ఢిల్లీ జూలో పులి పంజా | White Tiger Attacks And Kills Man Who Fell Into Its Enclosure at Delhi Zoo | Sakshi
Sakshi News home page

ఢిల్లీ జూలో పులి పంజా

Published Wed, Sep 24 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

ఢిల్లీ జూలో పులి పంజా

ఢిల్లీ జూలో పులి పంజా

ఎన్‌క్లోజర్‌లోకి దూకిన యువకుడిని చంపిన తెల్లపులి
 
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతుప్రదర్శనశాలలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. జూలోని తెల్లపులి ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మక్సూద్ (20) అనే  మానసిక పరిస్థితి సరిగాలేదని భావిస్తున్న యువకుడిపై విజయ్ అనే ఏడేళ్ల మగ పులి పదేపదే పంజా విసురుతూ మెడ కొరికి చంపేసింది. ఢిల్లీ జూ చరిత్రలో తొలిసారి చోటుచేసుకున్న ఈ దారుణం జూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. అయితే యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించాడనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్‌క్లోజర్ పక్కనున్న గోడపై అతను వంగడంతో జారి లోపలకు పడ్డాడని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలపగా మరికొందరు సాక్షులు, జూ అధికారులు మాత్రం అతను గోడకన్నా ముందు ఉన్న ఇనుప కంచెను దాటి ఎన్‌క్లోజర్‌లోకి దూకాడని పేర్కొన్నారు. అతను కంచె దాటి వచ్చి గోడ దూకేందుకు రెండు, మూడుసార్లు ప్రయత్నించాడని, అప్పుడు అక్కడున్న సెక్యూరిటీ గార్డు వారించాడని జూ క్యురేటర్ ఆర్.కె. ఖాన్ తెలిపారు.

కానీ ఈలోగా కొందరు స్కూలు విద్యార్థులు అక్కడకు చేరుకోవడం వల్ల గార్డు దృష్టి మళ్లడంతో యువకుడు 18 అడుగుల లోతున ఉన్న టైగర్ ఎన్‌క్లోజర్‌లోని పడిపోయాడని క్యూరేటర్ ఖాన్ తెలిపారు.  ఈ ఘటన సుమారు మధ్యాహ్నం 1:00 గంట సమయంలో ఆ యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోగానే పరుగున అతని దగ్గరకు వచ్చిన పులి కొన్ని నిమిషాలపాటు అతన్ని ఏమీ చేయలేదు. పులి సమీపంలో నిలబడినప్పుడు ఆ యువకుడు ముడుచుకొని కూర్చుని రెండు చేతులతో దండం పెడుతూ కనిపించాడు. అయితే పులి దృష్టి మళ్లించేందుకు ఎన్‌క్లోజర్ వెలుపల నుంచి పులిపై కొందరు రాళ్లు విసరడం, సెక్యూరిటీ గార్డులు కంచెను చప్పుడు చేస్తూ అతణ్ణి బయటకు రావాలంటూ సంకేతాలిచ్చారు. కానీ ఆ చప్పుళ్లకు ఒక్కసారిగా పులి పేట్రేగిపోయింది. అందరూ చూస్తుండగానే యువకుడి మెడను నోటకరుచుకుంటూ ఈడ్చుకెళ్లింది. సెక్యూరిటీ గార్డుల వద్ద ట్రాంక్వెలైజర్ గన్‌లుగానీ (జంతువులకు మత్తు ఇంజెక్షన్‌లు ఇచ్చేందుకు ఉపయోగించే తుపాకీలు) వాకీటాకీలుగానీ లేకపోవడంతో వారు నిస్సహాయంగా ఈ దారుణాన్ని చూస్తుండటం తప్ప ఏమీ చేయలేకపోయారు.

పులి నోట కరుచుకున్న తరువాత అతను చనిపోయేంతవరకు ఎన్‌క్లోజర్‌లో విచక్షణారహితంగా పులి స్వైరవిహారం చేసిందని ఈ ఘటన ను చిత్రీకరించిన ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వరకూ జూ అధికారులు, పోలీసులు యువకుని మృతదేహాన్ని బయటకు తీసుకురాలేకపోయారు. కాగా మక్సూద్ మతిస్థిమితం ఉన్నవాడు కాడని.. స్కూల్ మానేశాడని.. ఇంట్లో చెప్పకుండా అప్పుడప్పుడూ వెళ్లిపోతుంటాడని అతని తండ్రి చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement