మదపుటేనుగు.. సాధారణంగా ఏనుగులు తెలుపు రంగులో ఉండటం అత్యంత అరుదు. అలాంటిది ఇటీవల మయన్మార్‌లోని పశ్చిమ రఖినే రాష్ట్రంలో ఉన్న టౌంగప్ పట్టణంలో ఓ తెల్ల ఏనుగు పుట్టింది. ఆ తెల్ల ఏనుగు పిల్ల రెండున్నర అడుగుల ఎత్తుతో 80 కిలోల బరువు ఉంది. దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్ ప్రత్యేక వీడియో, ఫొటోలను విడుదల చేసింది. ఓ నదిలో తల్లి ఏనుగుతో కలిసి తెల్ల పిల్ల ఏనుగు స్నానం చేస్తున్న ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. మయన్మార్‌లో ఎక్కువ మంది బౌద్ధమతాన్ని పాటిస్తారు. వారి సంస్కృతిలో తెల్ల ఏనుగులను పవిత్రమైనవిగా భావిస్తారు. ఇటు హిందూ పురాణాల ప్రకారం చూసినా.. తెల్ల ఏనుగు అయిన ఐరావతం ఇంద్రుడి వాహనంగా పూజలు అందుకుంటుంది. ఏడు రకాల ప్రత్యేకతలు కూడా.. పవిత్రంగా భావించే తెల్ల ఏనుగులకు సంబంధించిన ఏడు అంశాలు ఈ పిల్ల ఏనుగులో ఉన్నట్టు మయన్మార్ అధికార వార్తా సంస్థ గ్లోబల్ న్యూలైట్ తెలిపింది. ‘‘ముత్యం రంగులో ఉండే కళ్లు, తెల్లని వెంట్రుకలు, అరటి కాండం ఆకారంలోని వెనుకభాగం, సరైన ఆకృతిలోని తోక, చర్మంపై ఆధ్యాత్మికపరమైన గుర్తులు, పెద్ద చెవులు, ముందు కాళ్లకు ఐదు చొప్పున, వెనుక కాళ్లకు నాలుగు చొప్పున గోర్లు ఉన్నాయి. ఇవన్నీ పవిత్ర ఏనుగు లక్షణాలు’’ అని పేర్కొంది. మయన్మార్‌లో ప్రస్తుతం ఆరు తెల్ల ఏనుగులు ఉన్నట్టు వెల్లడించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినా తెల్ల ఏనుగుల సంఖ్య 30 మాత్రమే కావడం గమనార్హం. వీటిలోనూ ఎక్కువ భాగం మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లోనే ఉన్నాయి. -
బుల్లెట్ ట్రెయిన్ దండగేనా..?
సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ముంబయి-అహ్మదాబాద్ మధ్య చేపట్టిన బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.బుల్లెట్ ట్రెయిన్ ప్రవేశపెడుతున్న ఈ రూట్లో ప్రస్తుతం నడిచే రైళ్లలో 40 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆర్టీఐ సమాచారం వెల్లడించింది. ముంబయి-అహ్మదాబాద్ రూట్లో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య దారుణంగా పడిపోతూ పశ్చిమ రైల్వేలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ సెక్టార్లో ఇప్పటికే పశ్చిమ రైల్వేలకు గత క్వార్టర్లో రూ 30 కోట్ల నష్టం నమోదైంది. అంటే నెలకు రూ 10 కోట్ల మేర పశ్చిమ రైల్వే నష్టాలు మూటగట్టుకుంది. బుల్లెట్ ట్రెయిన్ రాకతో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆర్టీఐ కింద సమాచారం రాబట్టిన ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకుల తాకిడి తగినంతగా లేని ఈ రూట్లో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై రూ లక్ష కోట్లు వెచ్చించాలని ప్రయత్నిస్తోందని..అందుకు తగ్గట్టుగా ఎలాంటి కసరత్తును చేపట్టలేదని గల్గాలి అన్నారు. రెడ్ సిగ్నల్ బుల్లెట్ ట్రెయిన్ పట్టాల పైకి ఎక్కిన అనంతరం అది ఎంతవరకూ ఆర్థికంగా నెగ్గుకురాగలుగుతుందనేది అనుమానమేనని అన్నారు. మరోవైపు నష్టాల భయంతో ఈ రూట్లో కొత్తగా ఎలాంటి రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు ముందుకురావడం లేదు. ఆర్థికంగా గిట్టుబాటు కాని సెక్టార్లో కేంద్రం భారీ వ్యయంతో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుకు పూనుకోవడం పట్ల గల్గాలి వంటి సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గల్గాలి ప్రశ్నలకు బదులిచ్చిన పశ్చిమ రైల్వే ముంబయి-అహ్మదాబాద్ రూట్లో 40 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయని, అహ్మదాబాద్-ముంబయి రూట్లో ఏకంగా 44 శాతం సీట్లుగా ఖాళీగా ఉంటున్నాయని వెల్లడించింది. వైట్ఎలిఫెంట్ కానుందా..? ముంబయి-అహ్మదాబాద్ మధ్య రైళ్లకు డిమాండ్ తక్కువగా ఉండటం,విమాన ప్రయాణాలు, మెరుగైన రోడ్ కనెక్టివిటీ వంటి కారణాల నేపథ్యంలో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై కేంద్రం పునరాలోచించాలని గల్గాలి కోరారు. డిమాండ్ కొరవడినందున ఈ ప్రాజెక్టు ప్రజాధనాన్ని మింగే తెల్లఏనుగులా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
భూలోక ఇంద్రజాలం!
ఇంద్రలోకాన్ని ఇంగ్లిష్‌లో ‘ఎలీజియం’ అంటారు. ఇంద్రలోకం అంటే స్వర్గలోకం. అక్కడ దేవేంద్రుడు ఉంటాడు. ఉండడమేంటి? ఆయనే కింగ్. ఆయన వెహికల్ ఐరావతం. టూ కాస్ట్లీ! తెల్ల ఏనుగు కదా! ఆ మాత్రం ఉంటుందనుకోవచ్చు. ఇక రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ.. మీకు తెలియందేముందీ.. వీళ్లంతా ఇంద్రుడి కొలువులోని అప్సరసలు! పని మీద అక్కడికి వెళ్లినవారు కాసేపు సుఖాసీనులై అప్సరసల డ్యాన్స్ చూసి సంతృప్తి నిండిన మనసుతో సెలవు తీసుకోవచ్చు. అయితే ఆ సంతృప్తి.. అప్సరసల నాట్యాన్ని తిలకించడం వల్ల కలిగిందా లేక, వాళ్లు కూర్చున్న కుర్చీ వల్ల కలిగిందా చెప్పడం కష్టం! ఎందుకంటే ఇంద్రలోకంలో ఫర్నిచర్ కూడా దేవతల లెవల్‌కు తగినట్టే ఉంటుంది. ఆ లెవల్‌కు ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు భూలోకంలో కూడా అలాంటి కుర్చీనే ఒకటి మానవులకు అందుబాటులోకి వచ్చింది! దాని పేరు ‘ఎలీజియం’! డాక్టర్ డేవిడ్ వికెట్ అనే బ్రిటిష్ బయోఇంజనీర్ ఈ కుర్చీని సృష్టించారు. కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారైన ఎలీజియంలో కూర్చుంటే గాలిలో తేలినట్టే ఉంటుంది. మన బరువు మనకు తెలీదు. జీరో గ్రావిటీ (వెయిట్‌లెస్‌నెస్) అన్నమాట. ఎలక్ట్రానిక్ జాయింట్లు, బేరింగులతో దీనిని జీరో గ్రావిటీ చెయిర్‌గా నిర్మించారు డాక్టర్ వికెట్. ఇందుకోసం ఆయన పదేళ్లు శ్రమించారు. కూర్చున్నా, పడుకున్నా ఒళ్లు తేలిపోయినట్టుండడం ఎలీజియం ప్రత్యేకత. వెన్నుభాగంలో ఒత్తిడిని కలిగించని విధంగా భంగిమను, గురుత్వాకర్షణను సమన్వయం చేస్తూ ‘ఫ్రిక్షన్‌లెస్ టెక్నాలజీ’తో ఈ అద్భుతాన్ని సాధించారట డేవిడ్ వికెట్. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే మోటార్లు, కేబుళ్లు, స్ప్రింగ్ మెకానిజాలు లేకుండా కేవలం మేథమెటిక్స్‌తో తయారైన ఇంటెలిజెంట్ డిజైన్ ఇది! పూర్తిగా హ్యాండ్‌మేడ్ అయిన ఈ కుర్చీ కేంబ్రిడ్జిలోని ఒక వర్క్‌షాపులో తయారైంది. స్కాండినేవియన్ లెదర్ కవర్‌తో చూడ ముచ్చటగా కనిపించే ఈ ‘ఎలీజియం’ ధర 26,000 డాలర్లు. మన రూపాయల్లో సుమారు లక్షా 73 వేల 400. ఈ మోడల్ కుర్చీలు ఇప్పటి వరకు ఎన్ని అమ్ముడుపోయాయో తెలియదు కానీ, ప్రస్తుతానికి 20 మాత్రమే అమ్మకానికి ఉన్నాయట! కావలసినవారు నైట్స్‌బ్రిడ్జ్ (ఇంగ్లండ్)లోని బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ షోరూమ్‌కి వెళ్లొచ్చు. ఆఫీసులకైతే ముందుగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాలట. ఇంత సుఖాన్నిచ్చే కుర్చీలను ఆఫీసుల్లో ఏర్పాటు చేస్తే ఏమైనా ఉందా? సిబ్బంది అంతా సింగిల్ సిట్టింగ్‌లో స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోరూ!