సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ముంబయి-అహ్మదాబాద్ మధ‍్య చేపట్టిన బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.బుల్లెట్ ట్రెయిన్ ప్రవేశపెడుతున్న ఈ రూట్‌లో ప్రస్తుతం నడిచే రైళ్లలో 40 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆర్‌టీఐ సమాచారం వెల్లడించింది. ముంబయి-అహ్మదాబాద్ రూట్‌లో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య దారుణంగా పడిపోతూ పశ్చిమ రైల్వేలకు భారీ నష్టం వాటిల్లుతోంది.
ఈ సెక్టార్‌లో ఇప్పటికే పశ్చిమ రైల్వేలకు గత క్వార్టర్‌లో రూ 30 కోట్ల నష్టం నమోదైంది. అంటే నెలకు రూ 10 కోట్ల మేర పశ్చిమ రైల్వే నష్టాలు మూటగట్టుకుంది. బుల్లెట్ ట్రెయిన్ రాకతో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆర్‌టీఐ కింద సమాచారం రాబట్టిన ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకుల తాకిడి తగినంతగా లేని ఈ రూట్‌లో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై రూ లక్ష కోట్లు వెచ్చించాలని ప్రయత్నిస్తోందని..అందుకు తగ్గట్టుగా ఎలాంటి కసరత్తును చేపట్టలేదని గల్గాలి అన్నారు.
రెడ్ సిగ్నల్
బుల్లెట్ ట్రెయిన్ పట్టాల పైకి ఎక్కిన అనంతరం అది ఎంతవరకూ ఆర్థికంగా నెగ్గుకురాగలుగుతుందనేది అనుమానమేనని అన్నారు. మరోవైపు నష్టాల భయంతో ఈ రూట్‌లో కొత్తగా ఎలాంటి రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు ముందుకురావడం లేదు. ఆర్థికంగా గిట్టుబాటు కాని సెక్టార్‌లో కేంద్రం భారీ వ్యయంతో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుకు పూనుకోవడం పట్ల గల్గాలి వంటి సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గల్గాలి ప్రశ్నలకు బదులిచ్చిన పశ్చిమ రైల్వే ముంబయి-అహ్మదాబాద్ రూట్‌లో 40 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయని, అహ్మదాబాద్-ముంబయి రూట్‌లో ఏకంగా 44 శాతం సీట్లుగా ఖాళీగా ఉంటున్నాయని వెల్లడించింది.
వైట్‌ఎలిఫెంట్ కానుందా..?
ముంబయి-అహ్మదాబాద్ మధ్య రైళ్లకు డిమాండ్ తక్కువగా ఉండటం,విమాన ప్రయాణాలు, మెరుగైన రోడ్ కనెక్టివిటీ వంటి కారణాల నేపథ్యంలో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై కేంద్రం పునరాలోచించాలని గల్గాలి కోరారు. డిమాండ్ కొరవడినందున ఈ ప్రాజెక్టు ప్రజాధనాన్ని మింగే తెల్లఏనుగులా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment