దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా బుల్లెట్‌రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కుతుందని చెప్పారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈమేరకు వివరాలు వెల్లడించారు.
‘బుల్లెట్ రైలు కోసం 500కి.మీల పొడవైన ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. కానీ, భారత్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 8-10 ఏళ్లలోనే పూర్తిచేయనుంది. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కనుంది. మొదట గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నాం. 2028 నాటికి ముంబయి-అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’ అని మంత్రి చెప్పారు.
దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందనట్లు మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయినట్లు సమాచారం. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment