ట్రంపైనా, కుక్కయినా జుట్టు సైన్స్ ఒక్కటే
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కైనా, కుక్కకైనా వయసు మీరక ముందే జుట్టు రంగు తెల్లగా లేదా పల్లగా మారిందంటే అందుకు మానసిక ఒత్తిడి లేదా ఆందోళనే కారణమని కొలరాడో స్టేట్ యూనివర్శిటీలో యానిమల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టెంపుల్ గ్రాండిన్ ‘అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్’ జర్నల్‌లో పేర్కొన్నారు.
డెన్వర్‌లోని కెనైన్ ఎడ్యుకేషన్ సెంటర్ యజమాని, జంతువుల ప్రవర్తనపై అధ్యయనం జరిపే పరిశోధకురాలు కమిల్లే కింగ్ కొన్నేళ్ల ఏళ్లక్రితం తన వద్దకు వచ్చారని, మాటల సందర్భంలో మానసిక ఆందోళనకు గురవుతున్న కుక్కలు జుట్టు తెల్లబడుతోందని చెప్పారని తెలిపారు. అప్పుడు తనకెందుకో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన బిల్ క్లింటన్, జార్జి బుష్, ఒబామా లాంటి వారి జుట్టు వయస్సు మీరక ముందే తెల్లబడిన విషయం గుర్తొచ్చిందని, అందుకని కుక్కల జుట్టుకు, వాటి ప్రవర్తన, మానసిక స్థితికి ఉన్న సంబంధం ఏమిటో అధ్యయనం కొనసాగించాల్సిందిగా కోరానని చెప్పారు. తన సూచన మేరకు కమిల్లే 400 కుక్కలపై నాలుగేళ్లపాటు అధ్యయనం చేశారని, తాను ఊహించినట్లే మానసిక ఆందోళనకు గురైన కుక్కల జుట్టు తొందరగా తెల్లబడినట్లు ఆ అధ్యయనంలో తేలిందని గ్రాండిన్ వివరించారు.
కుక్కలను ఎక్కువ గంటలు గదిలో బంధించడం వల్ల లేదా ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లడం వల్ల, వేళకు బయటకు తీసుకొని పోకపోవడం లాంటి కారణాల వల్ల వాటి జుట్టు తెల్లపడుతుందని, వాటి మానసిక ఒత్తిడి తీవ్రతను బట్టి జుట్టు రంగుమారే తీవ్రత ఆధారపడి ఉంటుందని గ్రాండిన్ తెలిపారు. మానసిక ఒత్తిడికి గురైన కొన్ని కుక్కల్లో మాత్రం వాటి జుట్టు తెల్లబడలేదని, అందుకు వాటి జన్యువులు కారణం కావచ్చని అన్నారు. ఈ విషయంలో మనుషులకు, కుక్కలకు పెద్ద తేడా ఉండదు కనుక మానసిక ఒత్తిళ్ల కారణంగానే వారి జుట్టు కూడా తెల్లబడుతుండవచ్చని అన్నారు. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని అన్నారు.
మానవ శరీరంలోని వర్ణద్రవ్యంలో (పిగ్మెంట్)లో మెలానిన్ శాతం తగ్గిపోవడం వల్ల జుట్టు రంగు నలుపు నుంచి తెలుపుగా మారుతుంది. వద్ధాప్యంలో మెలానిన్ సహజసిద్ధంగా మనుషుల్లో, ముఖ్యంగా మగవాళ్లలో తగ్గుతుందికనుక జట్టు రంగు మారుతుంది. మెలానిన్ త్వరగా తగ్గిపోవడానికి, మానసిక ఒత్తిడికి ఉండే ప్రత్యక్ష సంబంధం ఏమిటో పరిశోధనలో తేల్చాలి.