
ఒక్క సక్సెస్ కోసం పోరాడితే చాలు. ఆ తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇది అందరికీ జరగకపోయినా, చాలా మంది విషయంలో జరిగేది ఇదే. నటి మమిత బైజు(Mamitha Baiju ) ఇందుకు ఒక ఉదాహరణ. ప్రేమలు అనే మలయాళం చిత్రంతో మాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించిన కథానాయకి ఈ బ్యూటీ. ఆ తరువాత మాతృభాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు.
అలా రెండో అవకాశమే దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అదీ ఆయన నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్‌లో కావడం విశేషం. ఇందులో చాలా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అదే లక్కు అనుకుంటే తాజాగా మరో క్రేజీ అవకాశం ఈమెను వరించింది. అవును దర్శకుడు, కథానాయకుడిగా వరుసగా విజయాలను అందుకుంటున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రంలో కథానాయికిగా మమిత బైజూ నటించబోతున్నారన్నది తాజా సమాచారం.
ఈ చిత్రం ద్వారా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే పూర్తి వివరాలతో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద డ్రాగన్ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి మమిత బైజు నిజంగా లక్కీనే.
Comments
Please login to add a commentAdd a comment