ఆరిలోవ : హ్యాపీ బర్త్ డే ఎవరికనుకుంటున్నారా? ఇంకెవరికి ఈ బుజ్జి తెల్లపులులకే...! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పుట్టినరోజు జరుపుకోవడం సాధారణమైన విషయం. కొందరైతే తమ ఇంట్లో పెంచుకొనే కుక్క పిల్లలకు సైతం పుట్టిన రోజు పండగ జరుపుతారు. మరి వన్యప్రాణులకు పుట్టినరోజు వేడుకలు ఎవరు జరుపుతారు? తెలుసుకోవాలంటే...! బుధవారం జూ పార్కుకు వెళ్లండి. అక్కడ తెల్ల పులులకు జూ అధికారులు పుట్టినరోజు వేడుక చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
జూలో శిరీష్(తండ్రి), కుమారి(తల్లి) అనే పేర్లుగల తెల్ల పులులు 12 ఏళ్లగా ఉన్నాయి. కుమారి 2010 మార్చిలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో పుట్టిన వెంటనే రెండు మరణించినా మిగిలిన మూడు ఆరోగ్యంగా ఉన్నాయి. వాటిలో రెండింటిని రెండేళ్ల క్రితం జీబ్రాలను ఇక్కడ తీసుకొచ్చినందుకు బదులుగా మలేసియా జూకి తరలించారు. మరోసారి కుమారి (తెల్లపులి) 2012 మార్చి 16న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో మూడు ఆడవి, ఒకటి మగది ఉన్నాయి. జూ అధికారులు వాటికి విజయ్, సోనా, బేతని, సావిత్రి అని పేర్లు పెట్టారు. వాటిలో సావిత్రిని ఖఢ్గమృగం తీసుకొచ్చిందుకు బదులుగా కాన్పూర్ తరలించారు. మిగిలిన మూడింటికి ఐదేళ్లు పూర్తి కావడంతో జూ అధికారులు జూలో వాటి ఎన్‌క్లోజర్ ఆవరణలో బుధవారం పుట్టినరోజు వేడుక జరపనున్నారు. వినడానికి వింతగా ఉన్నా జూ అధికారులు మాత్రం మొదటిసారిగా జంతువులకు పుట్టినరోజు పండగ చేయడం విశేషం. అయితే మనం జన్మదినోత్సవాలు జరుపుకొని విందూ వినోదాలు పెట్టినట్లు అక్కడ భోజనాలూ..అవీ ఉండవండోయ్.. సరదాగా చూసి రావడానికైతే వెళ్లండి.. గిఫ్టులూ.. అవీ.. తీసుకెళ్లక్కరలేదండోయ్..
హాయ్... హ్యాపీ బర్త్ డే..!
Published Wed, Mar 16 2016 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement
Advertisement