‘పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం తెల్లవాళ్లది కాదు.. పసిమి ఛాయ, గోధుమ వర్ణం మనుషులదే!’ అనేది అశోక్ భావన. ప్రపంచీకరణ తర్వాత పాశ్చాత్య దేశాల సాంకేతిక అవసరాలను తీర్చేందుకు బెంగళూరు హబ్‌గా మారుతున్న సమయంలో అనుకుంటాడు అలా. అమెరికాలో చదువుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఉన్నత కులస్తుడు, భూస్వామ్య కుటుంబీకుడు అశోక్. తన చదువు, తన ముందు తరాలు ఆర్జించి పెట్టిన ఆస్తిలోని వాటానే పెట్టుబడిగా పెట్టి బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలనుకుంటాడు. అమెరికాలో పెరిగిన అశోక్ ప్రేమించి పెళ్లాడిన పింకి కూడా అతనికి అండగా నిలబడుతుంది. కాని అశోక్ ఆలోచనను అతని భూస్వామి తండ్రి వ్యతిరేకిస్తాడు. ఘర్షణ పడ్తుంటాడు అశోక్. దాంతో ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఇమడలేక సొంతూరు (ధన్‌బాద్) నుంచి ఢిల్లీకి మకాం మారుస్తారు ఆ భార్యాభర్తలు. వాళ్లకు డ్రైవర్‌గా వెళ్తాడు బలరామ్ హల్వాయి అనే యువకుడు. ఆ క్రమంలోనే ఏదో వ్యాపార లావాదేవీ కోసం తమ నియోజక వర్గ నేతకు ముడుపులు చెల్లించే హైరానాలో ఉంటుంది అశోక్ కుటుంబం. ఆ బాధ్యతను అశోక్‌కి అప్పజెప్తారు తండ్రి, సోదరుడు. అలాగని అశోక్ ఉదంతంతోనూ మొదలవదు. అసలు అతను కథానాయకుడే కాదు. కథానాయకుడిని నడిపించినవాడు. మరి హీరో.. ది వైట్ టైగర్.. బలరామ్ హల్వాయి.
అసలు కథ...
నిమ్నకులానికి చెందిన యువకుడు బలరామ్ హల్వాయి (ఆదర్శ్ గౌరవ్). చిన్న టీ కొట్టులో పనిచేస్తుంటారు బలరామ్ తండ్రి, అన్న. టీ కాచే బొగ్గుల కుంపటి కోసం బొగ్గులు కొట్టే వెట్టిలో మసిబారుతుంటాయి వాళ్ల బతుకులు. బలరామ్ జెమ్. తరానికి ఒక్కసారే పుట్టే వైట్ టైగర్ లాంటివాడు. చదువంటే ప్రాణం. ఆంగ్లం అతని నాలుక చివర పలుకుతుంటే లెక్కలు వేళ్ల కొసల్లో ఆడుకుంటూంటాయి. అంతటి చురుకైన ఆ పిల్లాడంటే మాష్టారికి వల్లమాలిన అభిమానం. తండ్రి, అన్నల్లా కాకుండా ‘బలరామ్ ఢిల్లీలో చదువుకోవాల్సిన వాడు..’ అని ఆశపడ్తుంటాడు. అయితే బలరామ్ జీవితం ఆ మాష్టారు ఆశించినట్టు సాగదు. తండ్రి టీబీతో మరణిస్తే నానమ్మ ఆ బాలుడిని తీసుకెళ్లి బొగ్గులు కొట్టే పనిలో పెడ్తుంది. అయిష్టంగానే ఆ పనిచేస్తూ పెద్దవాడవుతాడు.
అప్పుడు వస్తాడు అశోక్ (రాజ్‌కుమార్ రావు) అమెరికా నుంచి పింకీ (ప్రియాంక చోప్రా)తో సహా ఆ ఊరికి. అతణ్ణి చూడగానే బలరామ్‌లో ఒక ఉత్సాహం. నా యజమాని ఇతనే అనుకుంటాడు. అతని కారుకి డ్రైవర్‌గా మారాలనుకుంటాడు. కళ్లముందే ఇరవైనాలుగ్గంటలూ కష్టపడుతూ కనిపించాలి తన మనవళ్లు అనే మొండి నిర్ణయంతో ఉన్న నానమ్మను ఒప్పించి డ్రైవింగ్ నేర్చుకుంటాడు. తన ఊరు లక్ష్మణ్‌గఢ్ నుంచి ధన్‌బాద్ వెళ్తాడు. అప్పటికే అశోక్‌కి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తిని తెలివిగా ఆ ఉద్యోగంలోంచి తప్పించి వాళ్లతోపాటే తానూ ఢిల్లీకి చేరుతాడు. అశోక్ తనను స్నేహితుడిలా చూడడాన్ని ఇబ్బంది పడ్తుంది బలరామ్ బానిస మనసు. అతనిలోని ఆ ఆలోచనను మార్చాలని చూస్తుంది పింకి. డ్రైవర్ జీవితాన్ని శాశ్వతం చేసుకోవద్దని.. మెరుగైన బతుక్కోసం ప్రయత్నించమని చెప్తుంది. ఆ టైమ్‌లోనే అశోక్ తన బెంగళూరు కల గురించి చెప్తాడు బలరామ్‌తో. తన యజమాని కోరిక త్వరగా నెరవేరాలని.. అలా తన జీవితమూ బాగుపడాలని కోరుకుంటూంటాడు.. ఆ దిశగా అశోక్‌ను రెచ్చగొడ్తుంటాడు కూడా.
ఒకరోజు.. పింకీ బర్త్‌డే వస్తుంది. మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ పిల్లాడి చావుకు కారణమవుతుంది. దాంతో కారులో ఉన్న ఆ ముగ్గురూ బెదిరిపోతారు. అశోక్ పెద్దవాళ్లకు తెలిసి.. ఆ నేరాన్ని బలరామ్ మీద వేసుకోమని.. పరిహారంగా వాళ్ల కుటుంబానికి డబ్బులిస్తామని చెప్తారు. అమాయకుడైన బలరామ్‌ను బలి చేయొద్దంటుంది పింకి. ఈ విషయంలో ఆ కుటుంబసభ్యులకు, పింకీకి గొడవలవుతాయి. ఒక రాత్రి అశోక్‌కి చెప్పకుండా అమెరికా వెళ్లిపోతుంది పింకి. అప్పుడు మళ్లీ బలరామే అతనికి దగ్గరుండి సేవలు చేసి.. అతని బెంగళూరు కల తడి ఆరిపోకుండా చూస్తుంటాడు. కాని కుదరదు.
‘పేదవాళ్లు ధనికులవ్వాలంటే అదృష్టమన్నా పట్టాలి.. నేరాలన్నా చేయాలి’.. బలరామ్‌కు అనుభవం నేర్పిన పాఠం అది. అశోక్ ఆలోచన రూపంలో అదృష్టం పట్టే చాన్స్ లేదని తేలుతుంది. అందుకే ఒకరోజు రాజకీయ నేతకు ముడుపులు చెల్లించడానికి డబ్బు తీసుకొని వెళ్తున్న అశోక్‌ను హత్య చేసి ఆ డబ్బు తీసుకొని బెంగళూరు పారిపోతాడు. తన కోసం గాలిస్తున్న పోలీసులకు లంచమిచ్చి ‘వాంటెడ్’ జాబితా నుంచి తన పేరు తొలగించుకుంటాడు. అక్కడ.. ‘ది వైట్ టైగర్ డ్రైవర్స్’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు క్యాబ్ సర్వీస్‌నిచ్చే ట్యాక్సీ కంపెనీ పెడతాడు. తన యజమానిలా కాకుండా తన కింది ఉద్యోగస్తులతో స్నేహంగా మసలుకుంటుంటాడు. వాళ్లు యాక్సిడెంట్స్ చేస్తే యజమానిగా ఆ నేరాన్ని తన మీద వేసుకుని బాధితుల కుటుంబానికి అండగా నిలబడ్తాడు. అలా అశోక్ చెప్పిన అంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రాన్ని ఒంట బట్టించుకొని బొగ్గులు కొట్టే పనివాడి నుంచి క్యాబ్ కంపెనీ యజమానిగా ఎదుగుతాడు బలరామ్ హల్వాయి.
పారసైట్ సినిమాను పోలి ఉందని సినీ విమర్శకులు చెప్తున్నా.. మన సాంఘిక, ఆర్థిక నేపథ్యాన్నే ప్రతిబింబిస్తుందీ సినిమా. ‘మన దేశంలో ఎన్నో కులాలున్నాయంటారు కాని మన దగ్గరున్నవి రెండే రెండు పొట్ట ఉన్నవాళ్లు.. పొట్ట లేని వాళ్లు (ధనికులు, పేదలు)’ అంటూ హీరో చేత చెప్పించినా ఇక్కడి కుల, మత, ఆర్థిక, స్త్రీ, పురుష అంతరాలన్నిటినీ అంతర్లీనంగా చర్చిస్తుంది ‘ ది వైట్ టైగర్’.
ది వైట్ టైగర్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమా. దర్శకుడు రమిన్ బెహరానీ అనే ఇరానియన్ అమెరికన్. అరవింద్ ఆడిగ రాసిన ‘ది వైట్ టైగర్’ అనే నవల ఆధారంగా వచ్చిన వెబ్‌ఫ్లిక్స్. ఈ పుస్తకానికి 2008లో బుకర్ ప్రైజ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment