The white tiger
-
ది వైట్ టైగర్ డ్రైవర్స్
‘పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం తెల్లవాళ్లది కాదు.. పసిమి ఛాయ, గోధుమ వర్ణం మనుషులదే!’ అనేది అశోక్ భావన. ప్రపంచీకరణ తర్వాత పాశ్చాత్య దేశాల సాంకేతిక అవసరాలను తీర్చేందుకు బెంగళూరు హబ్‌గా మారుతున్న సమయంలో అనుకుంటాడు అలా. అమెరికాలో చదువుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఉన్నత కులస్తుడు, భూస్వామ్య కుటుంబీకుడు అశోక్. తన చదువు, తన ముందు తరాలు ఆర్జించి పెట్టిన ఆస్తిలోని వాటానే పెట్టుబడిగా పెట్టి బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటాడు. అమెరికాలో పెరిగిన అశోక్ ప్రేమించి పెళ్లాడిన పింకి కూడా అతనికి అండగా నిలబడుతుంది. కాని అశోక్ ఆలోచనను అతని భూస్వామి తండ్రి వ్యతిరేకిస్తాడు. ఘర్షణ పడ్తుంటాడు అశోక్. దాంతో ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఇమడలేక సొంతూరు (ధన్‌బాద్) నుంచి ఢిల్లీకి మకాం మారుస్తారు ఆ భార్యాభర్తలు. వాళ్లకు డ్రైవర్‌గా వెళ్తాడు బలరామ్ హల్వాయి అనే యువకుడు. ఆ క్రమంలోనే ఏదో వ్యాపార లావాదేవీ కోసం తమ నియోజక వర్గ నేతకు ముడుపులు చెల్లించే హైరానాలో ఉంటుంది అశోక్ కుటుంబం. ఆ బాధ్యతను అశోక్‌కి అప్పజెప్తారు తండ్రి, సోదరుడు. అలాగని అశోక్ ఉదంతంతోనూ మొదలవదు. అసలు అతను కథానాయకుడే కాదు. కథానాయకుడిని నడిపించినవాడు. మరి హీరో.. ది వైట్ టైగర్.. బలరామ్ హల్వాయి. అసలు కథ... నిమ్నకులానికి చెందిన యువకుడు బలరామ్ హల్వాయి (ఆదర్శ్ గౌరవ్). చిన్న టీ కొట్టులో పనిచేస్తుంటారు బలరామ్ తండ్రి, అన్న. టీ కాచే బొగ్గుల కుంపటి కోసం బొగ్గులు కొట్టే వెట్టిలో మసిబారుతుంటాయి వాళ్ల బతుకులు. బలరామ్ జెమ్. తరానికి ఒక్కసారే పుట్టే వైట్ టైగర్ లాంటివాడు. చదువంటే ప్రాణం. ఆంగ్లం అతని నాలుక చివర పలుకుతుంటే లెక్కలు వేళ్ల కొసల్లో ఆడుకుంటూంటాయి. అంతటి చురుకైన ఆ పిల్లాడంటే మాష్టారికి వల్లమాలిన అభిమానం. తండ్రి, అన్నల్లా కాకుండా ‘బలరామ్ ఢిల్లీలో చదువుకోవాల్సిన వాడు..’ అని ఆశపడ్తుంటాడు. అయితే బలరామ్ జీవితం ఆ మాష్టారు ఆశించినట్టు సాగదు. తండ్రి టీబీతో మరణిస్తే నానమ్మ ఆ బాలుడిని తీసుకెళ్లి బొగ్గులు కొట్టే పనిలో పెడ్తుంది. అయిష్టంగానే ఆ పనిచేస్తూ పెద్దవాడవుతాడు. అప్పుడు వస్తాడు అశోక్ (రాజ్‌కుమార్ రావు) అమెరికా నుంచి పింకీ (ప్రియాంక చోప్రా)తో సహా ఆ ఊరికి. అతణ్ణి చూడగానే బలరామ్లో ఒక ఉత్సాహం. నా యజమాని ఇతనే అనుకుంటాడు. అతని కారుకి డ్రైవర్‌గా మారాలనుకుంటాడు. కళ్లముందే ఇరవైనాలుగ్గంటలూ కష్టపడుతూ కనిపించాలి తన మనవళ్లు అనే మొండి నిర్ణయంతో ఉన్న నానమ్మను ఒప్పించి డ్రైవింగ్ నేర్చుకుంటాడు. తన ఊరు లక్ష్మణ్‌గఢ్ నుంచి ధన్‌బాద్ వెళ్తాడు. అప్పటికే అశోక్‌కి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తిని తెలివిగా ఆ ఉద్యోగంలోంచి తప్పించి వాళ్లతోపాటే తానూ ఢిల్లీకి చేరుతాడు. అశోక్ తనను స్నేహితుడిలా చూడడాన్ని ఇబ్బంది పడ్తుంది బలరామ్ బానిస మనసు. అతనిలోని ఆ ఆలోచనను మార్చాలని చూస్తుంది పింకి. డ్రైవర్ జీవితాన్ని శాశ్వతం చేసుకోవద్దని.. మెరుగైన బతుక్కోసం ప్రయత్నించమని చెప్తుంది. ఆ టైమ్‌లోనే అశోక్ తన బెంగళూరు కల గురించి చెప్తాడు బలరామ్‌తో. తన యజమాని కోరిక త్వరగా నెరవేరాలని.. అలా తన జీవితమూ బాగుపడాలని కోరుకుంటూంటాడు.. ఆ దిశగా అశోక్‌ను రెచ్చగొడ్తుంటాడు కూడా. ఒకరోజు.. పింకీ బర్త్‌డే వస్తుంది. మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ పిల్లాడి చావుకు కారణమవుతుంది. దాంతో కారులో ఉన్న ఆ ముగ్గురూ బెదిరిపోతారు. అశోక్ పెద్దవాళ్లకు తెలిసి.. ఆ నేరాన్ని బలరామ్ మీద వేసుకోమని.. పరిహారంగా వాళ్ల కుటుంబానికి డబ్బులిస్తామని చెప్తారు. అమాయకుడైన బలరామ్‌ను బలి చేయొద్దంటుంది పింకి. ఈ విషయంలో ఆ కుటుంబసభ్యులకు, పింకీకి గొడవలవుతాయి. ఒక రాత్రి అశోక్‌కి చెప్పకుండా అమెరికా వెళ్లిపోతుంది పింకి. అప్పుడు మళ్లీ బలరామే అతనికి దగ్గరుండి సేవలు చేసి.. అతని బెంగళూరు కల తడి ఆరిపోకుండా చూస్తుంటాడు. కాని కుదరదు. ‘పేదవాళ్లు ధనికులవ్వాలంటే అదృష్టమన్నా పట్టాలి.. నేరాలన్నా చేయాలి’.. బలరామ్‌కు అనుభవం నేర్పిన పాఠం అది. అశోక్ ఆలోచన రూపంలో అదృష్టం పట్టే చాన్స్ లేదని తేలుతుంది. అందుకే ఒకరోజు రాజకీయ నేతకు ముడుపులు చెల్లించడానికి డబ్బు తీసుకొని వెళ్తున్న అశోక్‌ను హత్య చేసి ఆ డబ్బు తీసుకొని బెంగళూరు పారిపోతాడు. తన కోసం గాలిస్తున్న పోలీసులకు లంచమిచ్చి ‘వాంటెడ్’ జాబితా నుంచి తన పేరు తొలగించుకుంటాడు. అక్కడ.. ‘ది వైట్ టైగర్ డ్రైవర్స్’ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలకు క్యాబ్ సర్వీస్నిచ్చే ట్యాక్సీ కంపెనీ పెడతాడు. తన యజమానిలా కాకుండా తన కింది ఉద్యోగస్తులతో స్నేహంగా మసలుకుంటుంటాడు. వాళ్లు యాక్సిడెంట్స్ చేస్తే యజమానిగా ఆ నేరాన్ని తన మీద వేసుకుని బాధితుల కుటుంబానికి అండగా నిలబడ్తాడు. అలా అశోక్ చెప్పిన అంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రాన్ని ఒంట బట్టించుకొని బొగ్గులు కొట్టే పనివాడి నుంచి క్యాబ్ కంపెనీ యజమానిగా ఎదుగుతాడు బలరామ్ హల్వాయి. పారసైట్ సినిమాను పోలి ఉందని సినీ విమర్శకులు చెప్తున్నా.. మన సాంఘిక, ఆర్థిక నేపథ్యాన్నే ప్రతిబింబిస్తుందీ సినిమా. ‘మన దేశంలో ఎన్నో కులాలున్నాయంటారు కాని మన దగ్గరున్నవి రెండే రెండు పొట్ట ఉన్నవాళ్లు.. పొట్ట లేని వాళ్లు (ధనికులు, పేదలు)’ అంటూ హీరో చేత చెప్పించినా ఇక్కడి కుల, మత, ఆర్థిక, స్త్రీ, పురుష అంతరాలన్నిటినీ అంతర్లీనంగా చర్చిస్తుంది ‘ ది వైట్ టైగర్’. ది వైట్ టైగర్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమా. దర్శకుడు రమిన్ బెహరానీ అనే ఇరానియన్ అమెరికన్. అరవింద్ ఆడిగ రాసిన ‘ది వైట్ టైగర్’ అనే నవల ఆధారంగా వచ్చిన వెబ్‌ఫ్లిక్స్. ఈ పుస్తకానికి 2008లో బుకర్ ప్రైజ్ వచ్చింది. -
ఆస్కార్స్‌కు ప్రియాంక?
ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. గతంలో ఓసారి ఆస్కార్ అవార్డులకు అతిథిగా వెళ్లారామె. తాజాగా ఆస్కార్‌ను ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నారని సమాచారం. ప్రియాంకా చోప్రా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వైట్ టైగర్’. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ సినిమా చేస్తున్నారామె. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ వేడుకలో ఈ చిత్రం తరఫున ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోటు దక్కించుకునే అవకాశం ఉందని టాక్. ఈ లిస్ట్‌లో ఆల్రెడీ హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రీప్స్, క్రిస్టిన్ స్కాట్ థామస్, ఒలీవియా కోల్మన్ ఉండొచ్చని తెలిసింది. మరి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను ప్రియాంక గెలుచుకుంటారా? వేచి చూడాలి. ఇండో–ఆస్ట్రేలియన్ రచయిత అరవింద్ అడిగి రచించిన ‘ది వైట్ టైగర్స్’ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలవుతుంది. -
వాళ్ల పరిస్థితి ఎలా ఉందో: ప్రియాంక
న్యూఢిల్లీ : కాలుష్యం కారణంగా షూటింగ్లో పాల్గొనడం చాలా కష్టంగా ఉందని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు. ప్రస్తుతం ఆమె ‘ది వైట్ టైగర్ ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత అరవింద్ అడిగా రచించిన ‘ది వైట్ టైగర్’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమైంది. షూటింగ్లో పాల్గొన్న ప్రియాంక.. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మాస్క్, కళ్లద్దాలు ధరించి సెట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ కాలుష్యం కారణంగా షూటింగ్లో పాల్గొనడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇక్కడ నివసిస్తున్నవారి పరిస్థితి తలచుకుంటే చాలా భయంగా ఉంది. కాలుష్య కోరల నుంచి కాపాడుకోవడానికి మనకి మనకి మాస్క్‌లు ఉన్నాయి. కానీ ఇల్లు లేని నిరాశ్రయులు అష్టకష్టాలు పడుతూ రోడ్ల మీద నివసిస్తూ...ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రార్థించండి’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఇక ‘ది వైట్ టైగర్’ సినిమా నవలా ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. 2008లో అరవింద్ అడిగా రచించిన ‘ ది వైట్ టైగర్ ’ నవల అదే సంవత్సరంలో బుకర్ ప్రైజ్‌ని సొంతం చేసుకుంది. ఓ గ్రామంలో టీ కొట్టులో పనిచేసే వ్యక్తి...సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎలా ఎదిగాడు అన్న నేపథ్యంలో రచించిన కథ ఇది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రియాంకతో పాటు ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. View this post on Instagram Shoot days for #thewhitetiger. It’s so hard to shoot here right now that I can’t even imagine what it must be like to live here under these conditions. We r blessed with air purifiers and masks. Pray for the homeless. Be safe everyone. #airpollution #delhipollution😷 #weneedsolutions #righttobreathe A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Nov 3, 2019 at 8:52am PST -
హాయ్... హ్యాపీ బర్త్ డే..!
ఆరిలోవ : హ్యాపీ బర్త్ డే ఎవరికనుకుంటున్నారా? ఇంకెవరికి ఈ బుజ్జి తెల్లపులులకే...! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పుట్టినరోజు జరుపుకోవడం సాధారణమైన విషయం. కొందరైతే తమ ఇంట్లో పెంచుకొనే కుక్క పిల్లలకు సైతం పుట్టిన రోజు పండగ జరుపుతారు. మరి వన్యప్రాణులకు పుట్టినరోజు వేడుకలు ఎవరు జరుపుతారు? తెలుసుకోవాలంటే...! బుధవారం జూ పార్కుకు వెళ్లండి. అక్కడ తెల్ల పులులకు జూ అధికారులు పుట్టినరోజు వేడుక చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... జూలో శిరీష్(తండ్రి), కుమారి(తల్లి) అనే పేర్లుగల తెల్ల పులులు 12 ఏళ్లగా ఉన్నాయి. కుమారి 2010 మార్చిలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో పుట్టిన వెంటనే రెండు మరణించినా మిగిలిన మూడు ఆరోగ్యంగా ఉన్నాయి. వాటిలో రెండింటిని రెండేళ్ల క్రితం జీబ్రాలను ఇక్కడ తీసుకొచ్చినందుకు బదులుగా మలేసియా జూకి తరలించారు. మరోసారి కుమారి (తెల్లపులి) 2012 మార్చి 16న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో మూడు ఆడవి, ఒకటి మగది ఉన్నాయి. జూ అధికారులు వాటికి విజయ్, సోనా, బేతని, సావిత్రి అని పేర్లు పెట్టారు. వాటిలో సావిత్రిని ఖఢ్గమృగం తీసుకొచ్చిందుకు బదులుగా కాన్పూర్ తరలించారు. మిగిలిన మూడింటికి ఐదేళ్లు పూర్తి కావడంతో జూ అధికారులు జూలో వాటి ఎన్‌క్లోజర్ ఆవరణలో బుధవారం పుట్టినరోజు వేడుక జరపనున్నారు. వినడానికి వింతగా ఉన్నా జూ అధికారులు మాత్రం మొదటిసారిగా జంతువులకు పుట్టినరోజు పండగ చేయడం విశేషం. అయితే మనం జన్మదినోత్సవాలు జరుపుకొని విందూ వినోదాలు పెట్టినట్లు అక్కడ భోజనాలూ..అవీ ఉండవండోయ్.. సరదాగా చూసి రావడానికైతే వెళ్లండి.. గిఫ్టులూ.. అవీ.. తీసుకెళ్లక్కరలేదండోయ్.. -
ఢిల్లీ జూలో పులి పంజా
ఎన్‌క్లోజర్‌లోకి దూకిన యువకుడిని చంపిన తెల్లపులి న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతుప్రదర్శనశాలలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. జూలోని తెల్లపులి ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మక్సూద్ (20) అనే మానసిక పరిస్థితి సరిగాలేదని భావిస్తున్న యువకుడిపై విజయ్ అనే ఏడేళ్ల మగ పులి పదేపదే పంజా విసురుతూ మెడ కొరికి చంపేసింది. ఢిల్లీ జూ చరిత్రలో తొలిసారి చోటుచేసుకున్న ఈ దారుణం జూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. అయితే యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించాడనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్‌క్లోజర్ పక్కనున్న గోడపై అతను వంగడంతో జారి లోపలకు పడ్డాడని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలపగా మరికొందరు సాక్షులు, జూ అధికారులు మాత్రం అతను గోడకన్నా ముందు ఉన్న ఇనుప కంచెను దాటి ఎన్‌క్లోజర్‌లోకి దూకాడని పేర్కొన్నారు. అతను కంచె దాటి వచ్చి గోడ దూకేందుకు రెండు, మూడుసార్లు ప్రయత్నించాడని, అప్పుడు అక్కడున్న సెక్యూరిటీ గార్డు వారించాడని జూ క్యురేటర్ ఆర్.కె. ఖాన్ తెలిపారు. కానీ ఈలోగా కొందరు స్కూలు విద్యార్థులు అక్కడకు చేరుకోవడం వల్ల గార్డు దృష్టి మళ్లడంతో యువకుడు 18 అడుగుల లోతున ఉన్న టైగర్ ఎన్‌క్లోజర్‌లోని పడిపోయాడని క్యూరేటర్ ఖాన్ తెలిపారు. ఈ ఘటన సుమారు మధ్యాహ్నం 1:00 గంట సమయంలో ఆ యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోగానే పరుగున అతని దగ్గరకు వచ్చిన పులి కొన్ని నిమిషాలపాటు అతన్ని ఏమీ చేయలేదు. పులి సమీపంలో నిలబడినప్పుడు ఆ యువకుడు ముడుచుకొని కూర్చుని రెండు చేతులతో దండం పెడుతూ కనిపించాడు. అయితే పులి దృష్టి మళ్లించేందుకు ఎన్‌క్లోజర్ వెలుపల నుంచి పులిపై కొందరు రాళ్లు విసరడం, సెక్యూరిటీ గార్డులు కంచెను చప్పుడు చేస్తూ అతణ్ణి బయటకు రావాలంటూ సంకేతాలిచ్చారు. కానీ ఆ చప్పుళ్లకు ఒక్కసారిగా పులి పేట్రేగిపోయింది. అందరూ చూస్తుండగానే యువకుడి మెడను నోటకరుచుకుంటూ ఈడ్చుకెళ్లింది. సెక్యూరిటీ గార్డుల వద్ద ట్రాంక్వెలైజర్ గన్లుగానీ (జంతువులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ఉపయోగించే తుపాకీలు) వాకీటాకీలుగానీ లేకపోవడంతో వారు నిస్సహాయంగా ఈ దారుణాన్ని చూస్తుండటం తప్ప ఏమీ చేయలేకపోయారు. పులి నోట కరుచుకున్న తరువాత అతను చనిపోయేంతవరకు ఎన్‌క్లోజర్‌లో విచక్షణారహితంగా పులి స్వైరవిహారం చేసిందని ఈ ఘటన ను చిత్రీకరించిన ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వరకూ జూ అధికారులు, పోలీసులు యువకుని మృతదేహాన్ని బయటకు తీసుకురాలేకపోయారు. కాగా మక్సూద్ మతిస్థిమితం ఉన్నవాడు కాడని.. స్కూల్ మానేశాడని.. ఇంట్లో చెప్పకుండా అప్పుడప్పుడూ వెళ్లిపోతుంటాడని అతని తండ్రి చెప్పారు.