భర్త కళ్ల ఎదుటే భార్యపై గ్యాంగ్‌రేప్
భర్త కళ్ల ఎదుటే 25 ఏళ్ల మహిళపై దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆగ్నేయ బెంగళూరులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో పోలీసులమని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు భర్తను కత్తితో బెదిరించగా, మరో ఇద్దరు అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు భర్తను కత్తితో బెదిరించి ఇంట్లోని బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం భర్త, అత్తను ఓ మంచానికి కట్టిపడేశారు. మరో ఇద్దరు భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన గతనెల 24న ఆగ్నేయ బెంగళూరులో జరిగింది.
కానీ ఈ ఘటనపై బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రాలేదు. ఘటన జరిగి నాలుగు రోజుల తర్వాత బాధితులు నిందితులపై ఫిర్యాదు చేశారు. దాంతో నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. నలుగురు నిందితులను గత నెల 31న అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వారిపై 376డి సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. అరెస్టైన నిందితులు కూడా అదే ప్రాంతానికి చెందినవారు. కాగా, ఇప్పటికే వారిపై పలు చోరీ కేసులు నమోదయ్యాయి.